(దండుగుల శ్రీనివాస్)
నిన్నటి వరకు కాంగ్రెస్‌లో స్తబ్దత. పెరుగుతున్న వ్యతిరేతతో ఆందోళన. పట్టింపులేనితనంతో పరేషాన్. నేతల అలసత్వం, అవినీతితో పరువు బజారుపాలు. సీఎం, పీసీసీ చీఫ్ లకు చెడ్డపేరు. పరిస్థితులు చేతులు దాటుతున్నా ఏమీ చేయలని నిస్సహాయ పరిస్థితి. ఓ వైపు బీఆరెస్ ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి. ప్రజాక్షేత్రంలో ఎదురుగాలితో ఊపరాడని వైనం.. ఇవన్నీ ఒక్కరి రాకతో పలుచనయ్యాయి. దూది పింజలా తేలికైపోయాయి. అదేందీ…! ఎవరామె. ఒక్కరి రాక అంతటి ప్రభావమా..? ఇది అతిశయోక్తేమీ కాదు.
చూడటానికి ఆమె చాలా కురచ. సన్నగా పీలగా కూడా ఉంది. చిన్నకళ్లకు కళ్లద్దాలు. కళ్లజోడుల లోపలి నుంచి పరిస్థితులను పట్టి చూసే తీక్షతతో కూడిన ఆమె చూపులు. సమస్యలను ఆకలింపు చేసుకుని పరిష్కార మార్గాలు చిటికెలో వెతికే ఆమె ఆలోచనల తరంగాలను పసిగట్టే ఆమె తదేక చూపులు. పార్టీని కాపాడేందుకు, పార్టీ కోసం పరితపించే కార్యకర్తలకు ఆమె ఓ బంగారుకొండ.ఎడారిలో ఓయాసిస్సు. ఇక ఈ పరిపాలనలో మాకు న్యాయం జరగదని డిసైడయి… రాజకీయ సూసైడ్ చేసుకుందామనుకున్న వారికి సంజీవని ఆమే మీనాక్షి నటరాజన్.
ఎంపీకి చెందిన ఆమె ఓ మాజీ ఎంపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలకురాలిగా వచ్చి ఇక్కడి పరిస్థితులు. ప్రజానాడి, వారి అవసరాలు, సమస్యలను తక్కువకాలంలో బేరీజు వేసుకుని, అవగతం చేసుకుని అధిష్టానానికి విన్నవించిన పర్యవేక్షకురాలు. కాంగ్రెస్ గెలుపు కోసం, పార్టీ పూర్వవైభవం కోసం అన్ని త్యాగాలు చేసి నిటారుగా నిలిచి ఉన్న కార్యకర్తల దండు అంకుఠిత పట్టుదలను పట్టిన నిజమైన లీడర్. ఆమె ఇవాళ వచ్చింది. రాష్ట్రానికి. సింపుల్‌గా. ఓ సామాన్యురాలిగా. అధికారం రాగానే విర్రవీగి… ఎవరికీ అందకుండా, ఎవరి ఫోన్ లేపకుండా, ఫైరవీలు చేసి నాలుగు రాళ్లు వెనుకేసుకుందామని అప్పుడే చెలరేగిపోతున్న నాయకులకు సింహాస్వప్నంలా వచ్చిందామె. జబ్బకు ఓ చిన్న బ్యాగు. అంతే.
సాదాసీదాగా వచ్చింది. అందరినీ కలుసుకున్నది. హిందీలో ప్రసంగించింది. ఆమె ఏం మాట్లాడిందన్నది కాదు అందరూ చూసింది. ఆమె రాకే ఓ సంచలనంలా మారడం. రాష్ట్ర రాజకీయాలు ఆమె వైపు ఆసక్తిగా చూడటం. వార్తల్లో కేంద్రబిందువు కావడం. ఆమె సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకోవడం. పార్టీ దళారుల్లో ఓ భయం… పార్టీ శ్రయోభిలాషుల్లో ఓ భక్తి. అంతే. ఇప్పుడామె స్టేట్ పాలిటిక్స్‌లో ఓ ట్రెండ్ సెట్టర్. ఆమెల ఉండే నాయకులు చాలా తక్కువ. మాకు మేలు జరుగుతుందని ఆమె వచ్చిన ఒక్కరోజులోనే అనుకునేలా వాతావరణం ఆ పార్టీలో క్రియేట్ కావడమూ అరుదు. దటీజ్ మీనాక్షి.