(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ ఏర్పడ్డదే కొలువులు సాధన కోసం. ఒక సర్కార్ కొలువు ఆ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో.. ఆర్థిక పరమైన భరోసా ఎలా కల్పిస్తుందో సూటిగా వివరంగా చెప్పాడు ఎమ్మల్సీ కోదండరామ్. మండలిలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ సర్కార్ కొలువులపై రెండు సర్కార్ల పనితీరుపై ఇచ్చిన వివరణ బాగుంది. ఆలోచింపజేసేలా ఉంది. నిజాలే ఉన్నాయి. అబద్దాలు లేవు. ఆ ప్రభుత్వంలో ఏం చెప్పారు.. ఎన్ని సర్కార్ నౌకర్లిచ్చారు..? ఈ సర్కార్ ఏం చేసింది..? అని గణాంకాలతో సహా వివరించిన ఆయన… ఈ సర్కార్‌కు సర్కార్ ఉద్యోగాలపై సూచన చేయడం బాగుంది.
నిరుద్యోగుల పక్షాన ఆయన మాట్లాడిన తీరు పార్టీలకతీతంగా ఆకట్టుకున్నది. పదేళ్లకాలంలో 1.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇచ్చింది 85వేల ఉద్యోగాలే. మధ్యలో నోటిఫికేన్ల జారీ .. పేపర్ల లీకేజీలు.. పరీక్షలు ఆపేయడం.. నియామకాలు ఆగిపోవడం ఇవన్నీ సూటిగా సుత్తి లేకుండా చెప్పాడాయన. ఈ సర్కార్ వచ్చిన తరువాత ఏడాదిలో 55వేల ఉద్యోగాలిచ్చారని కూడా వివరించాడాయన. పూర్తి గణాంకాలతో మాట్లాడిన తీరు ఆకట్టుకున్నది. జాబ్ క్యాలెండర్ కోసం గుర్తు చేసిన వైనమూ బాగుంది.
కేరళలో ఏడాదికి ఏడాది ఏర్పడిన ఖాళీలను ఎలా భర్తీ చేస్తున్నారో.. ఇక్కడా అదే విధానం అమలు చేయాలని కోరిన పద్దతీ నచ్చిందందరికీ. ఇక ఇప్పుడున్న సర్కార్ ముందు ఖాళీల వివరాలుంచాడు ప్రొఫెసర్. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలున్నాయని, వీటిని భర్తీ చేయాలని కూడా కోరాడు. మంచి విషయం. మంచి సదర్భం. వివరించిన విధానమూ ఓకే. సూచన చేసిన తీరూ సూపర్. మొత్తానికి కోదండరామ్ చాలా రోజుల తరువాత ఇలా తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడనిపించింది.