(దండుగుల శ్రీ‌నివాస్‌)

రైతు భ‌రోసా విజ‌యోత్స‌వ స‌భ పెట్టి సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌ల్లో.. తెలంగాణ ప్ర‌జ‌లు పిచ్చోళ్లు కాదు.. అన్నాడు. అవును.. తెలంగాణ జ‌నం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చైత‌న్య‌వంతులే. తెలంగాణ జాతిపితను.. నాకిక ఎదురేలేదు అని చెప్పుకున్న కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లో కూర్చోబెట్టింది వాళ్లే. రేవంత్ కాదు. రేపు రేవంత్‌ను, ఆ పార్టీని మ‌ళ్లీ పాతాళానికి తొక్కేయ‌డ‌మూ వారికి తెలుసు. అంతా గ‌మ‌నిస్తారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు క‌ర్రుకాల్చి వాత పెడ‌తారు. ఇక్క‌డ ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడిన చాలా మాట‌లు అతిగానే ఉన్నాయి. స‌హ‌జంగా త‌న స‌హ‌జ‌శైలికి త‌గ్గ‌ట్టుగానే. కానీ అవే మాట‌లు.. అవే అబ‌ద్దాలు, అవే బ‌ట్ట‌కాల్చి మీదేసే ప్ర‌సంగాలు విని.. అవును.. నిజ‌మే అని న‌మ్మే ప‌రిస్థితిలో ఈ జ‌నం లేరు. ముఖ్యంగా రైతులు. ఈ విష‌యం రేవంత్ మొద‌ట గుర్తెర‌గాలి. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను త‌క్కువ అంచ‌నా వేసి త‌ను మాట్లాడుతున్నాన‌నే సోయి అత‌నికి లేక‌పోయినా.. జ‌నం అన్నీ గ‌మ‌నిస్తున్నార‌నే విష‌యం ఆ పార్టీ అగ్ర‌నేత‌లైనా ప‌సిగ‌ట్టి జాగ్ర‌త్త ప‌డాలె.

సీఎంగా కేసీఆర్ రైతుల‌కేం త‌క్కువ చేయ‌లే. ఒక‌మాట‌లో చెప్పాలంటే వేరే వ‌ర్గాల‌ను విస్మ‌రించి మ‌రీ రైతులకు ఏదైనా చేసి పేరు తెచ్చుకోవాలె అనే తాప‌త్ర‌యం అత‌నిలో చాలా ఉంది. ఈ రైతుబందు సృష్టి అక్క‌డ్నుంచి వ‌చ్చిందే. ఒక‌రికేసి మ‌రొక‌రి వేయ‌క‌పోతే బ‌డా భూస్వాముల నుంచి వ్య‌తిరేకత వ‌స్తుంద‌ని, అది త‌న ఓటు బ్యాంకు చిల్లు పెడుతుంద‌నే భ‌య‌మూ ఉంది. అందుకే ఎవ‌రికి ప‌డితే వారికి.. భూమి ఉంటే చాలు వేసేశాడు. ఇక్క‌డే దెబ్బ‌తిన్నాడు. మ‌రి ఆనాడు ప్ర‌తిప‌క్షంలో ఉండి వంద‌ల ఎక‌రాల ఆసాములు, భూసాముల‌కు రైతుబంధు ఎందుక‌ని అడిగిన రేవంతు కూడా ఇప్పుడు చేస్త‌న్న‌ద‌దే. కొన్ని మిన‌హాయింపులు త‌ప్ప‌. అదీ ఆగి ఆగి ఆలోచించి ఆలోచించి సాగ‌దీసి.. ఇప్పుడు రైతుభ‌రోసా పూర్తి స్థాయిలో వేసి పాత‌వి ఎగ్గొట్టి.. దీనికి విజ‌యోత్స‌వం అని పేరుపెట్టి.. ఇవ‌న్నీ రైతులకు తెలియ‌దా..? నువ్వేం చేస్తావో అద‌నంగా అనేది వారు చూశారు. ఉన్న‌దానికి ఎగ‌నామం పెట్టి మూడు నాలుగు సీజ‌న్‌లు బాకీ ప‌డ‌తావ‌ని కాదు. ఆ సొమ్మును మేం లాస్ అయ్యామ‌నే రైతాంగం అనుకుంటున్న‌ది. కేసీఆర్ ఉండి ఉంటే అవి కూడా ప‌డేవే క‌దా అని కూడా అనుకుంటున్న త‌రుణంలో కేసీఆర్‌ను రైతుల ముందు బోనెక్కిద్దామ‌ని అనుకోవ‌డం రేవంత్ అవివేక‌మే అవుతుంది. స్పీచ్‌లో పంచులుండాలె.. అది కేసీఆర్‌ను పొట్టుపొట్టు తిడితేనే సాధ్య‌మ‌వుతుంది అనుకుంటే … ఇంకా బొక్క‌బోర్లా ప‌డాల్సిందే.

ఫోన్ ట్యాపింగ్‌, అధికార దుర్వినియోగం, అహంకారం, ఫ్యామిలీ ప‌వ‌ర్ పాలిటిక్స్‌, సిట్టింగుల అరాచ‌కాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ వారికే టికెట్లిచ్చిన వైనం.. ఇవ‌న్నీ లోపాలు ఉన్నాయి. ఆ పాపాలే శాపాలుగా మారాయి. అందుకే జ‌నం ఈస‌డించుకున్నారు. ఆ అహంకారానికి తాత్కాలిక విరామం ఇవ్వాల‌నుకున్నారు. శాశ్వ‌త విరామం కాదు. గుణ‌పాఠం చెప్పాల‌నుకున్నారు. ఎవ‌రినీ ఎక్కువ కాలం నెత్తినెక్కించుకోవ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు తెలుసు. అందుకే కేసీఆర్ త‌న‌కు తానుగా స‌భ‌ల్లో ప్ర‌క‌టించుకున్న‌ట్టుగా… నేను ఓడితే నాకేం కాదు.. మీకే న‌ష్టం.. నేను ఫామ్‌హౌజ్‌లో రెస్టు తీసుకుంటా… న‌నే బెదిరింపు మాట‌లు మ‌రింత ఆగ్ర‌హాన్ని ర‌గిలించాయి తెలంగాణ జ‌నంలో. బెదింపుల‌కు, బ్లాక్‌మెయిలింగ్‌ల‌కు, నియంత పోక‌డ‌ల‌ను ఇక్క‌డ భ‌రించేంత సీన్ లేదు.

అందుకే ఆ న‌ష్టం ఎలా ఉంటుందో చూద్దాం అని తెలిసీ.. కాంగ్రెస్‌కు ఓటేశారు. కేసీఆర్‌ను గ‌ద్దె దించారు. గంపెడు హామీలిచ్చి గెలిచిన రేవంత్‌.. అన్నీ చేయ‌క‌పోగా.. ఉన్న‌వి కూడా ఎస‌రు పెట్టి.. ఇలా నేను చేయ‌డానికి కార‌ణం కేసీఆరే.. చేసిన అప్పులేన‌ని వ‌ళ్లెవేస్తూ రావ‌డం.. కోత‌లు పెడుతూ కాలం వెళ్ల‌దీస్తూ కోత‌ల రాయుడిలా మాట‌లు కోట‌లు దుంకించ‌డం అన్నీ చూస్తున్నారు. ఇవ‌న్నీ చాల‌వంటూ చ‌ర్చ పెట్టండి.. ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ మీరు ప‌దేండ్ల‌లో చేసింది మేము ప‌ద్దెనిమిది నెల‌ల్లో చేశాం.. అనే మాట‌లు కేసీఆర్‌కు మించిన అహంకార‌పు మాట‌లే అవుతాయి రేవంత్ జీ. రెండేండ్ల కాలంలో ఏం చేయ‌డానికి స్కోప్ లేదు. అది జ‌నాల‌కూ తెలుసు. నీకు తెలుసు. ఏం జ‌ర‌గ‌లేద‌ని. ఎందుకు మ‌రి ఇంత డాంబికం…? మాకు టైమ్ ఇవ్వ‌రా.. ? అని నువ్వే అంటావు.

ఇన్ని ల‌క్ష‌ల కోట్ల‌కు అప్పులు క‌ట్ట‌డ‌మే స‌రిపోతుంది.. ! అని నువ్వే అంటావు. అస‌లు అప్పు ఎక్క‌డా పుట్ట‌డం లేద‌నీ నువ్వే అంటావు..! న‌న్ను కోసినా ఏం చేయ‌లేన‌నీ డీలా ప‌డిపోయి.. దివాళా రాష్ట్ర‌మిద‌నీ ప్ర‌పంచానికి ప‌దే ప‌దే చెబుతావు..! ఇన్ని వేరియేష‌న్స్ ఉన్న సీఎంవు బ‌హుశా నువ్వే అయివుంటావు. ఈ లెక్క‌న కేసీఆర్‌ను మించిన ఘ‌నుడ‌వి ఈ విష‌యంలో. మ‌రి జ‌నాలు ఏమ‌నుకోవాలె. గుడ్డి క‌న్నా మెల్ల న‌యం అనుకోవాలా..? గుడ్డి ఎవ‌రో..? మెల్ల ఎవ‌రో జ‌నానికి తెలిసిపోయేలా చేసిందెవ‌రు..?

 

Dandugula Srinivas

Senior Journalist

8096677451

 

 

You missed