(దండుగుల శ్రీనివాస్)
చెవులకు పట్టిన తుప్పు వదిలింది. ఇక రక్త కన్నీరే మిగిలుంది. అదే అరిగిపోయిన రికార్డు విని. అదే అప్పుల లెక్కలు వినీ వినీ. పోయినోడు మంచిగున్నడు. వచ్చినోడూ మంచిగనే ఉన్నడు అధికారం అనుభవిస్తూ. మధ్యలో వచ్చింది జనాలకే. చచ్చింది గొర్రె. ఇది ఇంట్రవెల్లేనట. ఇక మున్ముందు సినిమా ఉందట. ఏం సినిమా..! అదే అప్పుల సినిమా. ఏం చేప్తారట…? మనమెంత అప్పుల పాలైంది. ఏం చూపిస్తారట. మనం ఎంతగా కోలుకోలేకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
ఇదంతా ఎవడికి లాభమట. ఎవడింటాడట. ఎవడికి కావాలట. వింటేనే కదా అసలు సంగతి తెలిసేది. తెలిస్తే. తెలిస్తే మాటికి మాటికి మాకేటీ మాకేటీ అని అడుగరు కదా. మేమేమన్నా గొంతెమ్మ కోర్కెలేమన్నా కోరితమా ఎట్లా..? ఇచ్చిన హామీలే కదా. నోటి వెంట చెప్పి మాటలే కదా. అవును. అప్పుడు చెప్పిండు. ఇప్పుడు ఇల్లుగుల్లంటుండు. అయితే..! మేంమేం కావాలె. తాగుబోతు జాతిపితను రోజూ తిట్టాలె. తిడితే. ఇన్ని అప్పలెందుకు చేసినవని గల్లాపట్టి అడగాలె. అడిగితే. నువ్వు చేసుట్లనే మాకు ఏ పథకాలు అందుతలేవని నిలదీయాలె. కడిగియాలె. తరిమికొట్టాలె. బొందపెట్టాలె. అప్పుడిస్తవ. కాదు అప్పులుతేను. మరి అప్పులు తేకపోతే ఎట్లా గడిచేది ఇల్లు.
ఇప్పటికే అప్పుల కోసం అప్పులు తెచ్చి తిప్పలు పడితి ఇంత చెప్పినా చెవికెక్కలే. మరి అభివృద్ది, పథకాలు. సంపద సృష్టిస్తా. ఎప్పుడు. జర నిదానంగా. ఓపిక పట్టాలె. ఇంకెన్ని రోజులు. పదేండ్లు అధికారంలో ఉండి లక్ష కోట్లు సంపాదించినోన్ని అడుగతలే గానీ నన్ను దబాయిస్తున్నరా..? నువ్వే కదా అన్ని మాటలు చెప్పినవ్. నమ్మి ఓట్లేసినం. అవును.. నేను కూడా ఏదో చేద్దామనుకున్నా. ఇట్లుందని ఎవనికి తెలుసు. గవన్నీ తెల్వద్. మాకు కావాలె. మాయి మాకు కావాలె. అప్పులు తేనంటవు. అప్పు ముప్పంటవు. అప్పులు తెచ్చినోడి గురించి రోజు చెబుతా పోతే మాకొచ్చేదేంటీ చిప్ప చేతికి తప్ప.
ఇంట్రవల్ తరువాత సినిమాకు శుభంకార్డు పడతదా..? లేకపోతే అప్పు చేసి పప్పు కూడా తినొద్దని హితవు పలుకులతో ముగింపేనా. అప్పటి వరకు వేచిచూడాలె. మరి అప్పటిదాకా రోజులెట్లా గడవాలె. అప్పులిచ్చెటోడు కూడా దొర్కుతలేడాయె. నమ్మకమే లేకపాయె ఆనికి. అప్పిస్తే వీడెట్ల తీర్చుతడు ఈ సర్కార్లని. ఒక్కటర్థమైంది మొత్తానికి. అప్పుల కుప్పల రాజ్యంల చిప్పల బతుకులు ఇక తప్పవని.