ద‌ళితుల‌ను ఏదో ఉద్ద‌రిస్తామ‌ని ఆక‌స్మాత్తుగా రాత్రికి రాత్రే గుర్తొచ్చిన‌ట్టు క‌లవ‌ర‌ప‌డి క‌ల‌త‌నిద్ర నుంచి లేచి పోలోమంటూ ద‌ళిత‌వాడాల‌కేగుతున్నారు మ‌న నేత‌లు. ఎందుకు ఇప్ప‌డే ద‌ళిత‌రాగం గుర్తొచ్చిందో తెలియ‌దు. ఒక‌రిని మించి మ‌రొక‌రు ఈ రాగాన్ని అందుకున్నారు. గొంతుల క‌ర్ణ‌క‌ఠోరంగా ఉన్న గార్ధ‌బ స్వ‌రాలేసుకుని ద‌ళితుల ముందు త‌మ గానాన్ని ఆల‌పిస్తున్నారు. చూశావా.. నేనే మీ రాగం బాగా అందుకున్నాను. నేను గాన‌కోకిల‌లా ఆల‌పిస్తున్నానంటూ త‌మ స‌హజ‌సిద్ధ‌మైన న‌ట‌నాకౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఒంగొంగి దండాలు పెడుతున్నారు. కాళ్లు మొక్క‌డ‌మొక్క‌టే లేదు. అది జ‌న్మ‌లో చెయ్య‌ర‌నుకో.

పొద్దున్నే ఏదో పేప‌ర్‌లో .. రేవంత్ రెడ్డి ఓ ద‌ళిత వాడ‌లో నిద్రించిన‌ట్లు వార్త‌. ద‌ళిత‌వాడ‌లో నిద్రించ‌డం అంటే చాలా గొప్ప అన్న‌మాట‌. చూశారా! మీరెంత అనాకారి ప్ర‌జ‌లు, వెలివేత ప్ర‌జ‌లు.. మిమ్మ‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు నేను వ‌చ్చి ఇక్క‌డ ఉంటే.. మీకు రాత్రికి రాత్రే విలువ పెరిగిపోతుంది. వివ‌క్ష తొలిగిపోతుంది. స‌మాజం మీకు శాల్యూట్ చేస్తుంది. ఇదే క‌దా వారి భావ‌న‌. స‌హ‌పంక్తి భోజ‌నాలు చేసి ఉద్ద‌రించామ‌నే లెవ‌ల్లో వార్త‌లు, ఫోటోలు కూడా వ‌స్తాయి. ద‌ళిత ఆఫీస‌ర్లు ఎక్క‌డా అని అడ‌గ్గానే.. ఇప్పుడు వెతికి వెతికి ఏదో ఒక స్థానంలో ఆఫీస‌ర్ల‌ను పెడుతున్నారు త‌క్ష‌ణ అవ‌స‌రాలు అలాంటివి. కానీ ఇవ‌న్నీ త‌మ పొలిటిక‌ల్ మైలేజీ కోసం చేస్తున్న స‌ర్క‌ర్ ఫీట్ల‌ను పాపం ఆ ద‌ళితుల‌కు తెలియ‌దు. ఈ నేత‌ల‌కూ తెలియ‌దు. అప్ప‌టిక‌ప్పుడు తమ అవ‌స‌రాలు తీరుతున్నాయి. ఉద్ద‌రించే నేత‌లు మేమేన‌నే భ్ర‌మ క‌ల్పించ‌డంలో వీరు కూడా స‌క్సెస‌వుతారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు ముగుస్తాయి. వారి బ‌తుకులు అలాగే ఉంటాయి. వివ‌క్ష ఇంచు మందం కూడా త‌ర‌గ‌దు. క‌ర‌గ‌దు. పైగా ఈ నేత‌ల ఓవరాక్షన్‌తో మిగిలిన కులాలు వీరిని శ‌త్రువులుగా చూసే సంస్కృతి పెరుగుతుంది.

ఇంకా వందేళ్ల త‌ర్వాత కూడా..
అవే ద‌ళిత‌వాడ‌లుంటాయి… ఊర‌వ‌త‌ల.. వెలివేత‌కు గురైన గుడిసెలూ ఉంటాయి.
మేం ద‌ళిత‌వాడ‌ల్లో నిద్రించామ‌ని ఛాతి విరుచుకు చెప్పుకునే మ‌న నేత‌లూ ఉంటారు.
ఇదే మీడియా ఉంటుంది. వాటిని ప‌తాక‌శీర్షిక‌న‌ అచ్చేసి క‌ళ్ల‌క‌ద్దుకుని త‌రించిపోతూ ఉంటుంది. అప్ప‌టి పాల‌కుల దాయాదాక్షిణ్యాల కోసం పాకులాడుతూనే ఉంటుంది.

స‌హ‌పంక్తి భోజ‌నాలు చేస్తూనే ఉంటారు నేత‌లు ద‌ళితులతో క‌లిసి. అది చూసి ద‌ళితులంతా త‌రించిపోతారు.

ఇది క‌దా మా జీవితాల‌కు సార్థ‌క‌త‌. ఇంత మంచి లీడ‌ర్లు మ‌రెక్కాడా ఉండ‌ర‌ని క‌ళ్లంట బొట‌బొటా క‌న్నీటి బొట్లు రాలుస్తారు. ఆ నేత మ‌రో అంబేద్క‌ర్‌లా ఫోజిచ్చి వారిని అక్కున చేర్చుకుంటాడు.

కెమెరాలు క్లిక్ క్లిక్ మంటాయి. ప‌తాక‌శీర్షిక‌న మ‌న‌మూ క‌న‌బ‌డతాం.. మ‌న నేత‌తో.

ఎవ‌రి రాజ‌కీయ అవ‌స‌రాలు వారివి. ఎవ‌డి కుల రాజ్యాధికారం కోసం వాడు పాకులాట‌. మ‌ధ్య‌లో అందుకే ఈ ద‌ళిత పావులాట‌.