(దండుగుల శ్రీనివాస్)
ఎమ్మెల్సీ ఎన్నికల సాకు ముగిసింది. ఆర్బాటంగా ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడిక పంచాల్సిందే. ఇవ్వాల్సిందే. నిధుల్లేవు. ఖజానా ఖాళీ. కేసీఆర్ అప్పులకు మిత్తీలు కడుతున్నాం లాంటి మాటలిక కట్టిపెట్టాలి. రేవంత్ చెప్పి చెప్పి.. జనం వినీ వినీ విసిగిపోయారు. లాంఛనంగా ప్రారంభించారు. ఆరంభ శూరత్వంగా అవి ఆగిపోయాయి. కారణం, సాకు ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇక ఆ కోడ్ లేదు. ఎత్తేశారు. రైతు భరోసా మూడెకరాల వరకు ఇచ్చి ఆపేశారు. ముందే చెప్పాడు రేవంతు. మార్చి నెలాఖరునాటికి మొత్తం రైతు భరోసా చెల్లిస్తామని. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ నెలాఖరు కాదు కదా… వచ్చే నెలాఖరు నాటికి కూడా ఇచ్చేలా లేడు. ఏడాదంతా ఏదో సాకులు చెబుతూ కాలం గడిపినా గడుపుతాడు. కానీ ఆరోజులు ఇక లేవు. జనాలు వినేలా లేరు. ఇక చాల్రా బాబు.. అని బూతులందుకుంటున్నారు. ధరలు పెంచుతూ జనాలను మరింత రెచ్చగొట్టి తిట్లు తినేకంటే.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించడం బెటర్. కానీ ఇప్పటి వరకు అలాంటి చర్యలకు దిగకపోవడం రేవంత్ రెడ్డి అత్యంత ఘోర వైఫల్యంగాచెప్పవచ్చు. అవగాహన రాహిత్యానికి, పాలన పై పట్టులేదనడానికి కారణంగా కూడా చెప్పొచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్‌కార్డులు కూడా ఇవ్వాల్సి ఉంది. రేషన్‌కార్డుల ప్రక్రియ సులువుగానే చేస్తుండొచ్ప గానీ, రైతు భరోసా కష్టమే సర్కార్‌కు. రైతులు మంచి తిక్క మీదున్నారు. ఈ కోపం పోవాలంటే వెంటనే రైతు భరోసా డబ్బులు టకీ టకీ మని పడాల్సిందే రేవంతు. నువ్వేం చేస్తావు తెలియదు. ఇక పాత ముచ్చట్లు, కేసీఆర్‌ను తిట్టిపోసే పని కాకుండా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న చందంగా నడుచుకోవాలోయ్ నువ్వు తప్పుదు. మహిళా దినోత్సవం సందర్భంగా కోట్లు పెట్టి పత్రికలకు యాడ్స్ గుమ్మరించావు. వాటిని గుప్పెట్లో పెట్టుకోవడానికి. సొమ్ము లేదంటావు. ఖజానా ఖాళీ అంటావు. ఇలా పత్రికలను గుప్పిటత్లో పెట్టుకుంటావ్ అచ్చం కేసీఆర్‌లా. కానీ నీకు కేసీఆర్ గతి పట్టినట్టే అవుతుంది జాగ్రత్త. అంటున్నారు జనాలు.