(దండుగుల శ్రీనివాస్)
పాముకు పాలు పోసి పెంచామంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ సపోర్టు లేకుండానే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచాడా..? అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుల గణనపై పైత్యపు మాటలు మాట్లాడటంపై భగ్గుమంటున్నారు. ఏకంగా ఇది బీఆరెస్‌కు ఒక ఆయుధంలా మారింది. అసెంబ్లీలో ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించాడు. మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీనే ఈ కులగణన పత్రాలను కాల్చేయాలని పిలుపునిచ్చారని, దీనికి ఏం చెబుతారని సెల్ప్ డిఫెన్స్‌లో పడేశాడు సీఎంను. దీంతో సీఎం రేవంత్‌కు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.
ఇంతలా కష్టపడి కులగణన చేస్తే మనోడే దానికి తూట్లు పొడిచి పగోడికి ఆయుధంగా మారాడనే కోపం నశాళానికంటింది సీఎంకు. వెంటనే టీపీసీసీతో మాట్లాడాడు. వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై టీపీసీసీ మొదట షోకాజ్ ఇచ్చి.. ఆ తరువాత అక్కడి నుంచి వచ్చే ఆన్సర్‌ను బట్టి ..తీవ్ర చర్యలకు అధిష్టానం ముందుంచాలని భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో వాస్తవంగా అగ్రవర్ణాలు పెరిగారని, కాంగ్రెస్ చేసిన సర్వేలో అగ్రవర్ణాలు తగ్గారని చెబుతోంది టీపీసీసీ. బీసీల అభ్యున్నతి కోసమే చేసిన ఈ సర్వే.. బీసీలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడటం పట్ల సీరియస్ అయ్యింది.
మొన్న తీన్మార్ మల్లన్న నిర్వహించిన బీసీ గర్జన సభకు ఏర్పాటు చేసిన చాపర్ బీఆరెస్ సమకూర్చిందేనంటున్నారు. తీన్మార్ మల్లన్న మాటల వెనుక బీఆరెస్ కుట్ర ఉన్నదనే కోణంలో పార్టీ లోతులు గుంజుతున్నది. మరోవైపు తను సీఎం కావాలనే కోరిక కూడా ఇప్పుడు డిస్కషన్‌లోకి వచ్చింది. కాంగ్రెస్ సపోర్టు లేకుండా ఎమ్మెల్సీగా కూడా గెలవలేని వాడు.. సీఎం ఆశలు పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన, బీసీల కాన్సెప్ట్‌పై తీవ్ర విమర్శలు చేయడం మల్లన్న బలుపు మాటలకు పరాకాష్ట అని ఓ కాంగ్రెస్ లీడర్ వాస్తవం ప్రతినిధితో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.