(దండుగుల శ్రీనివాస్)
సీఎం రేవంత్‌కు తెలియకుండానే కేసీఆర్‌కు ప్రాణం పోశాడు. బీఆరెస్‌కు జవజీవాలందిస్తున్నాడు. ఇది నేనంటున్న మాట కాదు. స్వయంగా కేసీయారే ఒప్పుకున్న నిజం. ఏడాది ముగిసిన తరువాత ఫామ్‌హౌజ్ వీడాడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్‌లో (సారీ బీఆరెస్ భవన్)లో మీటింగు నడిచింది. వచ్చాడు. మాట్లాడాడు. తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ప్రజలిచ్చిన తీర్పుకు దిమ్మదిరిగి ఫామ్‌హౌజ్ నుంచి ఇప్పుడప్పుడే బయటకు వచ్చే స్థితి లేకుండే కేసీఆర్‌కు. ఎందుకంటే ఆయన జనం మీద అలిగాడు. ఎన్నికల ప్రచారంలోనే చెప్పాడు. నన్నోడిస్తే నాకేం నష్టం లేదు. నేను ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటా. మీకే నష్టం. అన్నాడు. ఓ ఉద్యమనేత, పదేళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా..? మాట్లాడిండు. తన మనస్తత్వాన్ని చాటుకున్నాడు. సరే మీటింగు విషయానికొద్దాం. అక్కడ గడిచిన పరిస్థితులను నెమరువేసుకున్నాడు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాలేదు.
డిపాజిట్టూ దక్కలేదు. దేశాన్నే మార్చుతా. చక్రం తిప్పుతా అన్న కేసీఆర్‌కు కాలం కలిసిరాలేదు. ఇంతలా ఉల్టా అవుతుందని కూడా అంచనా వేసి ఉండడు. ఎంపీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ గల్లంతయిన తరువాత .. ఒక్కొక్కరుగా లైన్ కట్టారు. కాంగ్రెస్‌లోకి. ఇక బీఆరెస్ పని ఖతమైంది. రేవంత్ లేవనీయడు. కాంగ్రెస్ .. బీఆరెస్‌ను బతకనీయదు. ఇక వెంటాడుతాడు. అన్నీ బయటకు తీస్తాడు. వీళ్లను రక్షించడం ఎవరి తరం కాదు.. ఇలాంటి ప్రచారం వాళ్లే చేసుకున్నారు. పార్టీని ఆసాంతం చంపేశారు. దాదాపుగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు కేసీఆర్. కానీ మరీ ఇంత త్వరగా తమ పార్టీకి జీవగంజి దొరుకుతుందని అనుకోలేదనుకుంటా కేసీఆర్. ఆ జవజీవాలందించింది ఎవరో కాదు రేవంతే. అవును. చెప్పకనే చెప్పుకొచ్చాడు కేసీఆర్. పాలన అంత ఈజీ కాదని ఆయనకు తెలుసు. ఎందుకంటే తనే రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి పెట్టాడు. తనిచ్చిన హామీలే అమలు చేయక చేతులెత్తేశాడు. ఎట్లాగో నెట్టుకొచ్చాడు.
రేవంత్ దీనికి మరింత జోడించాడు. ఎన్ని అబద్దాలైనా సరే చెబుదాం… అధికారంలోకి వద్దాం. అంతే. వచ్చారు. వచ్చిన తరువాత కళ్లు బైర్లు కమ్మినై. ఇక అప్పుల చిట్టా చదవడం మొదలుపెట్టారు. జనాలకేం అవసరం మీ బాకీలు. వాళ్లకివ్వాల్సినవే అడుగుతారు అంతే. బాకీపడినట్టుగా.అదే జరిగింది. ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత వచ్చి పడింది. కేసీఆర్ ముఖంలో కళ కనిపించింది. ఇలా ఇప్పుడు బయటకు వచ్చాడు. చెడామడా తిట్టాడు. వాళ్ల వాళ్లందరినీ. అందుకే పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారని కూడా అర్సుకున్నారు. కరిచేశాడు. రేవంత్‌పాలనే తనకు ప్రేతకళ నుంచి జీవకళకు తెచ్చిందనే అభిప్రాయం ఇలా వ్యక్తం చేశాడు కేసీఆర్ పరోక్షంగా, ప్రత్యక్షంగా. కానీ ఇదే ఊపు. ఉత్సాహం కొసదాకా కొనసాగాలె. అంటే మళ్లీ ఓడిన ఎమ్మెల్యేలే ఇన్చార్జిలుగా ఉండాలె. వాళ్ల మొఖం చూసీ చూసీ జనాలు విస్తుపోయి.. ఏవగించుకుంటున్నారు. ఏమి చేయలేమంటావా..? ఇదే రేవంత్‌కూ కావాల్సింది.