(దండుగుల శ్రీనివాస్)
చూసిండ్రా..! ఎంత అహంకారమో. ఇంకా మారలేదు. ఎట్ల మాట్లాడుతున్నరో చూసిండ్రు కదా… సీఎం రేవంత్‌రెడ్డి అన్నాడు కేటీఆర్‌నుద్దేశించి. అధికారంలో ఉన్నప్పుడు అందరూ అంతే. కానీ ఇక్కడ ప్రతిపక్షంలోకి పోయిన తరువాత కూడా కేటీఆర్ మారలేదు. అది నిజమే. కానీ రేవంతుడేమీ ఇందులో తక్కువేమీ కాదు. ఎందుకంటే.. అప్పుడు కేసీఆర్ సీఎం పీఠం మీద కూర్చుని ఇట్లనే మాట్లాడిండు. అధికారం గురించి.మమ్మల్నెవడూ పీకేవాడే లేడు. మరో నాలుగు టర్ములూ మేమే అన్నాడు. మా అమ్ముల పొదిలో ఇంకా చాలా చాలా అస్త్రాలున్నాయి.. అవి ఒక్కొక్కటిగా తీస్తం. మీరు తట్టుకోలేరన్నాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశాడు. జనాలు ఫామ్‌హౌజ్‌కు పంపారు.
సేమ్.. ఇప్పుడు రేవంత్ అదే మాటంటుండు. కేటీఆర్ .. నువ్వు అరిచి గీ పెట్టినా.. బట్టలు చింపుకున్నా.. రోడ్ల మీదకెక్కి ధర్నా చేసినా.. మేమే మరో పదేళ్లు.. ఇది తథ్యం… రాసిపెట్టుకో అన్నాడు. అప్పుడు కేసీఆర్ ఇరవై ఏండ్లంటే. ఇప్పుడు రేవంత్ పదేండ్లంటుండు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు ఈ విషయంలో. ఇక్కడే జనానికి కాలేది. మేము కదా తీర్పిచ్చేది. మీరే డిసైడ్ అయితారా…? ఓటరుకు అహం దెబ్బతిని తుక్కు తుక్కు ఓడగొడతారు. ఇది తెలుసుకోలేక నేతలు నీతులు పలుకుతూ తమ గోతులు తామే తోడుకుంటారిలాగ.
అవును.. రేవంతు… అప్పులంటున్నావ్..! కోసినా ఏం ఇవ్వలేనంటున్నావ్.. ముక్కుతూ మూలుగుతూ పాలన చేస్తున్నావ్… ఇప్పటికే జనం చీదరింపులకు గురవుతున్నావ్…..! మరెలా ఇంకోసారి అధికారంలోకి వస్తావు.. నువ్వూ కేసీఆర్‌లా అమ్ముల పొదిలోంచి ఒక్కొక్క అస్త్రమే తీసి జనం మీదకు వదులుతావా..? నువ్వేం వదిలినా.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినంకనే. లేకపోతే జనం నమ్మరు గాక నమ్మరు. ఇన్ని మైనస్‌లు మన దగ్గర పెట్టుకుని అప్పుడే రాబోయే కాలం గురించి జోస్యం చెప్పుకుని మనది మనమే శభాష్.. శభాష్ అని జబ్బలు చరుచుకుని ఆ తరువాత నాలుక్కర్చుకుని ఆపై బొక్కబోర్లాపడిపోయి.. చావు తప్పి కన్నులొట్టబోయి…. ఇవన్నీ అవసరమా..!
Dandugula Srinivas
Senior Journalist
8096677451
https://youtu.be/0VTbaYDxecg?si=de3MY1JofMwA5PLH