కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని, మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియ టుడే సర్వేలో వెల్లడైన అంశం ప్రస్తుతం వైరల్ అవుతున్నది. పాలన పై 84శాతం వ్యతిరేకత ఉందని ఆ సర్వే వెల్లడించింది. తెలంగాణ పరిపాలన ఈ సర్వే వెల్లడించిన గణాంకాల్లో ఆఖరి వరుసలో నిలవడం చర్చకు దారి తీసింది. సహజంగానే రెండో సారి అధికారంలోకి వచ్చిన పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. మొదటి సారి ఇచ్చిన హామీలే పూర్తిగా అమలు కానీ అమలు కానీ పరిస్థితులను చూసినా.. రెండో సారి కూడా కేసీఆర్ పై నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు.
అందుకే భారీ మెజార్టీ ఇచ్చి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. వాస్తవంగా కేసీఆర్ రెండో సారి అధికారం కోసం విపరీతంగా చెమటోడ్చాడు. తన పై తనకు నమ్మకం అప్పటికే సన్నగిల్లింది. జమిలీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా ప్లస్ అవుతుందోననే భయం ఆయన్ని వెంటాడింది. అందుకే మధ్యంతరానికి వెళ్లాడు. అయినా ఇంకా ఏదో అపనమ్మకం. కాంగ్రెస్ పుంజుకున్నదేమోనన్న భయం. దీంతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టడానికి కూడా వెనుకాడలేదు కేసీఆర్. మొత్తానికి అధికారం చిక్కింది. కానీ పాలన మొదటి కంటే అధ్వానంగా తయారైంది. లీడర్ల ఆగడాలు పెరిగాయి. అదుపులో లేకుండా అయిపోయారు. అవినీతి పెరిగింది.
రెండో సారి కూడా సిట్టింగ్లకు టికెట్ ఇవ్వడం కూడా పరిపాలన పై విపరీత ప్రభావం చూపింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ ఇతర పార్టీ నాయకులందరినీ గంపగుత్తగా గుంజేసుకుని ప్రతిపక్షం ఉనికి లేకుండా చేయడం తర్వాత క్రమంలో తనను తాను దెబ్బ తీసుకోవడమే అయ్యింది. పాలకుడికి మొదటి నుంచి కీర్తి కండూతి అధికం. ప్రశ్నించడం ఆయనకిష్టముండదు. లోపాలు ఎత్తిచూపితే విరుచుకుపడతాడు. అందరూ ప్రశంసించాలి. వేనోళ్ల పొగడాలి. దేశంలోనే పాలన నెంబర్ వన్ అని భుజానికెత్తుకొని ఊరేగాలి. మీడియా మొత్తం ఒకే గొంతుకగా పరిపాలకుడి కీర్తి పాటను ఆలపించాలి. ఇవన్నీ అలవాటైన పాలకుడు.. పాలాభిషేకానికి మరిగిన మహాప్రభు. లోపాలు ఎలా తెలుసుకుంటాడు? ప్రజావసరాలు ఎలా గుర్తిస్తాడు? వ్యతిరేకత ఉందని ఆయనకు చెప్పే ధైర్యం ఎవరికీ? ఆయన నిర్ణయాలు తప్పని వేలెత్తి చూపే నాయకుడున్నాడా?
ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఈ సర్వే.. ఆ సర్వే కాదు.. ఏ సర్వే చేసినా ఇదే రిపోర్ట్ వస్తుంది.
