(దండుగుల శ్రీనివాస్)
రేవంత్‌రెడ్డిని నేను రేవంత్ గౌడ్ అని పిలుస్తున్నా ఈ వేదికగా. ఎందుకంటే ఆయన గౌడ్ల అభివృద్ధికి చేస్తున్న కృషి ఎనలేనిది. గౌడ కులస్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి ఆలోచనలను గ్రహించినవాడిగా సంక్షేమ పెన్నధిగా చేస్తున్న కార్యక్రమాలను చూసీ నేను ఈ మాటంటున్నాను. ఈ మాటలన్నది పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల సందర్బంగా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి శంఖుస్థాపన చేసిన అనంతరం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నేతలు మాట్లాడారు. ఈ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. మహేశ్ గౌడ్ తన గురించి మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
మాదిగల కోసం రిజర్వేషన్లు అమలు చేసే కార్యక్రమంలో పాలుపంచుకున్నప్పుడు మాదిగలంతా తనను తమ కులం వాడిగా సంబోధించిన విషయాన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. సీఎంగా మాదిగ కులస్తుడుంటే ఎట్లా స్పందిచేవాడో సీఎంగా రేవంత్‌రెడ్డి కూడా అలాగే స్పందించి తమ కులానికి మేలు చేసే అద్భుతమైన, చారిత్రకమైన ఘట్టాన్ని పూర్తి చేశారని ఆ కులానికి చెందిన చాలా మంది తనతో తమ అభిప్రాయాలను పంచుకున్నారన్నారు. ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చాను. ఇచ్చినట్టుగానే వాకిటి శ్రీహరిని మంత్రిని చేశాను..అని అన్నారు. దీనిపట్ల కూడా ఆ కులానికి చెందిన బిడ్డలు ముదిరాజుల అభివృద్దికి దోహదపడిన సీఎంగా తనను చూశారని, రాజకీయంగా తమ కులానికి బలాన్నందించే విధంగా శ్రీహరిని మంత్రిని చేయడం పట్ల ఎంతో విధేయతను కనబరిచారని గుర్తు చేసుకున్నారు.
గౌడ కులస్తులకు కూడా ఎన్నికల ముందు హామీలిచ్చినట్టుగానే ఒక్కొక్కటిగా అన్నీ నెరవెరుస్తూ వస్తున్నానని, సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సచివాలయం సమీపంలోనే పెట్టాలనే కోరిక తనదేనని, ఆయన అందరికీ ఆదర్శంగా ఉన్నారని, ఆ స్పూర్తిని పొందేలా విగ్రహ ఏర్పాటు చేయిస్తున్నానని వెల్లడించారు. ఇలా తనను గౌండ్లు, ముదిరాజులు, మాదిగలో తమ తమ కులస్తులలో సభ్యుడిని చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సీఎం మాటలతో సభలో నవ్వులు విరిశాయి. చప్పట్లు మార్మోగాయి.
Dandugula Srinivas
Senior Journalist
8096677451