(దండుగుల శ్రీనివాస్)
1990లో అసలు నువ్వు సినిమాకే పనికిరావన్నారు. నీకు డ్యాన్స్ రాదు. సరిగ్గా నిలబడనూ రాదు. నీ ముఖం హీరోగా అస్సలు సూట్ కాదు… ఓ పెద్ద నిర్మాత.. జగపతిబాబునుద్దేశించి చెప్పిన మాటలివి. కానీ అవే మాటలు అతనిలో కసిని పెంచాయి. అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. లోపాలను సరిచేసుకుంటూ తనను తాను నిరూపించుకునే క్రమంలో ఒక్కొక్కమెట్టే ఎక్కుతూ వచ్చాడు. ఫ్యామిలీ హీరోగా ఎదిగాడు. కాలం మారింది. అవకాశాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అది గమనించాడు. విలన్ పాత్రలకూ ఓకే అన్నాడు.అందులోనూ ఒదిగాడు. నిరూపించుకున్నాడు. ఇక తిరుగులేదనిపించుకున్నాడు. ఇప్పుడు టీవీ షోలూ చేస్తున్నాడు.
ఇదీ జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా. అతను జీ5లో చేస్తున్న ప్రోగ్రాం పేరే ఇది. నాగార్జునతో చేశాడు తొలి ఎపిసోడ్. మంచి కలివిడితనం. ఓపెన్ మైండెడ్ ప్రశ్నలు. అంతరంగాలను ఆవిష్కరించే సన్నివేశాలు. లోపాలు, తప్పులు, నేపథ్యాలను ఓపెన్‌గా చెప్పుకునే, అడిగి తెలుసుకునే విశాల దృక్పథం.. ఇవన్నీ అతని ప్లస్‌లు. ఎదురుగా కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చిన నాగార్జునదీ ఇంచు మించు జగపతి బాబు కథే. సినిమాలకు పనికి వస్తానా? అనే అనుమానం నుంచి మొదలుపెట్టిన కెరీర్.. ఒక్కొక్కటిగా తనకు తానుగా పేర్చుకుంటూ పోయి .. ఇప్పుడు కూలీలో విలన్‌గా.. బిగ్ బాస్‌లో హోస్ట్‌గా చేస్తూ వస్తున్న నాగార్జున కాలంతో పాటు మారిన.. తనను తాను మార్చుకుంటూ వస్తున్న నటుడే. ఎక్కడా బోర్ కొట్టకుండా, మంచి టైమింగ్‌తో, సెన్సాఫ్ హ్యూమర్‌తో జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా తెలుగు టాక్ షో.. బాగుంది. సినీ ప్రియులకు బాగా నచ్చుతుంది.
Dandugula Srinivas
Senior JOURNALIST
8096677451