(దండుగుల శ్రీనివాస్)
కవిత డిసైడ్ అయిపోయింది. ఇక జాగృతి వేదికగా తన దారి తను చూసుకుంటున్నది. ఎక్కడా పార్టీ కండువా లేదు. అంతా జాగృతి కండువాలే. కేసీఆర్ బొమ్మ మాత్రం వాడుకుంటున్నది. తెలంగాణ జాగృతి పేరు మీదే పార్టీ స్థాపించే ఆలోచన ఆమెకున్నది. అందుకే ఆమె ఇప్పుడు పార్టీ ప్రస్తావన తేకుండా జాగృతి ద్వారానే కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కలరింగిస్తూ దూసుకుపోతున్నది. మొన్నటి వరకు బీఆరెస్ ఆదేశిస్తే గానీ ముందుకు సాగని ఆమె.. ఇప్పుడు సొంతంగా తన కార్యాచరణను రూపొందించుకుంటున్నది. కేసీఆర్‌ను కాదంటే భవిష్యత్ లేదు. రాజకీయంలో రాణించలేదు. అది ఆమెకు తెలుసు.
ఇప్పుడే పార్టీ పెట్టే ఆలోచన లేకున్నా.. ట్రయల్ రన్‌లా కార్యక్రమాల నిర్వహణ జరుగతూ వస్తోంది. శత్రువుకు శత్రువు మిత్రుడే అన్నట్టుగా బీజేపీని టార్గెట్ చేసిన కవిత… కాంగ్రెస్‌తో అంతర్గతంగా సఖ్యతగా ఉంటూ వస్తోంది. ఇలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, తనపై జనం విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ను, రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నది. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టు సాగుతోంది కవిత వ్యవహారం. సేమ్ కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ. ఆమెకు తండ్రే కాదు.. ఆయన రాజకీయ గురువు కూడా.
అందుకే పార్టీని వీడటం లేదనే సిగ్నల్ ఇస్తూనే ..కేసీఆర్ కాదని బతకలేననే సంకేతంగా 4న కేసీఆర్‌కు నోటీసులపై ఆందోళనకు దిగింది. కేటీఆర్ చేయలేనివి, కేసీఆర్ ఊహించనవి ఆమె చేస్తూ పోతుందన్నమాట. పార్టీ కానీ తన పార్టీ ఆఫీసు ద్వారా ఆమె ఇక జిల్లాల పై కూడా దృష్టి పెట్టనుంది. బలోపేతం చేసేది జాగృతిని కాదు. ఆ ముసుగులో కొత్త పార్టీకి జవసత్వాలను. అదన్నమాట సంగతి.