(దండుగుల శ్రీనివాస్)
తిరుగుబాటు ఎమ్మెల్యేల సపరేట్ మీటింగు, మాటా మంతీ పార్టీకే కాదు తనకే పెద్ద అవమానంగా , నష్టంగా భావించాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే దీపాదాస్ మున్షీని తీసుకువచ్చి మరీ క్లాసులు పీకాడు. మీరు ఇలా గ్రూపులు కడితే నష్టపోయేది మీరే.. నాకేం కాదు. నాకు అధిష్టానం ఆశీస్సులున్నాయి.. అని చెప్పే ప్రయత్నం చేశాడు. మీరంతా నా గ్రూపే ఉండాలి. లేకపోతే మీ ఆటలు సాగనివ్వనని ఈ మీటింగు వేదికగా పరోక్షంగా, ప్రత్యక్షంగా సిగ్నల్ ఇచ్చాడు రెబెల్ ఎమ్మెల్యేలకు, గోడ మీద పిల్లుల్లా అవకాశం కోసం ఎదురుచూస్తన్నవారికి కూడా.
పాలన ఏడాది పూర్తయినా జనాల నుంచి వ్యతిరేకత తగ్గలేదు. ఎంత చేసినా ఏదో విధంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. దీనికి తోడు సొంత గూట్లోనే కుంపటి రాజేసే శక్తులు మెల్లగా బయలుదేరాయి. వీటిని ఆదిలోనే తొక్కేయాలని సీఎం రేవంత్ భావించాడు. ఇది ప్రాంతీయ పార్టీ కాదాయే. అందునా కాంగ్రెస్. స్వేచ్చా పరిధి ఎక్కువ అందరికీ. ఇలా అవకాశం వస్తే చాలు. బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు వెనుకాడరు. అందుకే మొన్నటి రహస్య మీటింగు. ఇక వీరిని ఇలాగే వదిలి మరింత రెచ్చిపోతారని భావించాడు రేవంత్.
అందుకే ఆదిలోనే వీరిని తొక్కేయడంతో పాటు ఇకపై ఎవరూ ఇలా రెబెల్ గ్రూపులు కట్టకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు దీపాదాస్‌మున్షీని తీసుకొచ్చాడు. తనో వైపు… ఆమో వైపు.. ఇద్దరూ చెడామడా ఎడాపెడా క్లాసులు పీకి వదిలారు. కానీ ఇలా రేవంత్‌పై , సర్కార్‌పై వ్యతిరేకంగా మీటింగులు పెట్టిన వారిని మాత్రం వదిలేలా లేరు రేవంత్, పొంగులేటి. ఎందుకంటే చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా పరిపాలన కష్టంగా సాగుతుంటే అర్థం చేసుకోవాల్సింది పోయి తమ ఫైరవీలు కావడం లేదని, మంత్రులు వినడం లేదని జెండాకెక్కి జనం ముందు మరింత పలుచన చేసిన వీరికి తగిన శాస్తి మాత్రం సమయం చూసి చెప్పేలా ఉన్నారు.