(దండుగుల శ్రీ‌నివాస్‌)

బీఆరెస్‌లో కుటుంబ క‌ల‌హాలున్నాయి. అవి ప‌తాక‌స్థాయికి చేరుకున్నాయి. ఇది ఎవ‌రు కాద‌న్నా.. రామ‌న్న హ‌రీశ్ ఇంటికి పోయి కౌగిలించుకున్నా.. ఆ గ్యాప్ పెరిగింద‌ని అంద‌రికీ తెలుసు. చెల్లె క‌విత‌దో దారి. అన్న రామ‌న్న‌ది అదే అహంకార‌దోర‌ణి. హ‌రీశ్‌ది క‌రివేపాకు పాత్ర‌. అంతా త‌లోదిక్కు. మొన్న జ‌రిగిన వ‌రంగ‌ల్ స‌భ అట్ట‌ర్ ఫ్లాప్‌. కేసీఆర్ ఏదో మాట్లాడ‌తాడ‌ని అంతా అనుకున్నారు. కానీ పేప‌ర్లు చూసుకుంటూ చ‌ద‌వి ఆ ప్ర‌సంగం అంద‌రినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. కొండంత రాగం తీసిన‌ట్టుగా ఆ స‌భ తుస్సుమ‌న్న‌ది. ఈ వేడుక‌లు ఏడాది పొడువునా చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు రామ‌న్న‌.

17Vastavam.in (3)

అస‌లుకే దిక్కు లేదు. ఏడాది సంబురాలా..? అదీ ఎవ‌రి దారి వాళ్లు చూసుకుంటున్న త‌రుణంలో. ఆ స‌భ పెట్టేట‌ప్పుడే చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తెలంగాణ ప‌ద‌మే లేకుండా చేసుకుని బీఆరెస్ అని పెట్టుకుని దానికి ర‌జ‌తోత్స‌వ వేడుక‌లా అని తిట్ట‌నివాడు లేడు. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న‌ట్టుగానే వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ నిర్వ‌హించారు వరంగ‌ల్ స‌భ‌. ఇక ఇప్పుడు ఏడాది వేడుక‌లు చేద్దామా..? వ‌ద్దా..? అనే మీమాసంలో ప‌డిపోయింది పార్టీ. ష‌రా మామూలుగానే కేసీఆర్ మ‌ళ్లీ ఫామ్ హౌజ్‌లోకి వెళ్లిపోయాడు. అక్క‌డే సేద తీరుతున్నాడు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వ‌స్తా అన్నాడు. ఆ స‌మ‌యం ఎప్పుడొస్తుందో ఆయ‌న‌కు త‌ప్ప ఎవ‌డికీ తెలియ‌దు. ఇక బావ‌బామ్మ‌ర్దులు ఇద్ద‌రూ గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చించుకున్నార‌ట‌. ఏడాది సంబురాల గురించి. అది కానిపోని ముచ్చ‌ట అని తెలుసుకున్నార‌ట‌. ఇప్ప‌టికైతే ఇవీ సంగ‌తులు.

You missed