(దండుగుల శ్రీనివాస్)
పట్టభద్రులకు కోపం వస్తే అంతే. భారీ మెజారిటీతో గెలిచి తనకు ఎదురేలేదని విర్రవీగిన కేసీఆర్‌కు.. రెండోసారి సీఎం పీఠం ఎక్కిన మూడు నెలల్లోనే నెగిటివ్ ఫలితాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు జీవన్‌రెడ్డికి పట్టం గట్టారు పట్టభద్రులు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కానుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ పరిపాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. పట్టభద్రులు కరుణిస్తారా..? ఆగ్రహిస్తారా..?? అనే ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది.
ఇది బీజేపీ అభ్యర్థికి ఆయాచిత లాభం తెచ్చిపెట్టేలా ఉంది. ఇద్దరు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో పాటు సీఎం రేవంత్ కు కూడా ఈ ఎన్నిక ఇజ్జత్ కా సవాల్ గా మారింది. ప్రభుత్వం పరపతి ఉంటుందా..? ఊడుతుందా..?? అనేది ఈ ఎన్నికతో తేటతెల్లం కానుంది. సీఎం సోమవారం ఒకేరోజు మూడు చోట్ల మీటింగులు పెట్టుకున్నాడు రేవంత్. మరోవైపు సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరి మీద ఒకరు బురదజల్లు కోవడం పెరిగిపోయింది. 30 కోట్లిచ్చి టికెట్ తెచ్చుకున్నా అని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నట్టుగా కాంగ్రెస్ వైరల్ చేస్తోంది. నరేందర్‌రెడ్డి అరాచకాలివీ అనే విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తోంది బీజేపీ. మరోవైపు కొందరు పూర్వ విద్యార్థులు కూడా నరేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
సహజంగానే కాంగ్రెస్‌పై గ్రాస్ లెవల్‌లో వ్యతిరేకత పుంజుకుంటున్నది. ఈ క్లిష్ట సమయంలో మంత్రులు, రేవంత్ ఈ ఎన్నిక గెలుపును సవాల్‌గా తీసుకున్నారు. బీజేపీ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొని ఉండగా.. సీఎం టూర్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక వేడి మరింత రాజుకోనుంది.