(దండుగుల శ్రీనివాస్)
రాహుల్‌గాంధీ విషయంలో సోనియా చేసిన తప్పిదాన్ని తనెప్పుడూ చేయబోనని చెప్పాడు కేసీఆర్ గతంలో. ఒక్కసారి రాహుల్‌ను పీఎం చేస్తే సరిపోతది… ఇక భవిష్యత్ రాజకీయాల్లో మాజీ పీఎం హోదాలో కొనసాగుతాడు. ఆ గౌరవం ఉంటుందనేది కేసీఆర్ భావన. అదే ఫార్మూలాను ఇక్కడ అమలు చేయాలనుకున్నాడు. కొడుకు కు ఒక్కసారంటే ఒక్కసారి సీఎంను చేసి వదలాలని కేసీఆర్ తీవ్రమైన కోరిక. కానీ ఆ చాన్సు ప్రతీసారి బెడిసికొడుతూ వస్తుంది. అయినా పోరాడుతున్నాడు. కొడుకు మీద ఆరాటం అలాంటిది సమయం కలిసిరావడం లేదు తండ్రీకొడుకులకు. మధ్యలో ఈ కవిత వారికి పంటి కిందరాయిలా అడ్డుపడుతున్నది.
ఏదో జాగృతి పెట్టుకుని తనపని తాను చేసుకోక.. పవర్ కావాలె.. సీఎం సీట్లో కూర్చోవాలె.. అంటే కుదురుద్దా..? అదేమన్నా పిల్లల ఆటలా..? చెబితే వినదు. ఏ తండ్రికైనా కొడుకు మీద ప్రేముంటుంది కానీ.. బిడ్డె మీదుంటుందా..? అర్థం చేసుకోదూ..! ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతూ వస్తున్న తరుణంలో లిక్కర్ కేసు తీహార్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది. దీని కారణం కేసీఆరే. తండ్రి పాపం బిడ్డెను వెంటాడింది. అదే అనుకున్నది కవిత. పోనీ బిడ్డెను జైలు నుంచి త్వరగా విడిపించాడా..? అంటే లేదు. అదే మొండి పట్టుదలతో తన రాజకీయ జీవితాన్న నాశనం చేశాడు. ఇదే అభిప్రాయం ఆమెలో. మరోవైపు క్రమంగా బీజేపీకి దగ్గరవుతు వస్తున్నాడు అధికారం కోల్పోయినంక. ఇంకా ఇంకా దగ్గరగా.
ఇది భరించలేకపోయింది కవిత. అన్నకు అందలం.. తనకు జైలు. చిప్పకూడు. నేనేం తక్కువా..? ఆడదైనంత మాత్రాన అంత చీపా..? సీఎం కాలేనా..? తనను పట్టించుకోకుండా మీ రాజకీయాల కోసం నా జీవితాన్ని బలిపెడతారా..? ఎంత కష్టపడి ఎదిగి వచ్చాను. గుర్తించాలి కదా. గుర్తించకపోగా.. ఇక తన ఆట అయిపోయింది.. పోయి ఆడుకోమ్మా.. అనే రీతిలో తండ్రి, అన్న స్పందిస్తున్న తీరు మరింత భగ్గుమనేలా చేసింది. అందుకే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమైంది. తన వల్ల ఇంచు మాత్రం కేసీఆర్‌కు నష్టం కలిగినా తను బతికే వేస్ట్ అని మాట్లాడిన కవిత.. ఇలా లేఖ రాసి నీ వల్లే ఇదంతా..! అని ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది.