వాస్తవం – హైదరాబాద్ :
మూసీ నది మళ్ళీ మురిసింది. వరద నీటితో పరవళ్ళు తొక్కుతున్నది. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ ఎగువ పరివాహ ప్రాంతాలలో భారీ మొత్తంలో వరద రావడంతో మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు ఒక అడుగు మేరకు నాలుగు గేట్లు వదిలారు. దీంతో గత మూడు రోజులుగా వరద నీటి ప్రవాహంతో మూసి మురికి చాలా వరకు కొట్టుకుపోయింది. దోమల బాధ కొంత తప్పింది. వాన నీటితో వరద పరవళ్లతో లంగర్ హౌస్ అత్తాపూర్ మధ్య ఉన్న ఈసీ , మూసీ నదుల సంగమం మెరిసిపోతున్నది. బాపు ఘాట్ వద్ద తల తలలాడుతున్న నీటి ప్రవాహాన్ని చూసి స్థానికులు మురిసిపోతున్నారు. వలస పక్షులు వాలిపోతున్నాయి. కొంగలు సందడి చేస్తున్నాయి.
మూసి ప్రక్షాళన అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న ప్రకటనలు ఎక్కడ కార్యరూపం దాల్చలేదు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అతిగతి లేకుండా అయోమయంగా మారింది. ప్రభుత్వం కనీసం విశాలంగా ఉన్న బాబు ఘాట్ వద్ద ఉన్న స్థలంలో కూడా ప్రాజెక్టు ప్రాథమిక పనులు చేపట్టకపోవడం వల్ల ప్రాజెక్టుపై అప్పుడే అనుమాన నీలి నీడలు కమ్ముకున్నాయి. మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ రోజురోజుకు నీరు గారి పోతున్నది. మురికి రోజు రోజుకు పెరిగిపోతున్నది.
మూసీ మళ్లీ దోమలకు ఉత్పత్తి కేంద్రంగా మారింది. దోమల రాగం మలేరియా రోగం అన్నట్టు… తయారైంది పరిస్థితి. ప్రస్తుత దీనమైన పరిస్థితులలో భారీ వర్షాలు మూసీ నది తీర ప్రాంత వాసులను కొంతవరకు ఆదుకున్నయని చెప్పవచ్చు. వరద నీటిలో గుర్రపుడెక్క కొట్టుకుపోయి దోమల బాధ కొంత తగ్గింది. వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న మూసీకి బాపుఘాట్ వద్ద స్థానికులు పూజలు చేస్తున్నారు.