(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ ఉద్యమంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయన విలేకరులతో కలిసిపోయే తీరు.. ఇప్పటికీ కొంతమంది ఆనాటి ఉద్యమనేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు మీడియాలో అన్ని సెక్షన్లు కేసీఆర్న మోశాయి. కమ్యూనిష్టు భావజాలం ఉన్న జర్నలిస్టులకు కేసీఆర్ నడవడిక నచ్చదు. అయినా తెలంగాణ కోసం తప్పలేదు. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ మారిండు. స్వయంగా తనే చెప్పుకున్నాడు. మాది ఫక్తు రాజకీయపార్టీ అని. ఇక వీరందనీ మోస్తూ పోతే .. నా బతుకు బస్టాండే అనుకున్నాడు కాబోలు. తెలంగాణ వచ్చిన తరువాత అత్యంత హీనంగా చూడబడ్డవాళ్లు, అత్యంత ఘోరంగా అణగదొక్కబడినవాళ్లు, అవమానాలపాలైన వాళ్లు, ఆత్మగౌరవం చంపుకుని బతికినవాళ్లు ఎవరైనా ఉన్నారంటే ఆ జాబితాలో మొదటి వరుసలో తెలంగాణ జర్నలిస్టులుంటారు. అంతటి ఘోర అవమానాల పాలు చేసిండు కేసీఆర్.
అదే పాపం శాపంలా వెంటాడింది. ఎవరూ వదల్లేదు. విలేకరులూ వదల్లేదు. ఇది ఎవరి జాగీరు కాదని తేల్చి చెప్పారు. ఫలితం చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ మీడియా అంటే ఎంతో గౌరవాన్ని ప్రదర్శించాడు. తెలంగాణ ఉద్యమమప్పుడు జర్నలిస్టులు కేసీఆర్‌ను ఎంతలా ఓన్ చేసుకుని మోశారో… అంతకంటే ఎక్కువగా రేవంత్‌నూ మోశారు. పదేళ్ల పాలన చూసిన తరువాత. అది కేసీఆర్ మీద కోపమే. అహంకార, నియంత పాలనకు ఓ గుణపాఠంగానే. అంతే తప్ప రేవంత్‌లో ఏదో ఉందని కాదు. తప్పుదు కాబట్టి రేవంత్‌ను ఎంచుకున్నారు. అంతే. బండి కింద కుక్క నడుస్తూ ఆ బండి తన వల్లే నడుస్తుందనుకున్నట్టు… రేవంత్ కూడా భ్రమపడ్డాడు.
అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు మెయిన్ స్ట్రీమ్ మీడియా దాసోహం అన్నది. అధికారం వల్ల వచ్చిన మార్పు అది. కేసీఆర్ లోని సహజ నియంత పోకడలు దీన్ని మరింత ఆస్వాదించాయి. అధికారం చేతిలో ఉంటే ఎవరైనా తలొగ్గాల్సిందేననే తలబిరుసు వంట బట్టించుకున్నాడు. అసలు మీడియానే చిన్నచూపు చూశాడు. పరిస్థితుల రీత్యా అలా ఉండాల్సి వచ్చిందే తప్ప… పాలకుడు రీతి, తమ పాలిట వ్యవహరిస్తున్న తీరును వారు గమనిస్తూనే ఉన్నారు. అవహేళనలు, పట్టింపులేని తనాన్ని పసిగడుతూనే ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాదే పరిస్థితి ఇలా ఉంటే.. చిన్న చితక పేపర్ల, చానెళ్ల రిపోర్టర్ల పరిస్థితి మరీ అధ్వానం. కుక్కల కంటే హీనం. డుబల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు.. ఉహూ ఒక్కంటంటే ఒక్కటి సరిగా అమలైంది లేదు.
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ చేతులు కట్టుకుని నోరు కుట్టుకుని కూర్చున్నాడు. అదును చూసి దెబ్బ కొట్టారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పంపారు. ఇప్పుడు రేవంత్ వంతు. అధికారంలోకి రావడానికి మీడియా స్వచ్చంధంగా, ఇతోధికంగా పనిచేసింది. అప్పుడు తీన్మార్ మల్లన్నలాంటి జర్నలిస్టు ముసుగులో ఉన్న అరాచకవాదిని సపోర్టు చేసి ఉస్కో ఉస్కో అన్నాడు రేవంత్. ఎట్లాగైనా అధికారంలోకి రావాలి అంతే. వచ్చాడు. కానీ ఏమైంది. కొద్ది కాలంలోనే మీడియాను అసెంబ్లీ సాక్షిగా బట్టలిప్పి కొడతా బిడ్డా అన్నడు. ఎవడు జర్నలిస్టు ఎవడు గొట్టంగాళ్లు.. మీరే తేల్చండి మిత్రులారా..! అని సీనియర్ జర్నలిస్టులతో అన్నాడు బాహాటంగానే. తల్లిని, పెళ్లాన్నీ వదలరా…రా అని బట్టలిప్పి కొడతానన్నాడు. కొంతమంది యూట్యూబర్ల అరాచకాలవి. కేసీఆర్ టైంలోనూ అవి ఉన్నాయి. వాటిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కితే సరిపోద్ది. కానీ ఆయన ఇప్పుడు సీఎం కదా మాటలు పడటం వల్ల తలకొట్టేసినట్టైంది. మరి అప్పుడు కేసీఆర్‌ను మల్లిగాడు ఉల్టాపల్టా మాట్లాడినప్పుడు…! ఉస్కో.. ఉస్కో.. శభాష్.. శభాష్.. అన్నదెవరు..?
ఇప్పుడు చెప్పబోయేది కొత్తకథ. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆరెస్‌పై మహాటీవీ ఫోన్ ట్యాపింగ్‌ను బేస్ చేసుకుని బట్టలిప్పేసుకున్నది. కేటీఆర్‌ను బరిబాతల చేద్దామనుకునే క్రమంలో తనే ముందు జర్నలిజం విలువలు వలువల్లా విడిచేసి నడిరోడ్డుపై నంగా నిలబడ్డది. దీనిపై బీఆరెస్ దూకుడుగా దాడి. ఇది కరెక్టు కాదు. అట్ల ఎంతమందిపై దాడి చేస్తరు. అవన్నీ మీరు పెంచి పోషించిన కుక్కలే. ఆ అరుపులను, గోటి,నోటి గాట్ల గాయాలను ఆపడం, తప్పించుకోవడం మీ వల్లకాదు. అంతలా పెంచారు మరి.
ఇక మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడిన మాటలైతే మరీ దారుణం.. మాకు ఆయుధాలున్నాయి. మేము చూస్తం..చంపుతాం. నరుకుతాం.. ఏడన్నుర్రా బై మీరు ఇంకా. అధికారం పోయినా బుద్ది మారలేదా..? ఇప్పుడు మళ్లీ సీమాంధ్ర పదం గుర్తొచ్చిందా…? ఇంతకన్నా విడ్డూరం మరోటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. ఇద్దరూ పోలోమని ఆ మహాటీవోడి దగ్గరకి పోయి ఊకో ఊకో అని ఓదార్చడం. అంటే వాడు కేటీఆర్ మీద బరిబాతల థంబ్‌నెయిల్ పెట్టే స్థితికి దిగజారినా.. అది మనకు ఓకే అన్నమాట. మన పాలసీకి వాడు అనుకూలం. కాబట్టి వాడి మీద దాడి మన మీద దాడే. అంతే కదా పొన్నం. అంతే కదా మహేశ్. అంతే కదా సీఎంసాబ్…! మనదాక వస్తే అంతే. అంతే అంతే….!
Dandugula Srinivas
Senior Journalist
8096677451