(దండుగుల శ్రీ‌నివాస్‌)

న‌న్ను కోసినా పైసా ఆదాయం పెర‌గ‌దు. కోసుకుని తింటారా..? ఉన్న ఆదాయ‌మిదే.. ఏం చేయాలో మీరే చెప్పండ‌ని ఉద్యోగుల జీత‌భ‌త్యాల విష‌యంలో ఖుల్లంఖుల్లా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి… ఇదే త‌ర‌హాలో రైతు భ‌రోసా ఊసు కూడా ఎత్త‌డం లేదు. వ్య‌వ‌సాయ శాఖ రివ్యూ పెట్టుకుని దాంట్లో కీల‌క‌మైన ఈ అంశంపై క‌నీసం ఓ మాట ముచ్చ‌ట కూడా ఎత్త‌లేదు. వానాకాలం సాగు ముచ్చ‌ట్ల‌న్నీ చెప్పాడు. జాగ్ర‌త్త‌లు, సూచ‌న‌లు చేశాడు. విత్త‌నాలు, ఎరువులు విష‌యం ఆరా తీశాడు. ఆదేశాలిచ్చాడు. హెచ్చ‌రించాడు. ముందుజాగ్ర‌త్త‌ల‌న్నీ చెప్పాడు. కానీ అస‌లైన ముచ్చ‌ట‌నే చెప్ప‌లేదు. అంతా దీని గురించే ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

యాసంగి సీజ‌న్ రైతు భ‌రోసానే ఇంకా కంప్లీట్ కాలేదు. మూడెక‌రాల దాకా ఇచ్చి ఆపేశారు. మార్చి నెలాఖ‌ర‌న్నారు. మే నెలాఖ‌రు వ‌స్తుంది. అసలు అవి ఎప్పుడేస్తారు..? అసలు వేస్తారా ..? వెయ్య‌రా..? కొంప‌దీసి నన్ను కోసినా రూపాయి రాద‌ని చెప్పేస్తాడా..? అనే అనుమానాలూ లేక‌పోలేదు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కాబ‌ట్టి అర్థం చేసుకోవాల‌ని రైతుల‌ను కోరుతాడేమో. రైతులు మాత్రం ఇంకా ఆశ‌గానే ఉన్నారు. రేవంత్ ఏదో ఒక‌టి చేస్తాడు. వేస్తాడు. అని. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితి చూస్తే.. సీఎం మాట్లాడే తీరు చూస్తుంటే రైతు భ‌రోసా యాసంగి సీజ‌న్ కంప్లీట్ చేస్తే అదే ప‌దివేలు అన్న‌ట్టుగా ఉంది.

వానాకాలం మాత్రం పెండింగ్ ప‌డే చాన్స్ ఉంది. దీనిపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల ఏం మాట్లాడినా న‌మ్మేలా లేరు రైతులు. పూట‌కో మాట మాట్లాడే తుమ్మ‌ల‌పై రైతులకు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది. సీఎం రేవంతే మాట్టాడాలె. కానీ ఉద్యోగుల‌కు చెప్పిన‌ట్టు చెప్పి త‌ప్పించుకుంటే మాత్రం రైతులు ఊరుకోరు. ఇది కూడా తెలుసు సీఎం సారుకు. మ‌రేం చేస్తాడో చూడాలి.