వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
సర్కార్ వద్దకు టాలీవుడ్ దిగివచ్చింది. ఇటీవల సినీ కార్మికులు చేసిన సమ్మె.. పరిశ్రమను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ తెగని పంచాయితీని సినీ పెద్దలు కూడా పరిష్కరించని సమయంలో.. సీఎం రేవంత్రెడ్డి రంగంలోకి దిగి పరిష్కరించారు. మళ్లీ కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సీఎంను కలిశాయి. చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. పరిశ్రమలో ఏళ్లుగా నెలకొన్న వ్యవస్థీకృత విధానాలను ఆయన తప్పుబట్టడమే కాకుండా.. మార్పు దిశగా ఆలోచనలు చేశారు. సంస్కరణల పర్వం తీసుకురావాల్సిందేనన్నారు. సర్కార్ తరపున పూర్తి మద్ధతుంటుందని చెబుతూనే.. వ్యవస్థలను నియంత్రించాలని చూస్తే మాత్రం సహించేది లేదని సుతిమెత్తని వార్నింగ్ కూడ ఇచ్చారు. టాలీవుడ్లో తనదైన శైలిలో కొత్త పుస్తకం రాసుకుందామని, దీనికి ఏం కావాలో చెప్పండి…? చేద్దామని ఆయన సినీ పెద్దల ముందు తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలన్న సీఎం… సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని ఈ సందర్బంగా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుందని, పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమ లో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్టు ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని, తెలంగాణ లో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమనేనని పునరుద్ఘాటించారు. పరిశ్రమ లో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని గుర్తు చేశారు. పరిశ్రమ లో నిర్మాతలు,కార్మికుల అంశం లో సంస్కరణలు అవసరమని తేల్చి చెప్పారు. కార్మికుల విషయం లో నిర్మాతలు మానవత్వం తో వ్యవహరించాలని హితబోధ చేశారు.
నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు. సినీ కార్మికులను,నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరమని, పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామన్నారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందరూ చట్ట పరిధి లో పని చేయాల్సిందేనన్నారు. పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటానన్న సీఎం..హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమా ల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ను ఉంచడమే తన ధ్యేయమన్నారు.
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్,డి.సురేష్ బాబు,జెమిని కిరణ్,స్రవంతి రవికిశోర్,నవీన్ ఎర్నేని,వంశీ,బాపినీడు,డివివి దానయ్య,వంశీ,గోపి,చెరుకూరి సుధాకర్,సాహు,అభిషేక్ అగర్వాల్,విశ్వ ప్రసాద్,అనిల్ సుంకర,శరత్ మరార్,ఎన్వీ ప్రసాద్,ఎస్కేన్,రాధామోహన్,దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్,,బోయపాటి శ్రీనివాస్,సందీప్ రెడ్డి వంగా,వంశీ పైడిపల్లి,అనిల్ రావిపూడి,వెంకీ కుడుముల సీఎంను కలిసిన వారిలో ఉన్నారను.