(దండుగుల శ్రీనివాస్)
ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు. అధికారంలో ఉన్నప్పుడైనా .. ఓడిపోయి ఏడాదైనా ఆ ఫామ్‌హౌజ్‌లోకి అడుగుపెట్టడం అందరికీ సాధ్యం కాదు. అపాయింట్‌మెంట్ దొరకాలే. అది అసాధ్యం. ఇప్పుడు చెప్పుకునే ముచ్చటేందంటే.. ఆ ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయి. అది కేసీఆర్ బర్త్ డే కాబట్టి. మరి ఇన్నాళ్లు కేసీఆర్ బర్త్‌డే చేసుకోలేదా అంటే ఫామ్‌హౌజ్‌లో చేసుకోలేదనే చెప్పాలి. ఓడినందుకు.. అక్కడే పరిమితమైనందుకు.. అక్కడే బర్త్‌డే జరుపుకున్నందుకు మొత్తానికి రావాలనుకున్నవారికి, కలవాలకున్నవారికి, కేసీఆర్‌కు విషెస్ చెప్పాలనుకునేవారికి గేట్లు తెరుచుకుని సాదరస్వాగతం పలికాయి. అభిమానం పోటెత్తింది.
మూడు నాలుగ్గంటల పాటు అలా వస్తున్నారు. ఇలా కలుస్తున్నారు. సెల్ఫీలు, ఫోటోలు చకచకా దిగుతున్నారు. వీడియోలు గుంజుకున్నారు. ఒకరి తరువాత మరొకరు. మరొకరి తరువాత ఇంకొకరు. వరుసగట్టారు. తండోపతండలుగా కదిలారు. వచ్చేవాళ్లు వస్తున్నారు. పోయేవాళ్లు పోతున్నారు. అంతా జనసందోహం. అభిమానసందడితో ఆ ఫామ్‌హౌజ్ పావనమైపోయింది. కేవలం కొంత మందికి మాత్రమే ఆ ఫామ్‌హౌజ్‌లోకి ప్రవేశం. ఇప్పుడిలా అందరికీ ఆ చాన్స్ లభించింది. మరక మంచిదే అన్నట్టు.. ఓటమి అందరినీ కలిసేలా చేసింది. కేసీఆర్‌ను కిందికి దించింది. ఫామ్‌హౌజ్‌లోకి వెళ్లిన వారంతా అదో అద్బుతంగా తలిచారు.
పనిలోపని కేసీఆర్ ఫామ్‌ను కూడా వీడియోలు తీసుకున్నారు. చూశారా మా సారు ఇక్కడ చేస్తుంది వ్యవసాయం. ఇగో ఇవే పొలాలు. ఇదే మా సారు ఫామ్‌హౌజు బిల్డింగు. అంటూ తెగ పోస్టింగులు చేసుకున్నారు సోషల్ మీడియాలో. వచ్చిన వారినంతా కలిసే ఓపిక లేక అలా పైన బిల్డింగు మీద నుంచి చేతలూపి అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయాడు కేసీఆర్. ఇన్నేండ్లు చేసుకున్న బర్త్‌డేలన్నీ ఒకెత్తయితే ఈ ఫామ్‌హౌజ్ బర్త్‌డేనే కేసీఆర్‌కు ఎన్నటికీ గుర్తుంటది కావొచ్చు. ఎప్పటికీ మరిచిపోడు కావచ్చు.