(దండుగుల శ్రీనివాస్)
కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని పలికన కాంగ్రెస్.. క్షేత్రస్థాయిలో ఈ స్పిరిట్‌ను కాపాడుకోలేకపోయింది. అభాసుపాలైంది. మంచిపేరేమో గానీ అపవాదును మూటగట్టుకున్నది. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకరే ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంకా నాలుగైదు శాతం సర్వే జరగలేదని. కానీ అనధికారికంగా ఇది పది శాతానికి మించి ఉన్నది. ఈ బీసీ లెక్కల విషయంలో మాత్రం బీసీలంతా భగ్గుమంటున్నారు.
గత పదేళ్ల క్రితం ఉన్న బీసీలకు దాదాపు 20 లక్షలకు పైగా బీసీలను తక్కువగా చూపారు. పదేళ్లలో బీసీల జనాభా పెరగాల్సి ఉండగా.. బాగా తగ్గించడం చూపడం పట్ల ఈ సర్వే ఎవరి కోసం చేశారు..? దీని వెనుక అసలు ఉద్దేశాలేమిటీ..? అనే వాదన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఓసీల సంఖ్య గణనీయంగా పెంచి చూపారు. ఓసీలకు ఈబీసీ రిజర్వేషన్ రావడం కోసమే రేవంత్ సర్కార్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమంతుడిని చేయబోతే కోతైంది.. అన్నట్టుగానే ఈ కులగణన కూడా కాంగ్రెస్ సర్కార్ అప్రతిష్టను తెచ్చిపెట్టింది. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఇక దీనిపైనే ప్రధాన చర్చ ఉండే అవకాశం ఉంది.
మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూర్చుని ఏదో మాట్లాడటం కాదు.. అసెంబ్లీ కి వచ్చి బీసీల జనాభా, రిజర్వేషన్ల విషయంలో మాట్లాడాలనే డిమాండ్ కూడా సోషల్ మీడియా వేదికగా బలంగా వస్తోంది. నాడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేందుకు అంతా వచ్చారని, అప్పటి లెక్కలే కరెక్టుగా ఉన్నాయనే వాదన కూడా ఉంది. అప్పటి లెక్కలను పరిగణలోకి తీసుకుంటే మరి పదేళ్లలో ఇప్పుడు దానికి బీసీల జనాభా ఎన్నో రెట్లు పెరగాలి. కానీ తగ్గింది. ఇదిప్పుడు సర్వే శాస్త్రియతను ప్రశ్నిస్తోంది. సర్కార్‌ను నిలదీస్తోంది. పథకాల అమలు విషయంలో బొక్కబోర్లా పడుతూ వస్తున్న సర్కార్.. రాహుల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కుల గణన లో కూడా అట్టర్ ఫ్లాఫై కూర్చుంది.