(దండుగుల శ్రీనివాస్)
Dandugula Srinivas
8096677451
స్పీకర్‌ను దళితుడనే చిన్న చూపు చూస్తే ఏదోదో మాట్లాడాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఏతావాతా అక్కడ జరిగింది.. జగదీశ్‌రెడ్డి అన్నది చూస్తే పెద్ద తప్పేం లేదు. అసలు తప్పేకాదు. ఎందుకు..? అవును. దళితుడిని స్పీకర్ చేశారు. భేష్. అంత వరకే. ఆయన స్పీకర్‌గా ఎంత పార్టీ సభ్యుడైనా కొన్ని కండిషన్లు అమలు చేయాల్సి వస్తుంది బలవంతంగానైనా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీకే మొగ్గు చూపాలి. వారికే సపోర్టు చేయాలి. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా. బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ అదే జరిగింది. షరా మామూలే. ఇక్కడ సీన్ రిపీటే అంతే. తేడా లేదు. ప్రతిపక్షం గగ్గోలు తప్పదు. అప్పుడు కాంగ్రెస్‌కు. ఇప్పుడు బీఆరెస్‌కు. ఈ లాజిక్ తెలియని రాజకీయ లీడర్ ఎవరూ ఉండరు. సభ్యులందరికీ తెలుసు. మరెందుకీ రచ్చ. అసలేమన్నాడు జగదీశ్..??
మీరు నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయలను ఉల్లంఘించినట్టు అని స్పీకర్ అన్నాడు. కానీ అది కరెక్టు కాదు. ప్రశ్నించడం సహజంగా జరిగేది. అది రిక్వెస్టు రూపంలో ఉండొచ్చు. కొంత హార్ష్‌గా ఉండొచ్చు. కానీ హక్కుల కోసం అడగటంలోకే వస్తుందది. అదే మాట్లాడాడు జగదీశ్. సభ అందరిదీ. మీ సొంతం కాదు అన్నాడు. ఈ సొంతం కాదు అన్న దగ్గరే వచ్చింది అసలు సమస్య. దీనిపైనే కాంగ్రెస్ సభ్యులు కస్సు మంటున్నారు. సస్పెండ్ చేయాలని ఏదేదో అంటున్నారు.
కానీ జగదీశ్ ఉద్దేశం మీ సొంతం కాదు అనేది.. మీ కాంగ్రెస్ సభ్యులకే పరిమితం కాదని. కాంగ్రెస్‌కే మీరు పూర్తి స్వేచ్చ ఇచ్చి.. మా గొంతు నొక్కేస్తున్నారనే భావన ఇందులోఉంది. అంతెందుకు.. కేటీఆర్ కూడా అన్నాడు నిన్న. మీరు మాకు సమయం ఇవ్వడం లేదని. లేదు ఇస్తున్నా అన్నాడు స్పీకర్. లేదు ఇవ్వడం లేదు అని రెట్టించాడు కేటీఆర్. అంతే ఇది వారి హక్కు. స్వేచ్చ. అడుగుతారు. దీంట్లో దళిత కార్డెందుకు వచ్చింది..? ఇది కేవలం కాంగ్రెస్ అసమర్థ, చావలేని దబాయింపే తప్ప మరొకటి కాదు.
ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్నది ఏ కులం వాడైనా గౌరవిస్తారు. అది కామన్ థింగ్. మరీ దిగజారి ప్రవర్తించాలని అనుకోరు. స్పీకర్ పక్కా అధికార పార్టీకి మొగ్గు చూపి వారి పక్షపాతిగా ఉంటాడని అందరికీ తెలుసు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడూ జరిగిందది. అది జగదీశ్‌కూ తెలుసు. కానీ రచ్చ చేయాలనుకున్నాడు. చేశాడు. అడగాలనుకున్నాడు. అడిగాడు. ఇక్కడ కాంగ్రెస్ దళిత కార్డు తెరపైకి తెచ్చి జగదీశ్‌ను తద్వారా కేటీఆర్‌ను, కేసీఆర్‌ను ఇరుకున పెట్టొచ్చని భావించారు. ఇది రాంగ్ స్ట్రాటజీ. ఈ తరహా రాజకీయం అధికార పార్టీకి నష్టం. ప్రతిపక్షానికే లాభం. మొన్న కేసీఆర్ జీతం ఆపేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఇలాంటి పనికిమాలిన, ప్రణాళిక లేని, ఓ వ్యూహం తప్పిన కార్యక్రమాలను నిర్వహించడం, ఎంకరేజ్ చేయడం వారికే నష్టం. అసలు కాంగ్రెస్ పార్టీలో చెప్పేవాళ్లెవరు..? చేసేవాళ్లెవరు..? చెప్తే వినేవాళ్లెవరు..? వ్యూహాలు రచించేవారెవరు..?? వాటిని అమలు చేసేవారెవరు..? ఇవి సమాధానాలు లేని, దొరకని ప్రశ్నలు.