(దండుగుల శ్రీనివాస్)
వారు చేసిందే వీరు చేశారు. అప్పుడు వాళ్లు చేస్తే రాజకీయ పునరేకీకరణ. తెలంగాణ కోసం. బంగారు తెలంగాణలో భాగం. ఇప్పుడు వీరు చేస్తే ఎమ్మెల్యేలను కొన్నారు. కోర్టు కుపోవడం. గాయి గాయి చేసి గత్తర లేపడం. తేడా అదే. అప్పుడు కేసీఆర్ ఏమి చెబితే అది వేదం. ఎందుకంటే ఆయన తెలంగాణ జాతిపిత. ఆయనో కారణజన్ముడు. మహాత్మాగాంధీ ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకోవాలని పరితపించినోడు. ఎడాపెడా ఎమ్మెల్యేలను చేర్చేసుకున్నాడు. కారణం.. ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునేందుకు. ఇంచుమించు ఇప్పుడు రేవంత్ చేస్తున్నది కూడా అదే. కానీ ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తూచ్ ఇది తొండి అంటున్నాడు కేసీఆర్ అండ్ టీమ్.
అయితే రేవంత్, స్పీకర్ దీన్ని దాటవేస్తూ వద్దామనుకున్నారు. కానీ సుప్రీం మొట్టికాయలు వేసేదాకా వెళ్లింది. ఇక ఉప ఎన్నికలు తప్పవా అనే పరిస్థితి వచ్చింది. స్పీకర్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేపై వేటు వేసే పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఇప్పుడు తాజా పరిణామలు ఎలా మారయంటే.. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా. అవును. రేవంత్ సర్కార్ ఇంకా స్టార్టింగ్ ట్రబుల్‌లోనే ఉంది. ప్రభుత్వం ఏర్పడగానే ఎంపీ ఎన్నికలు. ఆ తరువాత నిధుల కొరత. ఆ వెంటనే రుణమాఫీ. ఖజనా ఖాళీ. ఇచ్చిన హామీలు పెద్దవి. చేసింది గోరంత కూడా లేదు. చేయాల్సింది మాత్రం కొండంత ఉంది.
అనూహ్యంగా కేసీఆర్ ఓడిపోవడం. వస్తామా రామా అనే అనుమానంలో ఉన్నా రేవంత్ ముంగిట అధికారం వచ్చి వాలటం రాష్ట్ర రాజకీయాల్లో ఓ పెను సంచలనం. అదంతా కేసీఆర్ స్వయంకృతాపరాధం. మితిమీరిన అహంకారం. ఇంకా అదే అహంకారంతోనే ఉన్నాడు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు రాష్ట్ర సర్కార్‌పై జనాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఏం చేస్తానన్నావ్.. ఏం చేస్తున్నావ్..! ఇప్పుడు ఇదే అందరి నోట. కేసీఆర్ ఓడిపోగానే కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు ఏడాదిలోగా తత్వం బోధపడ్డది. ఇక్కడ సాధించేదేమీ లేదనుకున్నారు. తమ పనులు చేసుకోవాలన్నా అధికారులకు, సర్కార్ పెద్దలకు కమీషన్లు ఇచ్చే సంస్కృతికి తెరతీశారు షరా మాములుగా. వామ్మో అప్పుడేమో కుటుంబ పాలన. ఓ కేసీఆర్. ఓ కేసీఆర్. ఓ హరీశ్. ఓ కవిత. ఇప్పుడు రేవంత్ సోదరులు, ఓ భట్టి, ఓ పొంగులేటి.. మంత్రివర్గమంతా. ఎవరి దగ్గరకు పోయినా కమీషన్ కావాలె. ఆ కమీషన్‌కు ఓ లెక్కుంటుంది.
అదుంటునే పైసలు. పనులు. ఇదేందిరో. రేవంత్ తాము చెప్పినట్టు వింటాడనుకుంటే.. హచ్ కుక్కపిల్లల్లా ఈ వెంట తింపించుకోవడమేందీ..? కమీషన్లేందీ…? అని ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇక ఆ పది స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా గెలిచే సీన్ కనిపించడం లేదు. ఇంకా జనాలకు కొత్త సర్కార్ మజా దొరకలేదు. బిర్యానీ తినిపిస్తాడుకుంటే పచ్చడి మెతుకులు కూడా దొరకడం లేదు. ఏమన్నా అంటే అప్పులంటున్నారు. మరి కేసీయారే మళ్లీ సీఎం అయితే ఈ పథకాలకు ఇంత జాప్యం జరిగేదా..? ఏడ నుంచో అప్పుతెచ్చైనా పెడుతుండే కదా. అదేందీ తెలంగాణను తన అధికారం కోసం తన కీర్తి కండూతి కోసం అప్పుల కుప్ప చేసినా పర్వాలేదా..? మాకేం అవసరం. మాకు కావాల్సింది మాకిస్తే చాలు.
జనాల ఆలోచన ఇలాగే ఉంది. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్‌కు ఓనమాల నుంచి మొదలుపెట్టాల్సి వచ్చింది. పాలనపై పట్టు లేదు. అవగాహన లేదు. ఏడాది గడిచినా ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు తన శాఖలపై పట్టు సాధించలేదు. పర్సనల్ పనులే ప్రయార్టీగా కొనసాగుతున్నారు. జనాలకు విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేసిన సర్కార్ కూడా విపత్కర పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ సమయంలో బైపోల్స్ వస్తే ఇక అంతే సంగతులు. అందుకే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటంలా మారాయని చెప్పాలి. జనాలకు మజా లేదు. కానీ ప్రతిపక్షానికి మాత్రం ఈ పరిస్థితులు మస్తు కిక్కిస్తున్నాయి. అందుకే అలకవీడి కలుగులోంచి బయటకు వచ్చేందుకు కాలరు, కాలు ఎగరేసుకుంటూ ముందుకు వచ్చాడు కేసీఆర్.