(దండుగుల శ్రీనివాస్)
సర్కార్‌లో ఓ కీలక పదవిలో ఉన్న సీనియర్ ఇంగ్లీష్ పాత్రికేయుడితో ఇంకో సీనియర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు. సార్.. ! మీడియాతో సంబంధమే లేని, అసలు జర్నలిస్టే కానీ వ్యక్తికి సీఎం పీఆర్వోగా నియమించారు కదా..! దీనిపై చర్చజరుగుతున్నదన్నాడు. దానికాయన వెటకారంగా ముఖం పెట్టి.. అడిగిన వాడి ముఖం మీద పిడిగుద్దు గుద్దినట్టుగా జవాబు చెప్పాడు. ఏమనంటే.. ఏ ఊకోవయా..! ఇప్పుడు జర్నలిస్టు అంటే ఎవడు..? వీడు జర్నలిస్టు అనే ముద్ర ఎప్పుడో చెరిగిపోయింది కదా. టీవీ చూసేవాడు.. అందులో వార్తలు తిలకించేవాడు. అంతెందుకు చేతిలో ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కడూ ఓ జర్నలిస్టే అన్నాడు. పాత్రికేయుడి కానీ వ్యక్తికి సీపీఆర్వోగా ఇచ్చిన దాన్ని సర్దిచెప్పుకుని, సమర్థించుకునేందుకు ఇంత మాటనలా.. వీడు వీడి వెర్రి, తిక్క, అంహకార, బలుపు మాటలు కాకపోతే.. అన్నట్టుగా ముఖం పెట్టాడా అవతలి సీనియర్.
ఇప్పుడిది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే… సోషల్ మీడియా పేరుతో ప్రతీ ఒక్కడూ విలేకరీ అవతారమెత్తాడు. సీనియర్ జర్నలిస్టయిపోయాడు. వాడే వార్త వండి వారుస్తాడు. తనకు కావాల్సిన విధంగా. ఎవడిని టార్గెట్ చేయాలో వాడిని కచ్చగా. ఏ మాత్రం దాంట్లో ఆలోచన ఉండదు. చెప్పాలనుకున్నది బండగా, బండబూతుగా, నిర్లజ్జగా, బట్టలిప్పేసినట్టుగా ఉంటుందా వార్త. జర్నలిస్టు వాసనలో ఎంతో కొంత ఉన్న ఎవడైనా ఆ వార్త చూడగానే పక్కా ఇది ఎవడో వండి వార్చాడు. ఇది ఫలానా పార్టీకి చెందిన కార్యకర్త, లీడర్, సానుభూతి పరుడేనని తేల్చేస్తాడు.
కొంతమంది దాన్ని గుర్తించలేరు. గుర్తించినా కొందరు అబ్బ ఏం రాశాడురా..? బురద భలే చల్లాడు. మనవంతుగా దీనికి న్యాయం ఎలా చేయాలా..? అని ఆలోచించి ఇగ దానికి తన పైత్యపు మాటలను జోడించి ఇగ తెగ వైరల్ చేసే పనిలో ఉంటాడు. సచ్చు సన్నాసులంతా కలిసి ఓ శవవార్తను ఊరేగిస్తారు. దానికి మాంచి పేజీ లుక్కు. ఫోటోషాప్ తెలిసినోడిని పట్టుకుని రోజూ ఇవే పనులు చేసేందుకు వాడికి జీతమిస్తారు కాబోలు. ఇలాంటి ముఠా ఒకటి తయారయ్యింది. రెండు పార్టీలు. ఏ పార్టీ ఇందులో సుద్దపూస కాదు. వాడి మీద వీడు.. వీడి మీద వాడు. ఎవడెంత క్రియేటివిటి జోడించి .. అవతలి వాడిని డ్యామేజీ చేశామా అనేది ముఖ్యం. ఈ వాట్సాప్, సోసల్ మీడియా యూనివర్సిటీ చెత్త వెధవలకు ఇదే ప్రమాణికం. ఇవే విలువలు, కట్టుబాట్లు , నిబంధనలు.