(దండుగుల శ్రీనివాస్)
తాళిబొట్లమ్ముకున్నారు. పది రూపాల మిత్తీలకు తెచ్చుకున్నారు. గవర్నమెంటు పనులు చేస్తే నాలుగు పైసలు సంపాదించుకోవచ్చనుకున్నారు. ఆ పుస్తెలు తాకట్టులోనే ఉన్నాయి. బిల్లులు బల్లకిందే ఉన్నాయి. కమీషన్లిస్తే బిల్లులు. పెద్దలకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. మంత్రి, ప్రభుత్వ సలహాదారు మొదలు అధికారులు.. ఎవరికి వారే వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. వాళ్ల బతుకులు రెడ్డెక్కాయి. సర్కార్ పరువు వీధికెక్కింది.
అవును.. ఏకంగా సెక్రటేరియట్‌కే కాంట్రాక్టర్లు వచ్చారు. అదీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ చాంబర్ ముందు ఆందోళన. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా..? అది సర్కార్‌కు మాయని మచ్చ. మీరు అధికంగా కమీషన్లు తీసుకుంటున్నారు. తగ్గించండని వేడుకుంటున్నారు. మాకో న్యాయం. పెద్ద కాంట్రాక్టర్లకో న్యాయమా అని గగ్గోలు పెడుతున్నారు. కేసీఆర్ టైం నుంచే కాంట్రాక్టర్లను బిచ్చగాళ్లను చేసే పనిని నెత్తుకెత్తుకున్నాడు. పక్కా ఓటు బ్యాంకు రాజకీయాలను చేసే కేసీఆర్.. ఇబ్బడి ముబ్బడిగా అవే పథకాలను ప్రవేశపెట్టి నిధులన్నీ అటు వైపే మళ్లించాడు. ఆఖరికి జీహెచ్ఎంసీ నిధులను కూడా ఇతర పథకాలకు వాడుకున్నాడు. కాంట్రాక్టర్లకు గుండు సున్నా పెట్టాడు.
హైదరాబాద్‌లో ప్రధానంగా ప్రభుత్వ పనులపై ఆధారపడి ఎన్నో రంగాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ లోని ఇతర జిల్లాల నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చిన లక్షలాది మంది కార్మికులకు ఈ పనులే ఉపాధి. అలాంటి పనులను వారు ఆపేశారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలకు తిండి దొరకని పరిస్తితి. ఈ పాపం కేసీఆర్. అదే పాపాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు రేవంతు. అంతకు మించి హామీలిచ్చి వాటిని నిలబెట్టుకోలేక.. ఖజనా ఖాళీగా ఉంది .. నేం నే చేయాలె. అంటూ ఉన్నవాటికే ఎసరు పెట్టే పనిలో రేవంతు ఉండగా.. కమీషన్ల తీసుకుని దొరికినకాడికి బరికే పనిలో డిప్యూటీ సీఎం, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.
ఇప్పుడు కాంట్రాక్టర్లు లొల్లి చేసింది వీరి గురించే. పెద్దలకు 8 నుంచి 15శాతం వరకు కమీషన్లు తీసుకుని టకీ టకీ మని బిల్లులు మంజూరు చేస్తున్నారు. మేం పెళ్లాల తాళిబొట్లు తాకట్టు పెట్టి పనులు చేశాం. మరి మా సంగతేందని అడుగుతున్నారు. ఆన్సర్ ఉందా రేవంతు..! నీ పాలన మరీ ఇంత దరిద్రంగా ఉంటుందని ఏరి కోరి తెచ్చుకున్న కాంట్రాక్టర్లకు ముందు తెలియదు.ఇప్పుడు తెలిసి ఇలా నీ ఇంటికొచ్చారు. నీ నట్టింటికొచ్చారు. తేల్చుకుందాం రా అంటున్నారు.