(దండుగుల శ్రీనివాస్)
బిడ్డె అంటే మమకారం, ప్రేమ. చిరంజీవి కవిత.. .అని ఆప్యాయంగా వేదికల మీద పిలుచుకునే ఆప్యాయత. అందులో డౌట్ లేదు. కన్నబిడ్డంటే ఎవరికి ప్రేముండదు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమని సలహా ఇచ్చి రాజకీయంగా ఓనమాలు నేర్పించింది ఆయనే. ఆయనే ఆమెకు గురువు. ఇందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు వేరే పార్టీ పెట్టినా.. వెనుక ఆయనే ఉంటాడు. నిధులు ఆయనే సమకూరుస్తాడంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే ఆమెను బిడ్డెగానే చూశాడు తప్ప ఆ తండ్రి ఏనాడూ రాజకీయ వారసురాలిగా చూడలేదు. ఇదో తన పని తాను చేసుకుంటూ ఓ పదవిలో కొనసాగుతూ తన నీడలో సేదతీరుతుందని అనుకున్నాడు. అభిప్రాయపడ్డాడు. వదిలేశాడు.
అంతకు మించి ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. పట్టించుకోలేదు. కానీ తండ్రి అనుకున్నదొకటి… బిడ్డె చేస్తూ పోయిందొక్కటి. రాజకీయంలో రాటుదేలిందామె. పవర్ పాలిటిక్స్ చవి చూపిందామె. తండ్రి చాటు బిడ్డెగా జనం ఇస్తున్న మర్యాద పొందినా… గౌరవం దక్కినా తనముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చిందామె. జాగృతి పేరుతో అవకతవకల ఆరోపణప్పుడే ఆ తండ్రి మందలించాడు. వినలే. వదిలేశాడు. ఎంపీగా రెండోసారి ఓడిన తరువాత ఇక ఆమెను రాజకీయంగా కాదనుకున్నాడు. మరిచిపోయాడు. తనకు ఆమె ప్రియమైన బిడ్డె. అంతే. జనాల నాడి తెలుసుకోకుండా, జనంతో మమేకం కాకుండా, నేల విడిచి సాము చేసి… తనదైన లోకంలో, చెప్పుడు మాటల రాజకీయంలో బిడ్డె బందీ అయ్యిందని అర్థం చేసుకోవడానికి ఆ తండ్రికి ఎంతో సమయం పట్టలేదు. అందుకే ఆమె ఓడినప్పుడే దూరం పెట్టాడు. వదిలేశాడు. పట్టించుకోలేదు. బలవంతంగా ఆ తరువాత ఎమ్మెల్సీ. లేకపోతే ఆమెపై నమ్మకం ఉంటే…. సురేశ్‌రెడ్డికి రావాల్సిన రాజ్యసభే వచ్చి ఒళ్లో వాలేది. బిడ్డె పై ప్రేమ చావదు. మమకారం వీడదు. కానీ రాజకీయంగా ఆమెకు ఇక సపోర్టు చేయనుగాక చేయననే ఫిక్స్ అయ్యాడాయన.
కొడుకుపై అలవిమాలిన ప్రేమ. బిడ్డెకు మించి. కానీ కొడుకును పూర్తిగా నమ్మలేని స్థితి. ఇంకా రాజకీయంగా పరణతి సాధించలేదనేది కచ్చితమైన అభిప్రాయం. అందుకే వేచి చూసే దోరణే సీఎం చేయడానికి. చాన్స్ వచ్చినా కొడుకు చేతిలో పీఠం పెట్టడానికి తటపటాయించాడు. పార్టీ పగ్గాలు దాదాపుగా ఇచ్చేశాడు. అంతా కొడుకు యావే. చచ్చేలోపు సీఎం చేయాలి. అంతే. ఇక జీవితానికి ఏ పెద్ద కోరికలు లేవు. మదిలో అదే అంతర్మథనం. కొడుకు దుందుడుకు స్వభావంపై పెదవి విరుపు. తనకు మించిన అహంభావంపై ఆందోళన. బిడ్డె గురించి లేదు ఏ ఆలోచన.
ఢిల్లీ లిక్కర్ స్కాం. ఎక్కడ దెబ్బ కొట్టాలో రాజకీయంగా అక్కడే తగిలింది కేసీఆర్‌కు. ఎంతవాడుగానీ… అన్నట్టు సెంటిమెంట్‌కు లొంగని ధీరోదాత్తుడుంటాడా..? కేసీఆర్ కుంగిపోయాడు. మానసికంగా నరకం చూశాడు. కొన్ని షరతులకు లొంగాడు. అప్పటికే ఓటమి చవిచూశాడు. ఇక లొంగక, ఒప్పుకోక తప్పని స్థితి. బిడ్డె కోసం మెట్లు దిగాడు. నేలకు వచ్చాడు. అయినా ఆమె మదిలో సూపర్ హీరో ఆ డ్యాడీ. ఇంకా ఏదో చేసేదుండే. చేయలే. తననుకుంటే ఇన్ని రోజులు తను జైల్లో చిప్పకూడు తినాల్సి వచ్చెనా..? లేదు. ఇది ఆమె అభిప్రాయం. అందుకే నాన్నంటే అప్పటి వరకు ఉన్న అభిప్రాయం మారుతూ వచ్చింది. పార్శాలిటీ ముసుగులో తనకన్యాయం చేస్తున్నాడనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. కొడుకు కోసమే ఆయన జీవితమని, తన గురించి ఇక ఆలోచించే స్థితి లేదని తెలిసిపోయింది. తేరుకున్నది. భవిష్యత్ ఏంటని ప్రశ్నించుకున్నది. నాన్న చూపిన దారే. అదే జాగృతి. అక్కడ్నుంచే మళ్లీ మొదలు పెట్టింది. పార్టీ లీడర్లెవరూ తోడు రారు. తెలుపు. జాగృతితోనే ముందుకు సాగాలి. తనకంటూ ఓ అస్థిత్వం ఉండాలె రాజకీయాల్లో అంటే ఏదో సాహసం చేయాలె. లేదంటే నాలుగ్గోడలకు పరిమితం చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే వేరు కుంపటి కోసం డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా ఆట మొదలైంది.
కేసీఆర్‌కు తెలుసు. ఇలాంటిదేదో జరుగుతుందని. కానీ దిగిరాడు. మందలించడు. బుజ్జగించడు. డోంట్‌కేర్ అంటాడు. బిడ్డె బిడ్డెనే. కానీ రాజకీయంగా ఎవరి గోల్ వారిదే. ఎంచుకున్న ప్లాట్ ఫాంలో ఎత్తుపల్లాలు, ఎదురు దెబ్బలుంటాయి. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. అది కేసీఆర్‌కు తెలుసు. అందుకే వదిలేశాడు. తన గోల్ తనది. మళ్లీ అధికారంలోకి పార్టీని తీసుకురావాలె. మొదట తానే సీఎం. ఆ వెంటనే కొడుకు పట్టం. ఇదే ఇప్పుడున్న ప్రధానమైన గోల్. ఈ లేఖల, కాకిగోల, కవిత గోలంతా పట్టించుకుని పక్కదారి పట్టే స్థితిలో లేడు. లైట్ తీసుకున్నాడు.
చేయాల్సిన కర్తవ్యం ముందు, దిద్దుకోవాల్సిన తప్పిదాల ముందు.. ఈ ఎపిసోడ్ నత్తింగ్.
(Dandugula SRINIVAS)
8096677451