(దండుగుల శ్రీనివాస్)
అధికారం పోగానే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం.. కేటీఆర్ ప్రతీ చిన్న విషయానికీ స్పందించి టెంప్టయి.. సోషల్ మీడియా వేదికగా ఏదో ఒకటి వాగుతూనే ఉండి.. పలుచనై.. హుందాతనం తగ్గి.. దిగజారి కామెంట్లు చేసి… ఇలా సాగుతోంది. ఇక నా వంతు అంటూ ముందుకొచ్చింది కవిత. గత కొంతకాలంగా ఆమె సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటు ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టింది. ఒక్కటి మాత్రం అర్థమైంది. ఆమె ఈ ప్రెస్‌మీట్ గురించి కేసీఆర్, కేటీఆర్‌లకు సమాచారం ఇవ్వలేదని. ఏం మాట్లాడాలో ఆమెకే సరిగ్గా అర్థం కాక ఏదోదే మాట్లాడేసి స్టేట్ సబ్జెక్ట్ మాట్లాడానని అనుకున్నది. ఎవరిచ్చారో సలహా, ఎవరు చేస్తున్నారో ఉచితోపదేశం.. కానీ అంతా రాంగ్ స్టెప్స్.
ఆమె ప్రెస్ మీట్‌లో మాటల తడబాటు.. గతి తప్పిన అస్త్రాల సారాంశమిది..! అవగాహన కొరవడి ఐడెంటిటీ క్రైసిస్‌లో పడి గందరగోళ అత్యుత్సాహమే కనిపించిన వైనం ఇలా..!!
@ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను చూపించింది. మిస్టరీ మరణాలు అని హెడ్డింగ్ ఆమెకు నచ్చలేదు. కానీ అది రాధాకృష్ణ వండి వార్చింది కాదు. ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్‌చాట్‌లో చెప్పిన విషయాలే. అవి ఆఫ్ ది రికార్డ్ వార్తలైనా పేపర్‌లో రాసుకుంటారు. గతంలో కూడా చాలా సార్లు జరిగాయి. కవిత కూడా రాయించుకున్నదీ విధంగా.
@ ఆంధ్రజ్యోతి వార్త చూపించి ఉద్యమంలో కూడా ఇలాగే కుట్రలు జరిగాయి. జాగ్రత్త అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిందామె. ఇప్పుడు ఉద్యమం, సెంటిమెంట్ అంటే వినరు. మరోసారి ఆ ప్రయోగం చేయాలనుకోవడమూ అవివేకమే. ఆ కథ ఒడిసింది.
@ ప్రత్యేకంగా పేపర్లలో వచ్చే వార్తల గురించి ఎంత చెప్పినా జనం నమ్మరు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవే పత్రికలు మీ బాకా ఊదాయి. కేసీఆర్ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇప్పుడు సీన్ మారింది అంతే. అప్పుడు దాన్ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడు గగ్గోలు పెట్టే వైనం జనాలకు తెలుసు.
@ ఢిల్లీలో రేవంత్ పీఎంను కలిసిన విషయం. పీఎంను కలిస్తే రాజకీయం ఎందుకు..? రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై వందసార్లు కలిసినా తప్పులేదు. ఇది పెద్దగా ఆరోపించే అంశమేమీ కాదు. ఇక రాహుల్ టైం ఇవ్వడం లేదట.. అని అందరిలాగే ఆమే నోరు జారింది. అది అంతర్గత వ్యవహారం అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసినా.. కవిత కూడా సేమ్ కేటీఆర్ లాగే మాట్లాడితే తప్ప తనకు మైలేజీ రాదని డిసైడ్ అయ్యిందనే విషయాన్ని ఇది పట్టించింది.
@ ఇక కుటుంబ పాలన గురించి. ఆమె ఎంత తక్కువగా దీని గురించి మాట్లాడితే అంత మంచింది. అది జాతీయ పార్టీ. దానికంత సీన్ లేదు. రేవంత్‌కే ఎన్ని రోజులుంటాడో నమ్మకం లేదు. ఇక మీరంటారా..? నియంత పాలన. ఏం చేయాలన్నా.. ఏం కావాలన్నా మీ కుటుంబం చుట్టే తిరగాల..! అంత ఘోరం మీరు… ! కాబట్టి ఇది బూమరాంగే.
@ ఐరెన్‌లెగ్ అనే పదం వాడింది. మరీ ఇంత అశాస్త్రీయ వాదన తలకెత్తుకోవడం ఆమెలోని ఫ్రస్టేషన్‌ను సూచిస్తోంది. నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయట. ఎలా…? కాంగ్రెసేమైనా కొత్తగా ఏమైనా కట్టిందా…? అన్నీ మీ పరిపాలనలోనేవే కదా. కడుపు చించుకుంటే కాళ్లమీదేకదా పడేది కవిత మేడమ్…! ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు..??
@ ఇక అప్పులు. కాగ్ రిపోర్టు. కాగ్ రిపోర్టు గురించి నువ్వు మాట్లాడకపోవడమే బాగుండె. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాం తో ఇన్ని వేల కోట్లు నష్టం వాటిల్లిందని కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ కాగ్ రిపోర్టునే ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తే అన్ని అంశాలు ప్రస్తావించాలి. ఒప్పుకోవాలి. అందులో నువ్వున్న కేసు తాలుకూ లెక్కలున్నాయనే విషయాన్ని, అది నిజమేనని కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందన్నట్టు పరోక్షంగా.
@ కేసీఆర్ చేసిన అప్పులకు నెలకు రూ. 6,500 కోట్లు కాదు.. తూచ్ రూ. 2,500 కోట్లే అన్నది. అప్పు అప్పే. అప్పుల కుప్ప చేసింది ఒప్పే. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. జనాలను ఇద్దరూ కలిసి ఇబ్బందులు పెట్టి మరింత పేదరికంలోకి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారనే విషయం పచ్చి నిజం. అదే వాస్తవం. ఇదందరికీ తెలుసు.
@ అంతిమంగా హైడ్రా. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పాతాళంలోకి పడిపోయిన సంగతి అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు కాదు.. కేసీఆర్ హయాంలోనే చంకనాకిపోయింది. ఉన్న బడ్జెట్ అంత పథకాలకు, ఓటు బ్యాంకు స్కీములకు పెట్టేశాడు. రియల్ రంగాన్ని ఎప్పుడూ లేపాలని అనుకోలేదు. ఏమన్నా అంటే రైతుబంధుతో భూముల రేట్లు కోట్లకు కోట్లు ఎగబాకిందని చెప్పుకుని సంబురపడ్డాడు. రియల్ రంగం పుంజుకోకపోవడం, దాని మీద ఆధారపడ్డ కార్మిక రంగాలన్నీ అప్పుడే కుదేలైపోయాయి. ఇక ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు బిల్లులే లేవు. అభివృద్ఙి ఆగింది. బిల్లులూ ఆగాయి. పనులూ నిలిచిపోయాయి. అది అప్పట్నుంచే వస్తున్న ఓ ట్రాజెడీ కవితక్క. దీనికి హైడ్రా కూడా తోడైంది. అంతే. ఇలా ఆడుకుంటున్నారు మీరిద్దరు జనాలను.