(దండుగుల శ్రీనివాస్)
అక్క చెప్పేదేదో చెప్పక. పగ రాజకీయాలు వల్లెవేస్తోంది. ప్రతీకార కాంక్షతో రగలిపోతున్నది. చూస్కుంటాం.. మా టైం వస్తుంది. మీ పేర్లన్నీ పింక్ బుక్కులో రాయబడుతున్నాయి…! మీకు శిక్షలు ఉంటాయి.. అని చెప్పుకొస్తున్నది. బెదిరిస్తున్నది. భయపెట్టిస్తున్నది. పింక్ బుక్కులో అందరి పేర్లు రాయబడతాయని ప్రవచిస్తున్నది.ఈ పింక్ గోల గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నది. అక్క అన్న పదమే అది. బ్లాక్ బుక్ అని ఒకడు ప్రెస్‌మీట్ పెట్టాడు అప్పట్ల. వాడో పెద్ద బ్లాక్ మెయిలర్. ఓట్లేసి నన్ను గెలిపించకపోతే.. మా కుటుంబమంతా చనిపోతాం.. అని ఓటర్లే బెదిరించి గెలిచిన ఘనుడు. వాడికీ నోరు లేచింది. ఏది పడితే అది మాట్లాడేశాడు.
ఇక అక్క … బ్లాక్ బుక్ అంటే ఏం బాగుటుంది. పింక్ అంటే మన పార్టీ కలర్‌కు సరిపోతుందనుకున్నది. కలర్ మ్యాచింగ్ లాగా పింక్ పేరును తీసుకుని బుక్కు ఒకటి క్రియేట్ చేసి పెట్టింది. ఇక చూస్కుందాం.. అందరి పేర్లు అందులో ఉన్నాయి. ఒక్కొక్కడి తాటా తీస్తాం అన్నది. అచ్చంగా ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించేవిధంగా. అక్కడ చీప్ ఆంధ్రా రాజకీయాలకు మేమేమి తక్కువకాదన్నట్గుగా. ఆ పార్టీకి చెందిన ఓ సానుభూతి పరుడు, కేసీఆర్ అభిమాని, పార్టీ శ్రేయోభిలాషి దీనిపై సోషల్ మీడియాలో స్పందించాడు. ఏమన్నాడు. అక్కా. ఒక్క బుక్కెందుకు… నాలుగు బుక్కులు కావాలి నీకు అని.
అదేందీ నాలుగు బుక్కులా.. ఒక్క బుక్కులో అందరి పేర్లు పట్టవా..? అంతమందిని ఏసేయ్యాలా..? నయీం లిస్టులా చాలా పెద్ద లిస్టే ఉందా అక్క దగ్గర పగ సాధించేందుకు. అది కాదంట సామీ..! తన్నేందుకు, జైలుకు పంపేందుకు, సంపి పాతరేసేందుకు ఒక బుక్కు. అదే అక్క చెప్పిన పింక్ బుక్కు. మరి ఇంకా నాలుగు. చెప్తానుండు. రెండో బుక్కేమో… ఉద్యమకారులను మోసం చేసి వారిని పదేండ్లు కుక్కల్లా చుట్టూ తిప్పించుకుని.. ఇంటి కాంపౌండ్ వాల్ లోకి కూడా రానీయకుండా పడిగాపులు కాయించుకుని వారిని, వారి కుటుంబాలను రోడ్డున పడేసిన వారి పేర్లు రాసుకోవాలట. ఇంకో బుక్కు. అదే మూడో బుక్కు…ఎందుకో తెలుసా..! మిమ్మల్నే నమ్ముకుని ఆస్తులన్నీ అమ్ముకుని ఎప్పటికైనా వీరితోనే మా జీవితం, మా బతుకులు అని పిచ్చికుక్కల్లా తిరిగిని వారి పేర్లు రాసుకోవాలట.
ఇక నాలుగో బుక్కు… పదవులు ఇస్తారు. ఇక రేపిస్తారు. ఎల్లుండి కచ్చితంగా, ఇంకో నెలకు ఇస్తామన్నది అక్క. ఇప్పటికే వందసార్లు హైదరాబాద్‌ల అక్క ఇంటికి పోయి ముఖం చూపిచ్చుకుని దండంపెట్టి వచ్చిన…. అక్క నవ్వింది. అక్క నవ్విందంటే చేస్తా అన్నట్టే కదా. ఇగ నాకు పదవి పక్కా. పక్కా అంటే పక్కా అని పదేండ్లు ఎదురుచూపులు చూసీ చూసీ కళ్లు కాయలు కాసి విసిగి వేసారిన పింకు అభిమానుల పేర్లు రాసేందుకట. అక్కకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒక్క బుక్కంటే. నాలుగు బుక్కులు కావాలంటున్నారు. ఇంత పెద్ద లిస్టున్నట్టు అక్కకు కూడా తెల్వదు. ఏదో సినిమాలో అన్నట్టు ధర్మవడ్డీ కదా అక్క. పాపం పెరిగినట్టు పెరిగింది. అన్నట్టుగా. వడ్డీతో సహా తీర్చుకుంటానంది కదా అక్క. జైలు నుంచి రాగానే. మరి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకుంటుంది. నమ్మకం లేదా.. మీ మీద ఒట్టు బ్రదర్.