మ్యాడం మధుసూదన్
(సీనియర్ పాత్రికేయులు..)
9949774458
మరో రెండు రోజుల్లో చట్టసభల్లో ప్రవేశపెట్టనున్న 11 వార్షిక బడ్జెట్ చరిత్ర సృష్టించనుందా..? బడ్జెట్‌కు భారీ కోత తప్పదా..? సంక్షేమ పథకాలకు కోతలు తప్పవా..? వాస్తవ అంచనాలు తలకిందులయ్యాయా…? అవుననే స్పష్టమైన సమాధానం వస్తోంది ముఖ్యమంత్రి మాటలను చూస్తుంటే. చట్టసభ సాక్షిగా.. స్టేషన్ ఘన్‌పూర్ బహిరంగ సభ సాక్షిగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించడమే కాకుండా బడ్జెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి. అప్పుల మీద అప్పులు.. మిత్తీల మీద మిత్తీల తిప్పలతో సంక్షేమ పథకాల మెడపై కత్తిపెట్టక తప్పడం లేదని గతంలో ఏ ముఖ్యమంత్రిర కూడా అనని విధంగా రేవంత్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వాస్తవం డిజిటల్ మీడియా ముందుగా చెప్పినట్టు … రాష్ట్ర ఖజానాకు కాసుల కటకట మరింత తీవ్రమైనట్టు సీఎం సైతం స్వయంగా ఒప్పుకుంటున్నారు.
ఓ సీఎం బడ్జెట్ పై ఇలా మాట్లాడటం తొలిసారి..!
గత వార్షిక బడ్జెట్ మొత్తం రూ. 2,91,000 కోట్లుగా ప్రవేశపెట్టినప్పటికీ రూ. 70వేల కోట్ల ద్రవ్య లోటు తప్పడం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాటలు జనవరిలో విడుదలైన కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక కంటే కఠినంగా ఉండటం విశేషం.బడ్జెట్‌కు ముందు ఒక ముఖ్యమంత్రి ఇంత తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో ఆదాయానికి, వ్యయానికి మధ్య ద్రవ్యలోటును దాదాపు రూ.50వేల కోట్లుగా చూపగా అదిప్పటికే రూ. 60వేల కోట్లు దాటింది. ఈ బడ్జెట్ సమాయానికి అది కాస్త రూ. 70 వేల కోట్లకు పెరగనుంది.
భారీగా తగ్గనున్న బడ్జెట్ సైజు…!
ఈ ద్రవ్యలోటును తగ్గించడానికి ఈసారి ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చు తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ క్రమంలో బడ్జెట్ సైజును కూడా భారీగా కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ ఖర్చులను తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని కూడా తగ్గించే పరిస్థితి కనబడుతున్నది. ఇక ఆదాయం విషయానికొస్తే… వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచి కొన్నేళ్ల పాటు కొత్త పన్నుల రాబడి 17 శాతం నుంచి 20 శాతం వరకు స్థిరంగా పెరుగుతూ వచ్చింది. బీఆరెస్ ప్రభుత్వ పతనానికి రెండేళ్ల ముందు నుంచి గ్రోత్ రేటు తగ్గుతూ వచ్చింది. ఈసారి కూడా గతంలో కంటే ఆదాయంలో వాస్తవానికి పెద్ద మార్పులేదు. అన్ని రకాల రెవెన్యూ రాబడులు కలిపి రూ. 2, 91, 000 కోట్లు అంచనా వేయగా అది కాస్తా ఇప్పటి వరకు రూ. 1, 30, 0000 కోట్లకే పరిమితమైంది. సొంతపన్నుల రాబడి కూడా 70 శాతానికే పరిమితమైంది. కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్ర వాటా కొంత ఆశాజనకంగా ఉన్నా.. పన్నేతర రాబడి, కేంద్ర పథకాల కింద రావాల్సిన గ్రాంట్లు.. 25 శాతం లోపు పరిమితమై 70 శాతం మేర గాటా పడింది. గతంలో కూడా ఇదే పరిస్థితి. కానీ ఈసారి సొంత రాబడుల్లో కూడా పెద్దగా వృద్ధి లేకపోవడం గమనార్హం.
వాస్తవాలను పక్కనపెట్టి బడ్జెట్ సైజు భారీగా పెంచి…!
ఈ క్రమంలో రూ. 2, 91, 000 కోట్లుగా ఉన్న2024-25 బడ్జెట్‌లో కుదించి 2 లక్షల 70వేల కోట్లుకే పరిమితం చేసినా ఆశ్చర్యం లేదు. వాస్తవాలను పక్కన బెట్టి బడ్జెట్ సైజు భారీగా పెంచడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. పన్నేతర రాబడిని పెంచి చూపడం, లేని కేంద్ర గ్రాంట్లను భారీగా చూపడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి.. ఈ అంచనాలను పెంచే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం.. ముందే ప్రజలకు ఈ విధంగా హింట్ ఇస్తున్నారు.
సంక్షేమ పథకాల్లో కోత తప్పదు…!
బడ్జెట్ సైజు తగ్గడంతో పాటు సంక్షేమ పథకాలకు కోత తప్పదని చెప్పకనే చెబుతున్నాడు. వార్షిక బడ్జెట్‌కు ముందే ప్రమాద గంటలు మోగుతున్నాయని చట్ట సభలో, బహిరంగ సభల్లో స్పష్టం చేస్తున్నారు. ఇక జనవరి వరకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు కాగ్ నివేదిక విడుదల చేసిన లెక్కలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే… కేసీఆర్ ప్రభుత్వం అనవసర వ్యయాలతో, అప్పులు తప్పులు అవినీతితో మొత్తం ఖజానాను ఖల్లాస్ చేసిందని బహిరంగంగా చెబుతున్నారు. చరిత్ర సృష్టించే విధంగా బడ్జెట్ సైజును తగ్గించినా ఆశ్చర్యం లేదు.
కాగ్ నివేదిక చెప్పిందిదీ…!
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక ప్రకారం మొత్తం రెవెన్యూ రాబడి అంచనాలో ఇప్పటి వరకు 55 శాతం రాబడి కూడా రాలేదు. సొంత పన్నుల రాబడి ఇంకా 60శాతం నుంచి 65 శాతం మధ్యే కొట్టుమిట్టాడుతోంది. మొత్తం రెవెన్యూ రాబడి భారీగా తగ్గింది. అప్పుల శాతం మాత్రం బాగా పెరిగింది. ఆదాయం తగ్గింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు.. అంటే రియల్ ఎస్టేట్ ఆదాయం దాదాపు 60 శాతం ఆందోళనకరమైన రీతిలో పడిపోయింది. పన్నేతర రాబడి కేంద్ర ప్రయోజిక పథకాల కింద రావాల్సిన రాబడి కేవలం 20 శాతానికే పరిమితమైంది. ఒక వాణిజ్య పన్నుల, ఆబ్కారీ ఆదాయం మాత్రమే 70 శాతం దాటింది. కేంద్ర పన్నులలో రాష్ట్రం వాటా కింద రాబడి కొంత ఆశాజనకంగా ఉంది. అప్పులు అనుకున్నదానికంటే రూ. 10వేల కోట్లు ఎక్కువగా పెరిగింది. వాస్తవానికి 2024-25 సంవత్సరానికి మొత్తం పన్నుల రూపంలో రూ. 2.21 లక్షల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. అదిప్పుడు కేవలం జనవరి ఆఖరి నాటికి రూ. 1.23 లక్షల కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. అంటే ఇది మొత్తంలో 55 శాతంగా ఉంది. సొంత పన్నుల రాబడిలో 65 శాతం మాత్రమే దాటింది. రాష్ట్ర సొంత పన్నులో రూ. 1.44 లక్షల కోట్లకుగాను రూ. 90వేల కోట్ల వరకు మాత్రమే రాబడి వచ్చింది. వాణిజ్య పన్నుల వసూళ్లు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. వాణిజ్య పన్నుల ద్వారా రూ. 58వేల కోట్ల రాబడి అంచనావేయగా ఇప్పటికే రూ. 42వేల కోట్లు వసూలైనవి. ఎక్సైజ్, వ్యాట్ విలువ ఆదారిత పన్ను రూపంలో రూ. 33వేల కోట్లకు గాను రూ. 26వేల కోట్లు వసూలైనవి. ఇది కొంత ఆశాజనంగా ఉంది. ఇక ఎక్సైజ్ (అబ్కారీ) ద్వారా రూ. 25వేల కోట్లు రాబడి అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ. 15వేల కోట్లు దాటింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం దారుణంగా పడిపోవడం రియల్ ఎస్టేట్ వాస్తవ పరిస్తితికి అద్దం పడుతున్నది. రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 18వేల కోట్లు వస్తాయని ఆశించగా జనవరి ఆఖరు నాటికి రూ.5, 800 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది మొత్తంలో 31 శాతంగా ఉంది.