(దండుగుల శ్రీనివాస్)
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అంతా పంచాంగ శ్రవణం విన్నారు. ఈ తెలుగు కొత్త ఏడాదినుంచైనా అంతా బాగుంటుందా అని ఆసక్తిగా పంచాంగం విన్నారు. ఆదాయమెంత..? ఖర్చెంత..? అవమానమెంత..? రాజపూజ్యమెంత..? లెక్కలు తీసి అంచనాలు వేసుకున్నారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌కు ఇవంటి పిచ్చి అభిమానం. నమ్మకం కూడా. అందుకే ఆయన కూడా ఆసక్తిగా పంతుళ్ల కాళ్లకు దండం పెట్టి బాగుండాలని కోరుకుని పంచాంగ శ్రవణం చెప్పించుకున్నాడు. విన్నాడు. ఆదాయం, వ్యయంతో ఆయనకు పనిలేదు. ఇంట్రస్టూ లేదు.
రావాల్సిన ఆదాయానికి మించి ఉంది. లెక్కలేని ఆ ఆదాయం గురించి లెక్కలేదు. అసలెంత జమైందో లెక్కేలేదు. కాబట్టి దాని గురించి కించిత్ లేదు ఆలోచన. ఇక ఖర్చు …ఎవరి జేబుల్లోంచి తీసి ఎప్పుడు ఎక్కడ పెట్టించాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దాని గురించి కూడా టెన్షన్ లేదు. ఇప్పుడంతా ఒక్కటే దడ. రాజపూజ్యమెంత..? అవమానమెంత..? పదవి కోల్పోయి.. అధికారానికి దూరమై ఫామ్‌హౌజ్ వాసం చేస్తూ నరకయాతన పడుతున్న విషయం ఎవరికీ చెప్పుకోలేనిది. కొందరికే అది అర్థమైంది. చాలా మందికి ఆ నొప్పి తెలియదు. అందుకే ఈ కొత్త ఏడాదిలో తనకు ఎంత రాజపూజ్యం.. ? ఎంత అవమానం లెక్క తేలాలె అనుకున్నాడు. ఆసక్తిగా చూసుకున్నాడు.
కేసీఆర్ ది మేషరాశే కాబట్టి ఆ రాశిననుసరించి రాజపూజ్యం -5 ఉంటే, అవమానం -7 ఉంది. ఇది కొంత ఇబ్బందికరమే ఆయనకు. అందరూ తనను మెచ్చుకోవాలనుకునే మెంటాలిటీ. కీర్తి ఖండూతి ఓ మోతాదుగా ఉండదు. పీక్‌లో ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అవమానం అంటే … అదే తిట్టుకునేవాళ్ల సంఖ్య బాగానే ఉంది. మరిప్పుడెందుకు తనను తిట్టుకుంటారబ్బా. తనకు అవమానం పాలు 0 లేదా 1 ఉండాలె కానీ.. ఈ 7 ఎలా వచ్చింది అనుకుంటున్నాడు. తెగ బాధపడిపోతున్నారు. నిన్నమొన్ననే అనుకున్నాడు. అదృష్ణావశాత్తూ రేవంత్ సర్కార్ ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. జనాలకు బుద్దొచ్చింది. తనను రావాలంటున్నారు. కోరుకుంటున్నారు.
కానీ నేను అప్పుడే వస్తానా..? అనుభవించండి రా ఇంకా.. అని కసితీరా తిట్టుకున్న విషయాన్ని బహిర్గతం చేశాడు కూడా. కత్తి రేవంతుకిచ్చి.. నన్ను యుద్దం చేయమంటారా…! ఆయ్…! అని తిట్టిపోసిన మాటలు కూడా అందరూ విన్నారు కదా. అని పొద్దుపొద్దున్నే పంచాంగం వినగానే అనుకున్నాడు. కానీ అదే రోజు తెలిసింది. పండుగ నాడూ రేవంతు తనను వదల్లేదని. శని గ్రహం నెత్తిమీదుందని పంతులు అంటే ఏంటో అనుకున్నాడు. ఆ శనిగాడు రేవంతే అన్నమాట అనుకుని స్థిమితపడి, గాబరపడి.. ఇక తనకు ఏ నామ సంవ్సతరమైనా అవమాన నామ సంవత్సరమేనా..? అని దిగాలుపడి తనలో తాను చింతించి, మదనపడి బేర్ మన్నాడు. పండుగ నాడూ దయచూపడేమీ ఈ దరిద్రుడని తిట్టుకున్నాడు.
ఉగాది షడ్రుచుల సమ్మేళన పచ్చడి కాస్తా రేవంత్ మీటింగు తిట్లదండకంతో పచ్చివెలక్కాయ గొంతులో దిగినట్టుగా ఒక్క చేదు, వగరే జిహ్వను తాకి జివ్వుమనిపించాయి. ఇంకెన్ని అవమాన నామ సంవత్సరాలో కదా కేసీఆర్‌కు. పాపం…!