(దండుగుల శ్రీనివాస్)
సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్లో .. రాజకీయాల్లో దాని ప్రాభవం, ప్రభావం ఎంతో చెప్పకనే చెబుతున్నారు లీడర్లు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కకు పోయింది. ఇప్పుడు సోషల్ మీడియా శకం నడుస్తోంది. అంతా దీనిపైనే దృష్టి పెట్టారు. ఏ చిన్న విషయమైనా దాన్ని చీల్చి చెండాడుతూ క్షణాల్లో , నిమిషాల్లో జనాల చేతుల్తో డిస్కషన్‌కు పెట్టే శక్తివంతమైన ప్రసార సాధనంగా మారింది ఈ సోషల్ మీడియా. ఇది పాత ముచ్చటే. మరి ఎందుకు కొత్తగా ఈ పాత పాట. సరే విషయానికొద్దాం. ఇవాళ ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో మాట్లాడే సమయంలో పదేపదే ఈ ముచ్చటే వచ్చింది ఆమె నోటి వెంట.
అంటే తను మాట్లాడిన మాటలకు ఆధారం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, అభిప్రాయాలు అని ఆమె చెబతూ తన స్పీచుకు బలాన్ని చేకూర్చుకుని ప్రయత్నం చేసింది. జయహే జయహే తెలంగాణ జననీ జయకేతనం..తెలంగాణ అధికారిక గీతానికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని ఎందుకు ఎంచుకున్నారని ఆమె ప్రశ్నించింది. తెలంగాణలో ఎవరూ మ్యూజిక్ డైరెక్టర్లే లేరా అని కూడా అడిగింది. అయితే ఆనాడు ఈ గీతాన్ని కేసీఆర్ ఎందుకు తిరస్కరించాడు..? ఆంధ్రోళ్లు అనే మాట ఇప్పుడు అవసరానికి వాడుకుంటున్నారే తప్ప.. వారి కాళ్లల్లో ముల్లు గుచ్చితే పంటితో తీస్తామన్న కేసీఆర్ మాటలు ఇంకా మరిచిపోలేదు.
సరే అది వేరే టాపిక్. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సోషల్‌మీడియా మొత్తం వ్యతిరేకించింది అని చెప్పుకొచ్చిన ఆమె.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో కూడా బతుకమ్మ లేకపోవడం, కనీసం బోనమైనా పెట్టాల్సిందని చెప్పి ఇది సోషల్ మీడియా అంగీకరించలేదని, తెలంగాణ సమాజం మెజారిటీగా ఈ తల్లి విగ్రహాన్ని ఒప్పుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి సోషల్ మీడియా లీడర్లను ఎంత ప్రభావితం చేస్తుందో… వాటిని ఎంతలా పరిగణలోకి తీసుకుంటున్నారో ఆమె మాటల్లో మరోసారి నిరూపితమైంది.