భారీ బడ్జెట్‌తో ఏడాదిన్నర పాటుగా షుటింగ్ పూర్తి చేసుకున్న రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథనాయకులుగా అల్లూరి సీతారామారాజు, కొమరంభీం పాత్రల కలయిక కథతో తెరకెక్కిన ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన త్రిపుల్ ఆర్ పై భారీ అంచనాలున్నాయి. బహుబలి సీక్వెల్ తర్వాత రాజమౌళి ఈ ప్రాజెక్టును తెరకెక్కించాడు. వచ్చే నెల 20న విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి.
అయితే ఆంధ్రాలో థియేటర్ల టికెట్ రేట్ల విషయంలో ఏర్పడిన సందిగ్ధత, గందరగోళ పరిస్థితులు ఈ సినిమా విడుదల పై ప్రభావం చూపనున్నాయి. ఈ నెలాఖరున సీఎం జగన్ టికెట్ రేట్ల పెంపు విషయంలో మరోమారు సినీ పెద్దలతో చర్చించేందుకు టైం ఇచ్చాడు. ఆంధ్రా థియేటర్లలో టికెట్ల రేట్లను 20, 40, 70 మాత్రమే తీసుకోవాలని జగన్ తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీ పై తీవ్ర ప్రభావం చూపింది. జగన్ తన నిర్ణయానికే కట్టుబడి, మొండి పట్టుదలతో ఉండడంతో సినీ పెద్దలు జోక్యం చేసుకున్నా పరిస్థితుల్లో మార్పు రాలేదు. మరోసారి ఈ నెలాఖరున భేటీ కానున్నారు. ఈ భేటీలో చర్చలు సఫలమైతేనే భారీ సినిమా విడుదలకు మార్గం సుగమమవుతుంది.
వాస్తవంగా సినిమా టికెట్ల ధరలు 50, 80, 110గా వసూలు చేస్తున్నారు. భారీ సినిమాలు వచ్చినప్పుడు 150, 200 వసూలు చేస్తున్నారు. సీఎం జగన్ వీటిని ఆంధ్రాలో కనీస రేట్లకే పరిమితం చేయడంతో త్రిపుల్ ఆర్ సినిమా విడుదల పై నిర్మాతలు సంశయిస్తున్నారు. వచ్చే నెల 20న అనుకున్న ఈ విడుదల తేదీ మరో రెండు నెలలు పొడిగించినా ఆశ్చర్యం లేదు. ఈ సినిమాతో పాటు మరో మూడు భారీ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్‌తో పాటు దిల్‌రాజ్ నిర్మించిన వెంకటేశ్ సినిమా ఎఫ్ -3, బాలకృష్ణ నటించిన ఇంకో సినిమా విడుదలకు రెడీగా ఉన్నాయి. కానీ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈ సినిమాలేవీ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనపించడం లేదు.