(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ దేవుడే. కానీ చుట్టూ దయ్యాలె ఉన్నాయన్నది కవిత. అదే డైలాగ్ ఆమెకూ వర్తించింది. మరి నీ దగ్గర దయ్యాల సంగతేందక్కా..? అని అడగడం మొదలుపెట్టారు. మొత్తానికి తన చుట్టూ ఉన్న దయ్యాలపై కూడా నజర్ పెట్టినట్టుంది కవిత. ఇప్పటి వరకు ముగ్గురికి చెక్‌పెట్టింది. ఇంకా చాలా దయ్యాలె ఉన్నాయి. వారంతా పాతుకుపోయారు. ఆమె చెవులు కొరుకుతూ ఉన్నవీ లేనివి చెప్పే దయ్యాలన్నమాట. జనాలతో కలవనీయరు. వచ్చిన వారిని ఇంట్లోకి పోనియరు. గేటు బయటే ఉంచుతారు. వారంతా ఎదురు చూసీ చూసీ వెళ్లిపోతారు.
అలా కారులో కూర్చుని బయటకు వచ్చి ఆగకుండా అన్నా బాగున్నావే.. అని ఓ నవ్వు నవ్వి రయ్యిన కారులో వెళ్లిపోతుందీమే. బాగా అలవాటై పోయింది ఇలాగే. అందుకే జనాలు ఆమెకు దూరమయ్యారు. చుట్టూ చేరిన దయ్యాలు మరింత దూరం చేశారు జనానికి. కేసీఆర్ తన చుట్టూ దయ్యాలను పట్టించుకోలేదు. పట్టించుకోడు కూడా. ఎవరో తనకు చెబితే తను వింటాడా..? ఆ విషయం కవిత కూడా తెలుసు. కానీ తన ఉనికి చాటుకునే క్రమంలో ఆమె తప్పని సరి పరిస్థితుల్లో ఇలాంటి అంతర్గత విషయాలు బయటకు చెప్పాల్సి వచ్చింది. అన్న కేటీఆర్‌తో మంచి సంబంధాలుండి తన వద్ద ఉండే టీమ్‌లో ఉండే వారికి మొదట చెక్ పెడుతున్నదామె.
ఆ తరువాత జనానికి, తనకు గ్యాప్ పెంచే టీమ్ మరొకటుంది. తన పేరు చెప్పుకుని బతికే పరాన్నబక్కులు ఇంకొందరున్నారు. వీరందరూ ఇప్పుడు ఇంకా ఆమె చుట్టే ఉన్నారు. ఉంటారు కూడా. ఆమెకు కొన్ని విషయాలు తెలిసినా తీసేయలేని పరిస్తితి. చాలా విషయాలు తెలిసినా పొమ్మనలేని దుస్థితి. అందుకే ఆ దేవుడి దగ్గర దయ్యాలు ఎలా పాతుకుపోయాయో.. ఈ దేవత దగ్గర కూడా అలాగే పాతుకుపోయాయి. అన్న కేటీఆర్ దగ్గరా ఉందండోయ్ ఓ దయ్యాల టీమ్. దాన్నీ ఎవరూ పారదోలలేరు. మొత్తంగా దేవుండ్లు, దేవతల చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. వీరిని బయటకు పంపే మంత్రం ఏంటో వారికింకా తెలియదు. అవి దయ్యాలే కావనుంటున్నాయి ఈ దేవుండ్ల, దేవతల టీమ్.
