(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
తీహార్ జైలులో ఉన్నప్పుడే కవిత కక్షతో రగిలిపోయారా..?
తన తండ్రి కేసీఆర్‌కు అత్యంత అనుచరుడైన వ్యక్తిని కాపాడి ఆయనను సంతోషపెట్టి తనను బలి చేశారని రగిలిపోయారా..?
తండ్రి తనపట్ల సరైన మమకారం చూపలేదని బాధపడ్డారా..?
కన్నబిడ్డెగా తనకు సరైన సహకారం అందించలేదని భావించారా..?
జైలు నుంచి విడుదల కాగానే ఆమె కాంగ్రెస్‌కు కోవర్టుగా మారారా..?
జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌజ్ లో డ్రగ్స్‌పార్టీ జరుగుతుందని పోలీసులు దాడి చేసిన కేసులో ఆమె అనుచరులే సమాచారం అందించారా..?
ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది.
సొంత గూటి నుంచి వచ్చిన సమాచారంలో కేటీఆర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని, ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనేది తరువాత బట్టబయలు అయ్యిందని ప్రస్తుతం వెలుగు చూస్తున్న సత్యాలు.
ప్రస్తుతం ఉద్యమనేత, బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వింతైన చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వస్తున్నది. తాను కాపాడుకున్న కంటిరెప్పనే కాటేస్తుందని ఆయన ఊహించలేదు. ఏ కన్నకూతురు కోసం రాజీపడి అధికారాన్ని కోల్పోయారో, ఎవరి కోసం ఎంపీ ఎన్నికల్లో రాజీపడ్డారో.. వారే తిరుగుబాటు చేసి ప్రత్యారోపణలు చేస్తుండటం ఆయనను కుంగదీస్తున్నది. లిక్కర్ స్కాంలో తొమ్మిది నెలల పాటు అండర్ ట్రయల్ ఖైదీగా కఠిన కారాగార జీవితాన్ని అనుభవించిన కవిత.. తనను సొంత మనుషులే అన్యాయం చేశారని ఆవేదనతో రగిలిపోయారని, జైలు నుంచి విడుదల కాగానే తన ప్రతాపం చూపడం మొదలు పెట్టారని తెలుస్తోంది.
తన రక్తం పంచుకు పుట్టని తన అనుచరుడైన వ్యక్తిని కాపాడిన తండ్రి .. తన విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాడని బాధతో ఆమె రగిలిపోతున్నట్టు.. అందుకే జైలు నుంచి విడుదలైన వెంటనే ధిక్కార స్వరం వినిపిస్తూ.. దేవుడు దయ్యాల మాట మాట్లాడినట్టు తెలుస్తున్నది. కవిత తన తండ్రిపైనే ధిక్కార లేఖను సంధించినట్టు వాస్తవం ముందే బయట పెట్టిన విషయం తెలిసిందే. ఆమె అమెరికా నుంచి వచ్చే సమయంలోనే ఈ లేఖ విడుదల కావడం కలకలం సృష్టిస్తోంది. మొదట కేసీఆర్ శిబిరం నుంచే లేఖ విడుదలైందని ప్రచారం జరిగినప్పటికీ, కవిత అనుచరులే దాన్ని బయట పెట్టారని కేసీఆర్ శిబిరం ఇప్పుడిప్పుడు నిర్దారణకు వస్తోంది. జైలు నుంచే అంతర్గత విభేదాలు మొదలైనప్పటికీ, వరంగల్ రజతోత్సవ సభతో ఇది మరింత ముదిరింది. రజతోత్సవ సభలో జిల్లా నాయకులకు ప్రాధాన్యతను ఇవ్వాలని, బడా నాయకత్వం పెద్దగా జోక్యం చేసుకోరాదని కేసీఆర్ చెప్పిన సూచనను కవిత బేఖాతరు చేశారు. అదే సమయంలో కేసీఆర్ .. హరీశ్‌రావు కూడా గీత దాటారని కన్నెర్ర చేశారు. ఆయన పాత్ర కూడా పరిమితం చేశారు. అలిగిన హరీశ్‌రావును కేటీఆర్ బుజ్జగించి తిరిగి ఆయనను కేసీఆర్ శిబిరంలోకి తీసుకొచ్చి శాంతింపజేశారు. అదే సమయంలో కవిత ఎవరితో సంబంధం లేదన్నట్టు దూసుకుపోవడం జిల్లాల వారీగా పర్యటించడం తండ్రి కేసీఆర్‌కు నచ్చలేదు. అప్పట్నుంచి మరింత దూరం పెరిగింది.
కవిత కోసం బీజేపీ రాజీ..ఎంపీ ఎన్నికల్లో పరోక్ష దోస్తీ..
తీహార్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా తీవ్ర అనారోగ్యం పాలైన క్రమంలో తల్లడిల్లిన తండ్రి కేసీఆర్.. కవితను విడుదల చేయించడానికి చేయని ప్రయత్నం లేదు. అదే సమయంలో కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావును కూడా ఢిల్లీకి పంపించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బెయిల్ కోసం బీజేపీ అగ్రనాయకులతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. ఇదే క్రమంలో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వంతో రాజీ పడాల్సి వచ్చిందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కూడా పెద్దగా శ్రద్ధ వహించకుండా పరోక్షంగా బీజేపీకి సహకరించారనే ఆరోపణలున్నాయి. ఎవరి కోసమైతే రాజీ పడ్డారో.. ఆమెను ఈ రోజు శాపమై వెంటాడుతున్నది.
వాస్తవానికి, కవిత జైలు నుంచి విడుదలైన తరువాత కేసీఆర్ ఆమెను పిలిపించి రాజకీయంగా దూకుడు వద్దని, ఆచితూచి వ్యవహరించాలని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్న క్రమంలో తొందరపాటు వద్దని చెప్పారు. కానీ కవిత తన సహజ శైలిలో, తన అన్న కేటీఆర్ కంటే కూడా దూకుడుగాప్రవర్తించారు. సామాజిక తెలంగాణ, మహిళా తెలంగాణ అనే నినాదంతో ముందుకు కదిలారు. వాస్తవానికి, సామాజిక తెలంగాణ అంటే ఎటువంటి సమస్యలు వస్తాయో కేసీఆర్ కవితకు వివరించారు. అయినా ఆమె ఖాతరు చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని ఎదురు ప్రశ్నించారు. అక్కడ్నుంచే ఆమె తన స్పీడ్‌ను పెంచారు. కాంగ్రెస్‌తో కూడా పరోక్ష సంబంధాలు మెరుగుపరుచుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఆమె మాటకు రేవంత్ సర్కార్‌లో చాలా చెల్లుబాటు జరిగిందని, ఆమె అనుచరులకు భారీ ఎత్తున చాలా పనులు కూడా చేయించిపెట్టారని బలమైన ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తెగించిన ఆమె .. ఆరు నెలల కిందట జన్వాడ ఫామ్‌హౌజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే పోలీసుల దాడి సమాచారాన్నిపోలీసులకు చేరవేయడం వెనుక కవిత మనుషుల హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఆ రోజు కేటీఆర్ పార్టీకి హాజరు కాకపోవడం, కుటుంబ సభ్యులు కొంతమందే హాజరుకావడంతో బీఆరెస్ పార్టీకి పెద్ద డ్యామేజీ జరగలేదు. అప్పట్నుంచి కీలకమైన సమాచారాలు ప్రభుత్వానికి ఒక పద్ధతి ప్రకారం చేరుతున్నాయని బీఆరెస్‌లో అనుమానాలు బలపడ్డాయి. ఆ రోజు నుంచి కవితకు, కేటీఆర్‌కు మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. ఈ పరిణామాలన్నీ బీఆరెస్ అధినేత కేసీఆర్‌ను తీవ్ర కలవరానికి గురి చేశాయి. కాంగ్రెస్‌కు కోవర్టుగా మారిందన్న అనుమానంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి పేరిట పార్టీని స్థాపించడానికి ఆమె సిద్ధమైతున్నట్టు తెలుస్తున్నది.