(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
బీఆరెస్ బీజేపీతో కలిసి పోనుందా..? పొత్తు కుదుర్చుకోనుందా..? బీజేపీ పట్ల బీఆరెస్ అధినేత కేసీఆర్‌కు ఎందుకు అంత ఉదాసీనత..? కేసీఆర్ వ్యూహంలో లోపం ఉందా..? ఆయన వాణిలో ఆయన బాణిలో వాడీవేడీ తగ్గిందా..? ఉద్యమ కష్టకాలంలో కలిసి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యత లేదు.. ఈ మాటలన్నది ప్రతిపక్ష నాయకులు అనుకుంటే పొరపాటే. తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారాల కూతురు కే కవిత లేఖలో ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలివి. కల్వకుంట్ల కవిత పార్టీ వ్యవహారాల పట్ల విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తండ్రికి సుధీర్ఘ లేఖ రాశారని, ఏపీలో షర్మిల మాదిరిగా తిరుగుబాటలో పయనిస్తున్నారని వాస్తవం ఇటీవల వెల్లడించింది.
సామాజిక సమతుల్యత, పార్టీలో పరపతి లేని వారికి పెత్తనం ఇవ్వడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని వాస్తవం వెల్లడించిన విషయం విదితమే. ఇన్నాళ్లూ అంతర్గతంగా సీక్రెట్‌గా ఉన్న లేఖ ఈ రోజు బహిర్గతమైంది. తీవ్ర కలకలం సృష్టిస్తున్న లేఖ.. కేసీఆర్ శిబిరం నుంచా కవిత శిబిరం నుంచి బయటపడిందా..? అన్నది తీవ్ర చర్చకు తెరలేపింది. లేఖలో వరంగల్‌లో జరిగిన రతజోత్సవ సభను తన విమర్శలకు కేంద్రంగా గురిపెట్టారు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు రెండు మంచి మాటలు చెప్పి పలు వైఫల్యాలను ఎత్తిచూపారు. బీజేపీపై మొక్కుబడిగా మాట్లాడటం, బలమైన విమర్శలు చేయకపోవడం, బీసీల విషయం ప్రస్తావించకపోవడం, వక్ఫ్ చట్టంపై మాట్లాడకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వాస్తవానికి గ్రౌండ్ లెవల్లో కాంగ్రెస్ నమ్మకం కోల్పోయిందని, దానికి ఆల్టర్నేటివ్ ఫోర్స్‌గా బీజేపీ బలపడుతుందన్న అనుమానాలకు కేసీఆర్ స్పీచ్ ఊతమిచ్చేలా ఉందని ఆమె పరోక్షంగా విమర్శించారు. భవిష్యత్‌లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయని, ఇది మంచిది కాదని, తనను జైలు పాలు చేసి ఇరకాటంలో పెట్టిన పార్టీ పట్ల ఈ ఉదాసీన వైఖరేమిటని ఆమె ప్రశ్నించారు. మొత్తానికి వరంగల్ సభలో వాడీవేడీ , ఉద్యమకాలం నాటి జోష్ ఏదీ లేదని ఆమె తేల్చి చెప్పారు.
కవిత స్వహస్తాలతో రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయ్యిందనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది.
కవితకు అల్టిమేటమా..?
గెటవుటా..?
కవిత జైలు పాలై విడుదలైన తరువాత ఆమె వైఖరిలో చాలా మార్పు వచ్చిందని పార్టీలో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ గీత దాటి కాస్త తెగించి వ్యవహరిస్తున్నారని బలమైన విమర్శలున్నాయి. లేఖాస్త్రం సంధించడమే కాకుండా పార్టీకి ప్రత్యర్థులు, బద్ద శత్రువులైన వారితో కూడా ఆమె కాస్త కలగొలుపుగానే ఉంటుందనే అంశం పార్టీని కలవరపెడుతున్నది. ఆమె మాట ప్రస్తుతం రేవంత్ సర్కార్‌లో కూడా చెల్లుబాటవుతుందని అనుమానాలు బీఆరెస్ పార్టీలో ఉన్నాయి. ఇబ్బందుల్లో ఉన్న తన అనుకూలురులను ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు సర్కార్‌లో ఫలించాయని సమాచారం పార్టీ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది.
ఒక మంత్రి, ఒక బడా కాంట్రాక్టర్‌తో కూడా కవిత ఇటీవల సమావేశమైనట్టు బలమైన పుకార్లు షికారు చేస్తున్నాయి. అత్యంత సంక్ష్లిష్టమైన సమస్యలకు కూడా ఆమె ఫోన్ చేసి పరిష్కరించినట్టు తెలుస్తున్నది. పార్టీకి కొరకరాని కొయ్యగా కవిత తయారయ్యారు. ఈ వరుస పరిణామాలన్నింటిపై తీవ్రంగా గుర్రుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత పట్ల కఠినంగా వ్యవహరించాలా..? బుజ్జగించాలా అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఆమెను పిలిపించి అల్టిమేటం ఇవ్వడమా..? ఆమె దారిని ఆమె చూసుకోమని చెప్పడమా..? అనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యర్థులతో అంటకాగడం మానుకోవాలని హెచ్చరించనున్నారు. లేనిపక్షంలో కవితను పార్టీ నుంచి తప్పించడమా.. ఏ విషయమనేదానిపై సమాలోచనలు చేస్తున్నారు. కవిత వేరు కుంపటి పెట్టుకుంటున్నట్టు మరో సమాచారం.