(దండుగుల శ్రీ‌నివాస్‌)

తండ్రి చాటు బిడ్డెగా ఉంటూనే త‌న దారి త‌ను చూసుకుంటున్న క‌విత‌కు .. తాననుకున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. పాము ప‌గ తోక చుట్టంలా.. గులాబీ కండువా మెడ‌లో వేసుకోకుండా.. కేసీఆర్ చిత్ర‌ప‌టాన్ని మాత్రం వాడుకుంటూ త‌న కార్య‌క‌లాపాలు చేస్తున్న క‌విత‌కు డ‌బుల్ గేమ్‌కు కేసీఆర్ చెక్ పెట్టేశాడు. పార్టీ నుంచి ఆమెను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇక ముసుగులో గుద్దులాట‌లుండ‌వు. కేసీఆర్‌కు ఇది న‌చ్చ‌దు. క‌విత ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే ఇదంతా చేస్తుంద‌నే అప‌ప్ర‌ద‌ను, ప్ర‌చారానికి పుల్‌స్టాప్ పెట్టాల‌నుకున్నాడు. దీనికి వేదిక‌గా తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం (టీజీబీకేఎస్)ను వాడుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి క‌వితే గౌర‌వ అధ్య‌క్షురాలు.

కానీ ఆమెను ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌కు పూర్తి ఇంచార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించేశారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఈ సంఘం ప్ర‌తినిధుల‌తో మీటింగు పెట్టుకున్న కేటీఆర్ ఈ మేర‌కు ఈ నిర్ణ‌యాన్ని స్వ‌యంగా త‌నే ప్ర‌క‌టించాడు కూడా. క‌విత ఇష్యూను కేసీఆర్ చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఆమెను ఇలాగే వ‌దిలేస్తే పార్టీకి మ‌రింత న‌ష్టం వాటిల్లుతుంద‌ని భావించాడు. తీన్మార్ మ‌ల్ల‌న్న తో జ‌రిగిన వివాద ఉదంతంలో పార్టీ నేత‌లు ఎవ‌రూ చ‌ప్పుడు చేయ‌లేదు. పార్టీ గొడుగు కిందే ఉన్న‌ట్టుగా ఉంటూ త‌న సొంత ఎజెండాను అమ‌లు చేస్తే ఇంకా చూస్తూ సైలెంట్‌గా ఉంటే.. మ‌రింత న‌ష్టం జ‌ర‌గడం ఖాయ‌మ‌ని కేసీఆర్ భావించాడు.

అందుకే ఈ విధ‌మైన నిర్ణ‌యంతో ఆమెకు పార్టీకి ఇక ఎలాంటి సంబంధాలు లేవ‌నే సంకేతాలిచ్చాడు గులాబీ బాస్‌. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే కవిత కూడా త‌ను గురువారం ఉద‌యం త‌న నివాసంలో ప్రెస్ మీట్ పెడుతున్న‌ట్టు రాత్రి హ‌డావుడి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మీడియాతో చాలా విష‌యాల్లో క్లారిటీ ఇవ్వ‌నుంది. ఇంకా ఆమె డబుల్ గేమ్ ఆడే ప‌రిస్థితి లేదు. జ‌నం న‌మ్మ‌రు. ఇప్ప‌టికే క‌విత కార్య‌కాలాపాల‌పై చాలా అనుమానాలున్నాయి. ఆమె మాట‌ల్లో క్లారిటీ మిస్స‌వుతోంది. ల‌క్ష్యం ఒక‌టి.. చేస్తున్న ప‌నులు వేరు… మొత్తానికి జ‌నాన్ని చాలా క‌న్ఫ్యూజ్ చేసే కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్న‌దామె. దీని వ‌ల్ల బీఆరెస్ పార్టీకి చాలా డ్యామేజీ జ‌రిగింది.

మొన్న‌టి వ‌ర‌కు ఓపిక‌గా ఉండి అన్నీ గ‌మ‌నిస్తూ వ‌చ్చిన కేసీఆర్.. ఇక క‌విత ఆశ‌ల‌కు, ఆలోచ‌న‌ల‌కు, దూకుడుకు క‌ళ్లెం వేయ‌నున్నాడు. ఆమెకు ఇక పార్టీకి రాం రాం అనే సంకేతం ఇచ్చేశాడు. ఇక తాడోపేడో నువ్వే తేల్చుకో అని క‌వితకు ప‌రోక్షంగా తేల్చి చెప్పేశాడు.

Dandugula Srinivas

Senior journalist

8096677451

You missed