(దండుగుల శ్రీనివాస్)
కోట శ్రీనివాసరావు డైలాగ్ ఉంది ఏదో సినిమాలో. ఖండిస్తున్నామంటే ఖండిస్తున్నం..అంతే భయ్. అట్లనే ఉంది కవిత ఖండన ప్రకటన.
ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదు. తండ్రిని ఎదురించి ఇప్పట్లో పార్టీ పెట్టలేదు. కానీ తండ్రి పట్టించుకోకపోవడం, అన్న అంతా నాకే … అంతా నేనే అనడం భరించలేదు… అందుకే ఇంతకు మించి ఏమీ చేయడం రావడం లేదామెకు. ఆమె పార్టీలోనూ ఉంటూ వేరు కుంపటి నడుపుతున్నది. ఇంట్లోనే ఉంటు ఇంటి వాళ్లనే రచ్చకీడుస్తున్నది. కానీ అది తెలవకుండా. అందరికీ అర్థం కాకుండా. అసలు ఆమె అంతరంగం ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ అర్థమయ్యేవాళ్లకు అర్థమైపోతున్నది.
తండ్రికి లేఖ రాసింది. మీరు దేవుడే కానీ చుట్టూ దయ్యాలున్నాయన్నది. బీజేపీలో విలీనం వద్దే వద్దు.. నేను అడ్డుకుంటానన్నది. తండ్రి మాట జవదాటని బిడ్డనే ఐతే .. ఇలా లోపల రహస్యంగా అంతర్గతంగా జరిగే ముచ్చట్లను బయట పెడుతదా..? అసలు లేఖ ఎవరు లీకు చేశారని దబాయించిన ఆమె.. లేఖలో బీజేపీలో పార్టీ విలీనం విషయమే లేదు కదా.. మరెదెందుకు నీ నోటి ద్వారా బయటపెట్టావు..? దీని వెనుక ఉద్దేశ్యమేమిటీ..? అంటే తండ్రి చేస్తున్న తప్పులను ప్రశ్నించినట్టే కదా….? ఎందుకావసరం వచ్చింది..? ఎందుకంత ధైర్యం చేసింది..? తనను పట్టించుకోకపోవడం.. అన్నను అందలమెక్కించడం.. పార్టీ ఫండ్ వందల కోట్లకు అన్నకు చెక్ పవర్ ఇవ్వడం, పార్టీకి ప్రెసిడెంట్ చేస్తాననడం… రాబోవు రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రీ అతగాడేనని డిసైడ్ చేసేయడం.. ఇలా ఇవన్నీ కారణాలే ఆమె కడుపుమంటకు.
కానీ బయటకు రాలేదు. తండ్రిని కాదని రాజకీయాలు చేయలేదు. అన్నను నేరుగా ఎదురించలేదు. అందుకే ఉద్యమకారులు అన్యాయమైపోయారు.. బీసీలకు దిక్కులేదు. మహిళలను పట్టించుకోలేదనే కారణాలు ఆమెకు ఇప్పుడు అస్త్రశస్త్రాలయ్యాయి. పార్టీ గెలిచి కేసీఆర్ సీఎం అయితే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదేమో కవితది. ఇలాంటి స్టెప్స్ తీసుకునేదీ కాదేమో…! కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఇలా తన ఉనికి కోసం కొట్లాడక తప్పని పరిస్థితి ఇంటా బయటా. అందుకే మొన్న కాళేశ్వరం పై కేసీఆర్‌కు నోటీసులపై ధర్నా చేసింది. తండ్రి ఫోటోలు.. జాగృతి కండువాలు. గులాబీ కండువాలకు ఆమె గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు అన్నకు ఏసీబీ నోటీసులపైనా అట్లనే స్పందిస్తున్నది. అన్యాయం అంటున్నది. కక్ష సాధింపేనని ఖండించేసింది.
అదేందీ..? కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో ఇది ప్రధాన.. మెయిన్.. ఇంపార్టెంట్ దయ్యం కదా.. ! మరి ఆయనకేం అయితే నీకెందుకు..? దయ్యం దయ్యమే.. ఖండన ఖండనే…. ! ప్రతిపక్ష పార్టీగా ఉంటే… వేరే పార్టీగా ఉంటే అధికార పార్టీ చర్యలను ఖండించకపోయేదా..? శత్రవుకు శత్రువు మిత్రుడే కదా … ఆ కోణంలో ఖండించి ఉంటుంది. లేదా పార్టీలోనే ఉన్నా.. ఇంకా బయటకు పోలేదు… దూరం పెట్టాలనుకుంటే కుదరదు. నా లెక్క నాకు తేలాల్సిందే… అప్పటి వరకు నేనే మీకు దయ్యమై నీడలా వెంటాడుతా అనే వార్నింగూ కావొచ్చూ…! ఏంటీ అంత అర్థముందా ఆ ఖండనలో. అవ్..లేదా మరి. ..!