(దండుగుల శ్రీనివాస్)
దివంగత సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ బీజేపీ రంగు పులుముకున్నది. ఈనెల 29న నిజామాబాద్ నగరంలోని బైపాస్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా విగ్రహావిష్కరణ చేయనున్నారు. అందరికీ ఆహ్వానం అందినా ఇది పక్కా బీజేపీ కార్యక్రమంలా మారనుంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు అంతా దూర దూరంగానే ఉంటున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, సీనియర్ లీడర్‌గా ఎదిగిన డీఎస్…కేసీఆర్ మాట విని బీఆరెస్‌లో చేరాల్సి వచ్చింది. కొద్ది రోజులకే వారిద్దిరి మధ్య గ్యాప్ తీవ్రంగా పెరిగింది. పార్టీలోనే ఉంటూ, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ ఎవరితో టచ్‌లో లేకుండానే గడిపాడాయన.
చివరకు ఆరోగ్యం విషమించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినా.. దీన్ని చిన్న కుమారుడు అడ్డుకుని, ఆయన పార్టీలో చేరిన అంశాన్ని ఖండించాడు. ఇది వారి ఫ్యామిలీ గొడవగా మారింది. చాలా రోజులు డీఎస్ మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆయన ఏ పార్టీలో ఉన్నాడనే విషయాన్ని ధ్రువీకరించలేని స్థితిలో డీఎస్ అభిమానులు ఉండిపోయారు. కానీ, డీఎస్ మాత్రం తన అంతిమ యాత్ర.. కాంగ్రెస్ జెండా కప్పుకునే చేసుకోవాలనే కోరినను చివరి రోజుల్లో వెలిబుచ్చారు. అదే తన ఆత్మకు శాంతినిస్తుందని కూడా వెల్లడించారు.
ఆయన చనిపోయిన తరువాత ఇన్ని రోజులకు నిజామాబాద్ విగ్రహం పెట్టేందుకు ముహూర్తం రెడీ అయ్యింది. దీని వెనుక చిన్న కొడుకు అర్వింద్ అన్నీ తానై వ్యవహరించాడు. పదమూడున్నర అడుగుల ఎత్తుతో ఉన్న కాంస్య విగ్రహం కోసం రూ. 42 లక్షలు ఖర్చుపెట్టారు. ఇది పక్కా బీజేపీ కార్యక్రమంలా మారడంతో .. కాంగ్రెస్ శ్రేణులు దూరం దూరంగా ఉండటం చర్చనీయాంశమైతున్నది.
