ఇందూరులో పాగా వేసేందుకు అర్వింద్ ఓ వైపు గట్టి ప్రయత్నం చేస్తుండగా.. కొంత మంది బీజేపీ నేతల వ్యవహరం ఆయనకు తలవంపులు తెచ్చిపెడుతున్నది. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత జిల్లాలో బీజేపీ పుంజుకున్నది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ సీట్లను దక్కించుకున్నది. మేయర్ సీటును కొద్ది పాటి తేడాలో పోగొట్టుకున్నది. ఇది టీఆరెస్‌కు మింగుడుపడని అంశంగా మారింది. టీఆరెస్ పార్టీకి ఇందూరు కంచుకోట. ఆ కంచుకోటను బద్ధలు కొట్టి అర్వింద్ తన రాజకీయ ఎంట్రీతో బీజేపీకి కొత్త జీవం పోశాడు.
క్రమంగా అది జిల్లాలో విస్తరిస్తూ పోతున్నది. అదే సమయంలో కొంత మంది బీజేపీ నేతల బరితెగింపు వ్యవహరం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నది. అర్వింద్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. మొన్నటి మొన్న నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శ్రీనివాస్ ఓ డాక్టర్‌ను కిడ్నాప్ చేసాడనే ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. భార్య ఉండగా ఓ డాక్టర్‌తో సహజీవనం చేస్తూ ఆమెను కిడ్నాప్ చేశాడని ఆ అమ్మాయి తండ్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం విషయం వెలుగు చూసింది. అప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరిగింది. వెంటనే బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఆ డాక్టర్‌ను నేరుగా పోలీసుల వద్దకు పంపించి తన ఇష్ట పూర్వకంగానే సదరు బీజేపీ నేతతో వెళ్లినట్లుగా చెప్పి, అతన్నే వివాహం చేసుకోబోతున్నానని చెప్పింది. ఫిర్యాదును పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఈ అంశం ఆ రెండు కుటుంబాల వ్యవహరంగా మారినప్పటికీ రాజకీయ పరంగా చర్చకు దారి తీసింది.
బీజేపీలోనే చాలా మంది ఆకుల శ్రీనివాస్ వ్యవహరం పై భగ్గుమన్నారు. కానీ బీజేపీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా తాజాగా కమ్మర్పల్లి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నవాతే రంజిత్ ఓ దళిత వివాహిత పై కన్నేసి ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తరుచూ ఆమెకు ఫోన్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం భర్తకు తెలియడంతో కుల సంఘం పెద్దలతో వెళ్లి అతని ఫర్టిలైజర్ షాపులోనే దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు రంజీత్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
అర్వింద్‌తో సన్నిహితంగా ఉండే వీరిద్దరు మహిళలతో ప్రవర్తించిన తీరు,, ఇటు జనాల్లో, అటు పార్టీలో తీవ్ర ఆక్షేపణీయంగా మారింది. ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న తరుణంలో పంటికింద రాయిలా నేతల బరితెగింపు, రచ్చకెక్కే రాజకీయాలు అర్వింద్‌కు ఇబ్బందికరంగా మారాయి.