(దండుగుల శ్రీనివాస్)
ప్రతీదీ రాజకీయమే అయి కూర్చుంటుంది. శవ రాజకీయాలకు ఏదీ వదలరన్నట్టుగానే ఉంది ఇక్కడ పరిస్థితి. గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సందర్శించిన తరువాత ఆయన స్పందించిన తీరు అట్లనే ఉంది. భాదిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ మీడియాతో మాట్లాడాడు. ఇక్కడ రాజకీయం మాట్లాడటానికి రాలేదన్నాడు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడానికీ రాలేదన్నాడు. ఆ వెంటనే అందుకున్నాడు. అసలు ఈ ప్రమాదంలో ఇంత మంది చనిపోవడానికి రేవంత్‌రెడ్డే కారణమన్నట్టుగా మాట్లాడాడు. చివరకు మీరేమైనా బాధిత కుటుంబాలకు సాయం చేస్తారా అంటే మాత్రం నీళ్లు నమిలాడు. తరువాత ఆలోచించి చెప్తానని చల్లగా జారుకున్నాడు. ఇదో శవ రాజకీయమనే చెప్పాలి. అంతేగా మరి. ప్రాణాలు పోతే ఏందీ..? ఎవరి రాజకీయం వారిది. ఎవరి రాజకీయ అవసరాలు వారివి. అదే జరిగిందక్కడ.
కేటీఆర్ ఏమన్నాడంటే..!
125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలోని 17 మంది చనిపోవడం మనసున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. బాధిత కుటుంబసభ్యులు ఎవరినీ నిందించడం లేదు. కాని వారు కొన్ని విషయాలు చెప్పారు. ఫైర్ బ్రిగేడు నీళ్లు లేకుండా వచ్చింది. ఫైర్ బ్రిగేడ్ వాళ్లు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారు. అంబులెన్స్ లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణం.
ఈ కనీస సదుపాయలు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతికేవని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. అగ్నిప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని కాపాడారని చెప్పారు. మాకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా చూడమని కోరారు.
నేను రాజకీయం చేయడానికి రాలేదు. ఎవరినీ విమర్శించడం లేదు. కాని ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాలి. పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లు రావడానికి కూడా వీలుకాలేదు. అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలి. తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ఇవేవి జరగలేదు. ఇది మంచిది కాదు.. అని అన్నాడు కేటీఆర్. చార్మినార్ దగ్గరకు విశ్వ సుందరీమణులను తీసుకుపోయావు గానీ, ఇక్కడ పరిస్థితిని గాలికొదిలేశావు అని కూడా సీఎంను అర్సుకున్నాడు చివరాఖర్లో.