(దండుగుల శ్రీనివాస్)
రెవెన్యూ ఉద్యోగులపై మంత్రి పగబట్టాడు. ఎన్నిసార్లు ఆయన ఇంటికి, సెక్రటేరియట్‌కు చక్కర్లు కొట్టి వినతులిచ్చినా ఆయన చిరునవ్వుతో బుట్టదాఖలు చేస్తున్నాడు. వారిపై ఆయనకెందుకంత కక్ష..? చాలా చిన్న చిన్న సమస్యలు. పరిష్కారం చాల ఈజీ. అయినా ఎందుకు నెలల తరబడి నాన్చుతున్నాడు. వినతి పత్రాలను చిత్తుకాగితాలు చేసి ఎందుకు పారేస్తున్నాడు…? ఎందుకు కనీసం స్పందించడం లేదు..? ఆయనేమైనా రెవెన్యూ ఉద్యోగులపై పగబట్టాడా..? అట్లనే అనిపిస్తుంది ఆయన వైఖరి చూస్తుంటే. ఎన్నికల సమయంలో బదిలీ పై వెళ్లిన వారిని తిరిగి స్వస్థలాలకు రప్పించాలనేది కామన్ మ్యాటర్.
కాని ఇంత వరకు అమలు చేయలేదు. రేపు, తరువాత… సరే అయిపోతుంది..! ఓకే.. చూద్దాం..!! ఇవే జవాబులు. పని కాదు. ఫైలు కదలదు. ఆదేశం రాదు. అమలు కాదు. ఇలా ఉంది పొంగులేటి వ్యవహారం. ఈ ఒక్క సమస్యే కాదు.. చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. అవన్నీ మంత్రి లెవల్లో చాలా చాలా చిన్నవి. ఒక్క నోటి మాటతో అవన్న కార్యరూపం దాల్చాలె. అమలు జరిగాలె. అమాత్యుడు మాత్రం మనుసులో ఒకటి పెట్టుకుని ఇలా పైకి రెవెన్యూ ఉద్యోగులతో నవ్వుతూ మాట్లాడతాడు. పనిచేయడు. వారిపై కసి తీర్చుకునే విధంగానే నడుచుకుంటున్నాడు.
ఏరికోరి కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్ సర్కార్‌ను తెచ్చుకుంటే ఇదేం ఖర్మరా బాబు మాకు అని అనుకుంటున్నారంతా. ఇప్పుడు పథకాల అమలు కీలకం. అందులో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ముఖ్యం. మరి ఇలాంటి సమయంలో మంత్రి మీద కోపంతో పెన్ డౌన్ సమ్మె చేస్తే… ఇప్పటికే సర్కార్ పరువు వీధికెక్కింది. ఇదే జరిగితే మరింత రచ్చకెక్కుతుంది. మంత్రి వైఖరిపై విసిగి వేసారి ఉన్న ఉద్యోగులంతా ఆ సంఘ నేతలను తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. పెన్ డౌన్ సమ్మె చేయాలని. ఇలా ఎన్ని సార్లు ఎక్కెమెట్టే దిగే మెట్టు అన్నట్టుగా ఆయన చుట్టు ప్రదక్షిణలు చేయాలని విపరీతంగా విసుక్కుంటున్నారట. విసిగెత్తిపోయారట.చిర్రెత్తి ఉన్నారట. ఇక తాడో పేడో తేల్చుకుందామనేకాడికి వచ్చింది కత.
సీఎం రేవంత్ కూడా మంత్రి శాఖలో జోక్యం చేసుకోవడం లేదు. పలు సందర్బాల్లో సీఎం దృష్టికి కూడా వీరి సమస్యలు తీసుకెళ్లినప్పుడు ఆయన లైట్‌గా తీసుకున్నాడట. ఇవి మంత్రిగారి లెవల్లో అయిపోయే చిన్న చిన్న పనులు. నేను చెప్తాలే. అయిపోతాయి. అని చెప్పి పంపాడట. కానీ ఆయన చెప్పడు. ఈయన వినడు. ఆయన జోక్యం చేసుకోడు. ఈయన పట్టించుకోడు. మధ్యలో బలికా బక్రాలు రెవెన్యూ ఉద్యోగులు. ఇలాగే ఫీలవుతున్నారు మరి.