మ్యాడం మధుసూదన్
సీనియర్ జర్నలిస్ట్
9949774458
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డీలా పడింది. కాసుల గలగల లేక అప్పుల తిప్పలు పెరుగుతున్నాయి. బడ్జెట్ సమయం ముంచుకొచ్చిన వేళ ఆర్థిక సంక్షోభం అంతే విధంగా తరుముకొస్తున్నది. సొంత పన్నుల రాబడి కూడా ఆశాజనకంగా లేదు. రియల్ ఆదాయం రికార్డు స్థాయిలో పడిపోయింది. కేంద్ర ప్రాయోజిక పథకాల కింద గ్రాంట్లకు భారీ కోత పడింది. పన్నేతర ఆదాయం నామమాత్రంగా మిగిలిపోయింది. ఒక బడ్జెట్ సమయం ముంచుకొస్తున్నా.. సమీక్షలు లేవు. ఆర్థిక వృద్ధి పై దృష్టి లేదు. అప్పులు తెచ్చుకోవడం పై ఆరాటం పెరిగింది. రకరకాల ఆదాయ మార్గాల ద్వారా ఖజానాకు కాసులను తెప్పించడంలో యంత్రాంగం అలసత్వం వహిస్తోంది. ఖజానా డొల్లతనం మరోసారి కాగ్ నివేదికలో బయటపడింది. బడ్జెట్‌కు రెండు నెలల ముందు.. జనవరి వరకు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాగ్ నివేదిక వెల్లడించింది.
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక ప్రకారం మొత్తం రెవెన్యూ రాబడి అంచనాలో ఇప్పటి వరకు 55 శాతం రాబడి కూడా రాలేదు. సొంత పన్నుల రాబడి ఇంకా 60శాతం నుంచి 65 శాతం మధ్యే కొట్టుమిట్టాడుతోంది. మొత్తం రెవెన్యూ రాబడి భారీగా తగ్గింది. అప్పుల శాతం మాత్రం బాగా పెరిగింది. ఆదాయం తగ్గింది. ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం రెండు నెలలు మాత్రమే గడువున్న కమ్రంలో ఇప్పటి వరకు మొత్తం రాబడి 55 శాతం మించలేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు.. అంటే రియల్ ఎస్టేట్ ఆదాయం దాదాపు 60 శాతం ఆందోళనకరమైన రీతిలో పడిపోయింది. పన్నేతర రాబడి కేంద్ర ప్రయోజిక పథకాల కింద రావాల్సిన రాబడి కేవలం 20 శాతానికే పరిమితమైంది. ఒక వాణిజ్య పన్నుల, ఆబ్కారీ ఆదాయం మాత్రమే 70 శాతం దాటింది. కేంద్ర పన్నులలో రాష్ట్రం వాటా కింద రాబడి కొంత ఆశాజనకంగా ఉంది. అప్పులు అనుకున్నదానికంటే రూ. 10వేల కోట్లు ఎక్కువగా పెరిగింది.
వాస్తవానికి 2024-25 సంవత్సరానికి మొత్తం పన్నుల రూపంలో రూ. 2.21 లక్షల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. అదిప్పుడు కేవలం జనవరి ఆఖరి నాటికి రూ. 1.23 లక్షల కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. అంటే ఇది మొత్తంలో 55 శాతంగా ఉంది. సొంత పన్నుల రాబడిలో 65 శాతం మాత్రమే దాటింది. రాష్ట్ర సొంత పన్నులో రూ. 1.44 లక్షల కోట్లకుగాను రూ. 90వేల కోట్ల వరకు మాత్రమే రాబడి వచ్చింది. వాణిజ్య పన్నుల వసూళ్లు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. వాణిజ్య పన్నుల ద్వారా రూ. 58వేల కోట్ల రాబడి అంచనావేయగా ఇప్పటికే రూ. 42వేల కోట్లు వసూలైనవి. ఎక్సైజ్, వ్యాట్ విలువ ఆదారిత పన్ను రూపంలో రూ. 33వేల కోట్లకు గాను రూ. 26వేల కోట్లు వసూలైనవి. ఇది కొంత ఆశాజనంగా ఉంది. ఇక ఎక్సైజ్ (అబ్కారీ) ద్వారా రూ. 25వేల కోట్లు రాబడి అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ. 15వేల కోట్లు దాటింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం దారుణంగా పడిపోవడం రియల్ ఎస్టేట్ పరిస్థితికి వాస్తవ అద్దం పడుతుంది. రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 18వేల కోట్లు వస్తాయని ఆశించగా జనవరి ఆఖరు నాటికి రూ.5, 800 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది మొత్తంలో 31 శాతంగా ఉంది.
ఇది గత కొన్నేళ్లుగా రియల్ ఆదాయంలో ఇదే తక్కువ రాబడి కావడం విశేషం. ఇక పన్నేతర రాబడి పరిస్థితీ కూడా మరింత దీనంగా ఉంది. రూ. 35వేల కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు జనవరి ఆఖరునాటికి రూ. 5,800 కోట్లు సమకూరాయి. ఇది మొత్తంలో 16 శాతంగా ఉంది. కేంద్ర ప్రయోజిత పథకాల ద్వారా రూ.25 వేల కోట్ల మేర సమకూరవచ్చని ఆశించినప్పటికీ .. ఎప్పటిలాగే ఈసారి కూడా రూ. 5 వేల కోట్లకు పరిమితమైంది. ఇది 23 శాతం దాటలేదు. ఏదైనా ఆశాజనకంగా ఉందంటే వాణిజ్య పన్నుల తరువాత … కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా మాత్రమే. కేంద్ర పన్నుల వాటా కింద రూ. 18వేల కోట్లు ఆశించగా.. ఇప్పటికే రూ. 15వేల కోట్లు వచ్చాయి. ఇది 83 శాతంగా ఉంది. అన్నిటి కంటే రికార్డు సృష్టించింది ఏందంటే.. అప్పులు. ఇవి రూ. 49వేల కోట్లు అనుమతి ఉండగా.. రూ. 58వేల కోట్లు అప్పు తీసుకున్నారు. అంచనా కంటే మించి 118 శాతానికి చేరింది. ఇంకా పెంచమని రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని అడుగుతున్నది. మరో రెండు నెలలో ఎంత పెరుగుతుందో చెప్పలేం.
పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎల్ఆరెస్, మద్యం ధరల పెంపు అస్త్రాలను సంధిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉన్నది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఆదాయంపెంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఎలా ఆదాయం పెంచుకుటుందో అనేది సవాల్ గా మారింది. పన్నేతర ఆదాయం లో భాగంగా ఇసుక తవ్వకాలు, మైనింగ్ వంటి చర్యలలో ప్రభుత్వం వెనుకబడ్డది. ఆర్థిక పరమైన సమీక్షలు లేవు. ఆదాయం ఎట్లా పెంచాలనే దానిపై దృష్టి లేదు. సమీక్షలు అసలే లేవు. ఇప్పటికి కూడా సమీక్షలు నిర్వహించడం లేదు. పన్నుల పెంపు కోసం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా ఇంత మందగమనం లేదు. బడ్జెట్ వచ్చేసింది. కానీ అసలు బడ్జెట్ పెరగడం లేదు. ప్రస్తుతం ఆదాయ పరిస్థతి చూస్తే బడ్జెట్ సైజు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం 2.90 లక్షల కోట్లుగా బడ్జెట్ ఉంది. గతంలో కొంత తగ్గించారు. ఇప్పుడు ఇంకా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందనే ఆందోళన సర్కార్‌లో నెలకొని ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.