వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్
రచ్చ గెలిచేందుకు రచ్చ రచ్చ చేసిన కవిత.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు తండ్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో తన ఉనికినే లేకుండా చేసిన తన సొంత పార్టీ నేతలతో ఆమె తలపడుతోంది. వారి బాధితులనందరినీ ఏకం చేసి తనకో కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుంటోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తోంది. ఏదో ఒక పేరుతో. దైవదర్శనాల పర్యటనలతో.
నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఆమెకు పట్టులేకుండా చేశారు. ఇప్పుడామె ఆజాదీ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్లి.. తన వాళ్లను, తనను నమ్ముకున్నవాళ్లను, తనపై నమ్మకం ఉంచిన వారిని చేరదీస్తున్నది. తన ఓటమికి లోకల్ ఎమ్మెల్యేలే కారణమని ఆమె లేఖలో పేర్కొన్న తరువాత అందరికీ అర్థమైపోయింది. ఇక ఆమె తాజా మాజీలతో పోరుకు రెడీ అయ్యిందని. తన దారి తను చూసుకుంటున్నదని.
అందుకే వారి మీద కోపంతో ఉన్న వారంతా ఇప్పుడు కవిత పంచన చేరుతున్నారు. బాహాటంగానే వారు కూడా ఆమెను కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఫ్లెక్సీలు పెడుతున్నారు. మొత్తం నిజమాబాద్ జిల్లాను ఆమె చుట్టేసి ఇంట గెలవాలని తపన పడుతోంది. మొన్నటి వరకు లోకల్ తాజా మాజీలతో ఉన్న ప్రచ్చన్న యుద్దం .. ఇప్పుడు బాహాటంగానే కొనసాగనుంది. ఇప్పుడు కవిత లోకల్ బలప్రదర్శనలో, తన టీమ్ ఏర్పాటులో బిజీబిజీగా ఉన్నది.