(దండుగుల శ్రీనివాస్)
పాలనలో ఇంకా రేవంత్ తనదైన ముద్ర వేసుకోలేదు. చెప్పాలంటే ప్రభుత్వం ఇంకా స్టార్టింగ్ ట్రబుల్‌లోనే ఉంది. ఓ సన్నబియ్యం పథకం మినహా ఆ పార్టీకి జీవం పోసేలా ఏ పథకమూ జనాల్లోకి బలంగా వెళ్లలేదు. అన్నీ బాలారిష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కాగానే కేసీఆర్ గురుతులు చెరిపేస్తానన్న రేవంత్.. అందులో మాత్రం యమ స్పీడ్‌గా ముందుకుపోతున్నట్టనిపిస్తుంది. మార్పు కోరి ప్రజాపాలన తెచ్చారని చెప్పిన రేవంత్.. ప్రజల జీవితాల్లో కొత్త మార్పులు ఏం తేలేదుగానీ, కేసీఆర్ గురుతులు చెరిపే మార్పులకు మాత్రం వడివడిగా అడుగులు వేశాడు. టీఎస్ నుంచి టీజీగా మార్చడం నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్లో మార్చిన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిమ స్థాపించేంత దాకా.
తనదైన బ్రాండ్ ప్రతీ నిర్ణయంలో కనిపించాలని తపిస్తున్న రేవంతు.. కేసీఆర్ గతంలో తీసుకుని అభాసుపాలైన నిర్ణయాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉంటున్నాడు. కలెక్టర్ల కాళ్లు మొక్కుడుపై అందుకే మొన్న చాలా సీరియస్ అయ్యాడు. కాళేశ్వరం ద్వారా యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచి తన పేరు తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆశించిన కేసీఆర్‌కు భంగపాటును మిగిల్చేలా … అది ఉత్త చెత్త ప్రాజెక్టని, లక్ష కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని, దీనిపై విచారణకు రావాలని కమిషన్ నోటీసు పంపేదాకా వ్యవహారం నడిపించాడు. దేశం ముందు కేసీఆర్ చేసిన కాళేశ్వరం ఓ విఫల ప్రయత్నమని, అవినీతి కూపమని చెప్పే ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా చేస్తూ వస్తున్నాడు. కొంత అనుకున్నది సాధించాడు కూడా.
అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశాడని తెలంగాణకే కాదు యావత్ దేశానికి చెప్పేందుకు కాలుకు బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నాడు. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు కన్నా దారుణంగా స్పీచులలో వల్లెవేస్తున్నాడు. ఇక ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే.. కాదన్నపని చేసి చూపుతున్న రేవంత్ గురించి. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చొద్దన్నారు. మార్చి చూపాడు. సెక్రటేరియట్ వద్ద తల్లిని ప్రతిష్ఠించి తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా దాని ముందే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. స్వామిభక్తి చూపడంతో పాటు తన హయాంలో ఎప్పటికీ ఇది గుర్తుండాలనే తపన, యావ రేవంత్‌లో కనిపిస్తున్నది.
ఇవన్నీ తీసేస్తామని కేటీఆర్ ఎంత చెప్పినా.. తను మాత్రం కేసీఆర్ గురుతులను చెరపడంతో పాటు తన గురుతులు, ఆనవాళ్లు వేసుకుంటూ పోతున్నాడు. ఇందులో రేవంత్ బ్రాండ్ కనిపిస్తున్నది. కానీ పాలనలో ఇంకా ఆ బ్రాండ్ రాలేదు. పట్టూ సాధించలేదు.