(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. తన ఆలోచనలు తారుమారయ్యాయి. అపర చాణక్యుడిలా పేరు గడించినా.. రాజకీయాలు ఇట్లా తలకిందులు కాకతప్పదు. అవన్నీ తనకు గతంలో కూడా చాలా అనుభవాలున్నాయి. రాజకీయంగా ఇతరుల అనుభవాలనూ దగ్గర చూసినా రోజులున్నాయి. కానీ తనకు మొన్న జరిగిన డ్యామేజీ మాత్రం ఊహించలేకపోయాడు కేసీఆర్. నిజం చెప్పాలంటే ఆయన ఇప్పటికీ ఆ ఓటమి నుంచి కోలుకోలేకపోతున్నాడు. జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నాడు.
బెడిసిన కొట్టిన తన వ్యూహాల్లో లోపాలను తెలుసుకున్నాడు. వాటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డాడు. ఇందులో ప్రధానమైన సంస్కరణ… ఓడిన ఎమ్మెల్యేను ఇంచార్జిల బాధ్యతల నుంచి తొలగించడం. అప్పుడే అన్నారంతా. ఓ ముప్పై మంది సిట్టింగులను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తే మరిన్ని సీట్లు గెలిచే అవకాశాలు మెండుగా ఉండె. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడప్పుడు కేసీఆర్.
ఎందుకంటే.. అది తను చేసిన తప్పిదమే. పెంచి పోషించింది ఆయనే. వారి అరాచకాలు, అక్రమాలు, అవినీతి, బెదిరింపులు, విచ్చలవిడితనం…. అన్నీ కేసీఆర్ నోటీసులో ఉన్నాయి. కానీ ఇంకెవర్నీ అక్కడ ఎదగనీయలేదు. ఆ చాన్స్ కేసీఆర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. దిద్దుబాటు చర్యలకు దిగాడు. తొలత .. లాస్ట్ వరకూ వీరినే లాక్కొచ్చి.. ఎన్నికలకు ముందు చివరి సంవత్సరంలో ఇంచార్జిలను మార్చుదామనుకున్నాడు.
కానీ ఆ డ్యామేజీ ఇంకా పెరిగి పెద్దదవుతుందని గ్రహించాడు. లోకల్‌బాడీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైతే.. పార్టీకి ఊపు లేదు గీపు లేదు.. వారిపై ఇంకా కోపముందనే సంకేతాలు వెలువడకుండా ఉండాలంటే ఇంచార్జిలను మార్చాల్సిందేని డిసైడ్ అయ్యాడు. అందుకే ఈ ఎన్నికలకు ముందే దాదాపు 20 నుంచి 30 మంది ఇంచార్జిలను తీసేయనున్నాడు. దీనికి త్వరలోనే ముహూర్తం పెట్టనున్నాడు. ఇందుకోసం ఇంచార్జిల వేటలో ఉన్నాడు కేసీఆర్.