(దండుగుల శ్రీనివాస్)
అమ్మిన ధాన్యం సొమ్ము వచ్చి ఖాతాల్లో పడ్డది. అంతా హ్యాపీ. ఇప్పుడు వానాకాలం సీజన్ చాలు కాబోతుంది. నెల రోజుల పాటు నాట్లు వేసుకుంటారు. దుక్కులు దున్నడం, విత్తనాలు వేసుకోవడం, ఎరువులు తెచ్చుకోవడం, కూలీలకు కైకిళ్లు… ఇలా వరిసాగుకు పెట్టుబడి బాగానే ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో సర్కార్ రైతుభరోసా వేసింది. ఇప్పటికే మూడెకరాలు ఉన్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా పడింది. ఇక వారం లోపు మిగితా వారికి కూడా. నిజం చెప్పాలంటే రైతులు సంతోషంగా ఉన్నారు. సరైన సమయానికి భరోసా పైసలు పడ్డాయని. అసలు వేస్తారా..? వెయ్యరా..? వేస్తే ఎప్పుడేస్తారు.? అనే సవాలక్ష అనుమానాలుండె రైతాంగంలో.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా సీజన్‌కు సరైన సమయంలో డబ్బులు పడేటివి కాదు. ఆగి ఆగి.. ఆపి ఆపి ..కొన్ని కొన్ని అలా సీజన్ ముగిసే వరకు రైతుబంధు పూర్తి చేసేవాళ్లు. కానీ ఈ వానాకాలం సీజన్‌కు సరిగ్గా సమయానికి రైతు భరోసా పైసలు పడ్డాయి. ఒక ఎవరి దగ్గరా చేతులు చాపాల్సిన పనిలేదు. అప్పుల జోలికి వెళ్లాల్సిన దుస్థితి అసలే లేదు.
కానీ కాంగ్రెస్ శ్రేణుల్లోనే నైరాశ్యం అలుముకున్నది. సర్కార్‌పై భరోసా వారికే లేనట్టుంది. ప్రచారంలో బాగా వెనుకబడ్డారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రాజకీయాలకు స్పందిస్తారు. మార్పింగులు, గ్రాఫిక్స్‌లతో ఆనందం పొందుతారు తప్ప ఇలాంటి వాటిపై మాత్రం పాజిటివ్ కామెంట్లు, ప్రచారం జోలికి వెళ్లరు. చెప్పేవాళ్లు లేరు. చేసేవారు కరువయ్యారు. ఉన్నవారికి భరోసా కరువయ్యింది. మొత్తంగా సర్కార్‌పైనే నమ్మకం సడలింది. గతంలో ఇగ రేపేస్తాం, మాపేస్తాం అని రైతుభరోసా వేయకుండా కాలయాపన చేసిన రోజులు గుర్తున్నాయి. ఇదీ అలాగేనా .? అనే అనుమానమూ కొందరిలో లేకపోలేదు. అయితే వచ్చేవి లోకల్‌బాడీ ఎన్నికలు.. మరీ ఇప్పుడు కూడా మాట తప్పితే ఇక నమ్మెదెవరు బాసు…? ముందైతే మీరు నమ్మాలి కదా సర్కార్‌ని. సన్నబియ్యం కు చేసిన హడావుడిలో పదిశాతం కూడా దీనికి చేయలేదెందుకో..? ఇది మీరిచ్చే ప్రయార్టీ. ఎప్పుడు గుర్తిస్తారు..? ఎప్పుడు మారుతారు..?? పాపం.. రేవంతు…!
Dandugula Srinivas
Senior Journalist
8096677451