థియేటర్లు తెరిచినా.. జనాలు సినిమాలు చూసేందుకు అటువైపు వెళ్లడం లేదు. చాలా వరకు టాకీస్‌లు ఓపెన్ కూడా చెయ్యలేదు. కరోనా దెబ్బకు జనాలు వస్తారా? రారా? అనే భయం థియేటర్ యజమానులకు ఉన్నది. పరిస్థితి చూసి తెరుద్దామనుకున్నారు. కానీ కరోనా తగ్గి.. భయం కూడా తగ్గి జనాలు మాములు పరిస్థితుల్లోకి వచ్చేసినా థియేటర్లకు మాత్రం పోవడం లేదు. తెరిచిన టాకీసుల్లో ఆడే సినిమాలకు జనాలు పెద్దగా రాకపోవడంతో కొన్ని షోలను రద్దు చేసుకునే పరిస్థితి ఉంది. దాదాపు సెకండ్ షోలు చాలా టాకీసులలో రద్దవుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాలు ఎక్కువగా ఓటీటీలలో వేస్తున్నారు.దీంతో దీనికి మెల్లగా జనాలు అలవాటు పడుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఓటీటీల వైపు మొగ్గారు. ఆ తర్వాత కూడా దీనికే ఎక్కువగా కనెక్టవుతున్నారు. అయితే మాస్ పీపుల్‌కు ఓటీటీ ఇంకా పూర్తి స్థాయిలో చేరువ కాలేదనే చెప్పాలి. అయితే థియేటర్ యజమానులు మాత్రం.. ఓటీటీల వైపు ఇంకా ప్రజలు అంత శ్రద్ద చూపడం లేదనే చెప్తున్నారు. కరోనా వేళ పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్లకు వచ్చి చూసే ఇంట్రస్ట్ వారిలో లేకుండా పోయిందనే అభిప్రాయాన్ని చెబుతున్నారు. పెద్ద సినిమాలు వస్తే థియేటర్లు ఫుల్ అవుతాయని భావిస్తున్నారు.
