ఏంది కృ.తి సారు… మీరు కూడా హుజురాబాద్ బాధ్యతల్లో పాలుపంచుకోవాలా? అక్కడ హేమాహేమీలున్నారు. ఈటలను చుట్టిముట్టి తుదముట్టించేందుకు వందలశక్తులున్నాయి. వేల కోట్ల నిధులున్నాయి. మంత్రులున్నారు. లీడర్లున్నారు. కార్యకర్తలున్నారు. మొన్ననే చేరిన వసలపక్షలున్నాయి. పదవులందుకున్న పరాన్నజీవులున్నాయి. పదవుల కోసం గోతికాడి నక్కలాగా ఎదురుచూస్తున్న జంప్‌జీవులున్నాయి. ఇంకా ప్రధానమైన… ట్రబుల్ షూటర్ హరీశ్ అన్న ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడ క్యాంపు వేసి ఏమి చేస్తావు సారూ? పత్రికను ఇలా వదిలేసి మొత్తం నువ్వు కూడా హుజురాబాద్ మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నావా? ఎన్ని రోజులు క్యాంపు వేస్తావు? అసలు నిన్ను ఎవరు గుర్తు పడతారు?
ఓ.. చేతిలో నమస్తే ఉంది కదా..! అందులో పనిచేసే స్టాఫ్ ఉంది కదా..! లైన్ అకౌంటుకు ఏళ్ల తరబడి నోచుకోని రిపోర్టర్లూ ఉన్నారు కదా..! ఓహో అదా నీ ధీమా..! పెద్దలతో మెప్పు పొందేందుకా నీకీ శ్రమ.పేపర్ నంతా ఆగం పట్టిచ్చినవు. నచ్చినోళ్ల కోసం నమ్ముకున్నోళ్లను రోడ్డు పాలు చేశారు. కానీ నీ కుర్చీ పదిలంగా పదికాలాలు కాపాడుకోవాలంటే.. కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలే. పనిలో పని నీ పాత మిత్రుడు హరీశ్ అన్న ఆశీస్సులూ ఉండాలె. అందుకే ఇలా హుజురాబాద్ అవకాశాన్ని వాడుకుంటున్నావా కృ.తి.
అసలు హుజురాబాద్‌ను వాడుకోని వాళ్లే లేరు. ఇది అందరికీ బంగారు బాతైంది. ఈటల పుణ్యమా అని చాలా మంది బతికిపోతున్నారు. బానిసలు కోట్లకెదుగుతున్నారు. దరిద్రులు ధనవంతులవుతున్నారు. వాళ్ల సంగతి సరే.. మీరు ఓ పత్రిక ఎడిటరై ఉండి.. ఇలా క్యంపులేసుకుంటూ గల్లీల పొంటి తిరిగితే గలీజుగా ఉంటుందేమో కదా సారు…! ఏం కాదంటావా? కేసీఆర్ నజర్‌లో పడాలంటే ఇంతమటుకు దిగజారాల్సిందే అంటవా? అయినా కొత్తగా కేసీఆర్ దగ్గర నీకు మంచి మార్కులెందుకు సారు.. బాపనోళ్లంటే చాలు సారుకు చాలా ఇష్టం. నీ కులం కార్డు చాలు నిన్ను శ్రీరామ రక్షగా కాపాడేందుకు?
ఊహు సరిపోదంటవా? ఈటలపై కేసీఆర్‌కున్న కసి, పగ, ఇక్కడ గెలవాలనే ఆకాంక్షను పసిగట్టావా? ఇక్కడ కష్టపడితే స్థానం సుస్థిరం చేసుకునే మహదవకాశం దక్కించుకున్నట్టే అంటవా? నీ మైండే మైండ్ సారు. ఎలా వస్తాయి సార్ .. ఇలాంటి ఆలోచనలు. బతకనేర్చే బుద్దులు అందరికీ రావు సారు.. సామాన్యంగా. కొందరి లీడర్లకు ఈ లౌక్యం తెలియక, ఎదుగూ బొదుగు లేకుండా ఉంటారు ఏళ్ల తరబడి. వాళ్లు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అసలు. నువు ఎడిటర్‌గా కన్నా ఓ లీడర్‌గా ఎదిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి సారో…! ఇది కూడా గమనంలోకి తీసుకోండి. ఆ తర్వాత అదే అంటారా? నువ్ నిజంగా గ్రేట్ సార్.
మన రిపోర్టర్లకు అక్కడ టీఆరెస్‌ను గెలిపిస్తే నజరానా ఇస్తానని అచ్చు కేసీఆర్ లాగే వరాలు గుమ్మరించేశారట కదా.. ఇచ్చేయండి సారు. వాళ్లకూ మొన్నటి వరకు ఏమీ లేదు. మన టీఆర్ఎస్ నేతలు పట్టించుకోడు. పక్కోడి దగ్గరకు కూడా రానీయడు. ఘర్ కా ముర్గీ దాల్ బరాబర్ అయిపోయిర్రు మన నమస్తే రిపోర్టర్లు. కార్యకర్తల్లా వాడుకున్నా… కరపత్రాలు మోపించినా సరే. రాత్రిళ్లూ ప్రచారం చేపించుకున్నా సరే… వాళ్లకు మాత్రం నజరానా ఇవ్వండి సారు… ప్లీజ్. అవును ఈ నజరానా నువ్విస్తావా? మన మేనేజ్మెంటా? నా పిచ్చి గానీ నీ జేబులకెళ్లి ఎందుకిస్తావు?
ఒక్క విషయం సార్.. ఇక్కడ ఎట్లైనా టీఆరెసే గెలిచేటట్టు ఉంది. నువ్వు బాగా కష్టపడినట్టు నటించు. వారంలో రెండు మూడు రోజులు క్యాంపు వెయ్యు.. మీటింగులు పెట్టు. రిపోర్టర్లను ఉరికించు… అబ్బ ఏం పని చేస్తుండు అని కేసీఆర్ సార్ ఒక్కసారన్నా అనుకోవాలె.అప్పుడు విజయంలో నీ పాత్ర కూడా చరిత్రలో మరుపురాని మైలురాయిగా మిగిలిపోతుంది. ఇక నీకు తిరుగుండదు.